3180* వ రోజు..............           21-Jul-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

                              అసలైన ఆదివారపు శ్రమ -@ 3180*

   21.07.2024 వేకువ 4.20 కే అది10 మందితో మొదలై, 6.10 కి 30 మందితో ముగిసింది. దీన్ని ఇప్పటికీ పట్టించుకోని సగంమంది గ్రామస్తులకూ, రా వీలు పడని స్వచ్ఛ– హరిత- సౌందర్యాభిలాషులకూ ఈ సామూహిక శ్రమ - సంతర్పణలోని మజా ఎలా తెలుస్తుంది?

         ప్రతి వేకువా ఠంచనుగా వచ్చి, సహ కార్యకర్తల్ని కలిసి, పరస్పరాభివాదములు చేసుకొని, ఏదొక వీధి భాగాన్ని శుభ్రపరిచి, కాఫీలు సేవించి, తమ ఊరి స్వచ్ఛోద్యమ వైభవాన్ని నినదించి, వాళ్లు పొందే ఆనందం ఒకరకం!

         గ్రామ పౌరులుగా తమ కర్తవ్య పూర్తిని గురించిన ఆనందం మరోరకం!

-తుది సమావేశానంతరం - చెమట పట్టిన ఒంటికి సైకిలు మీదనో, మోటారు బండి మీదనో ఇంటికి వెళుతూ చల్లగాలి సోకినప్పటి ఆనందం ఇంకొకరకం!

         వీలైనప్పుడల్లా - ముఖ్యంగా ఆదివారాల్లో- కార్యకర్తలకు తినుబండారమో పానీయమో అందించి, వారి ఆస్వాదనను చూసి, పరమానందించే ప్రాతూరి శాస్త్రి, పల్నాటి అన్నపూర్ణ వంటి వారిది అదొక ప్రత్యేక ఆనందం!

         వీధులకు రెండు ప్రక్కలా వేలకొద్దీ చెట్లు నాటి- పెంచడంలోనిదొక ఆనందమైతే కారణాంతరాల వల్ల వాటిని తామే నరికేది పరమానందం!

         ఇంకా - శ్మశాన సౌందర్య సాధనలో, డ్రైన్ల మురుగును పరిగెత్తించడంలో, వీధి గుంటల్ని పూడ్చడంలో ఎన్నెన్ని - ఎంతెంత సంతోషాలు లేకుండానే స్వచ్చ కార్యకర్తలు ఇన్నివేల రోజుల- మూణ్ణాలుగు లక్షల పనిగంటల శ్రమకు దిగుతారా?

ఈ ఆదివారం సంగతే తీసుకోండి:

1 ) మాజీ DSP గారి ఇంటివద్ద శుభ్రపరచిన ఆరేడుగురుగాని –

2 ) ఏడు వృక్షాలను కోసిన- నరికిన ముగ్గుర్నలుగురు గాని –

3) ఆ కొమ్మ-రెమ్మల్ని ఈడ్చుకు పోయి, దూరంగా గుట్టలు పెట్టిన మహిళా బృందం గాని-

4) గంగులవారిపాలెం వీధి- భవఘ్ని నగర్ ప్రాంతంలో మురుగు కాల్వ గట్లు శుభ్రం చేసిన పింఛన్ దారుల ద్వయంగాని - ఎవరైనా ఉత్సాహంగా పనిచేశారో లేక ఉసూరుమంటూ కాలం గడిపారో చూడండి!

ఏ ఒక్కర్నీ వదలకుండా పాయస- పులిహోరలు తినిపించిన సంతృప్తితో పల్నాటి అన్నపూర్ణ బాగా సాగతీసి చెప్పిన నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.

         గురు పూర్ణిమ పూజా సందర్భ భోజన- భాజనాల కోసం శివబాబు గారి మోపిదేవికి  ఆహ్వానాన్ని కార్యకర్తలు మన్నించవలసి ఉన్నది.  

         రేపటి వేకువ కూడ మనం ఈ గంగులవారిపాలెం సన్ సిటీ వీధి కూడలిలోనే కలవాలట!

         సహర్షంగా స్వాగతిస్తాం!

"ఎవరి కొరకీ శ్రమోద్విగ్నత? ఎంతవరకీ కార్యదక్షత?

తొమ్మిదేడులు గడుస్తున్నా తోడురాదా గ్రామ భ్రాతృత?"

అను నిరాశా నిస్పృహల కొక అంగుళం చోటైన ఇవ్వని

స్వఛ్ఛ సుందర చల్లపల్లిని సహర్షంగా స్వాగతిస్తాం !

 

- ఒక తలపండిన కార్యకర్త

   21.07.2024