పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
నేటి - అనగా (బుధవారం) 24-7-24 నాటి శ్రమోత్సాహం – 3183*
శ్రమ సుమారు 2 గంటల చొప్పున 36 మందిది; చల్లపల్లి పొలిమేరలో 216 వ జాతీయరహదారి (గంగులవారిపాలెం) వద్ద జరిగినది; ఇక ఆ ఉత్సాహం అంతులేనిది; దేశంలోని ప్రతి పంచాయతీలోనూ తప్పక జరుగ తగినది; అది జీతం భత్యం లేక పదేళ్లుగా ప్రతి దినమూ చల్లపల్లిలో జరుగుతున్నది!
చల్లపల్లి శ్రమదాన సందడి ఇటీవల ఏ ఆదివారమో తప్ప ఎక్కువగా పాతిక - ముప్పైమందికి పరిమితమౌతున్నది. మరి ఈ బుధవారం - అదీ ఊరికి దూరంగా - ఇంతమంది రాకకు కారణం ఇదొక వన మహోత్సవ శ్రమదానమైనందునే!
హైవే నుండి చల్లపల్లిలోకి తొలి ప్రవేశమార్గం నుండి సుమారు 200 గజాల రహదారి ఉత్తర దిక్కున 52 సువర్ణ గన్నేరు పూల మొక్కల - అమరికను పరిశీలించేందుకు మీడియా వారు కూడ వచ్చి శ్రమించారు! తెలతెలవారే కొద్దీ, 6.10 నిముషాల ముగింపు కాలానికైతే సందడి పరాకాష్ఠకు చేరింది!
‘ఇంతమంది కార్యకర్తలు అంత సమయంలో నాటింది 52 పూల మొక్కలేనా?’ అని ఈ శ్రమదానాన్ని తక్కువగా చూడకండి! ఆ చీకటి పూట - ఏటవాలు చోట - గడ్డినీ, పిచ్చి మొక్కల్ని తొలగించడమూ, లోతుగా పాదులు త్రవ్వడమూ, 2 రకాల మట్టీ - ఎరువూ వేసి, మొక్క నాటి నీరుపోయడమూ – ఇన్ని చేయవలసుంటుంది!
ఈ స్వచ్ఛ – సుందరోద్యమ ఆద్యుడు 6.30 సమయంలో వివరించిన దాన్ని బట్టి - గత ఐదారేళ్లలో స్వచ్ఛ కార్యకర్తలు నారు పోసి - నీరుపెట్టి – కంపకట్టి - సంరక్షించిన మొక్కలు 27 వేలకు పైగా ఉన్నవట! జాతీయ రహదారిలో పెట్టిన 2 వేల మొక్కలలో కొన్ని జాతీయం చేసినవట! వాటిని భర్తీచేయడమే నేటి అంశం!
“క్రీస్తుకు పూర్వం అశోక చక్రవర్తి రోడ్లు వేయించి, దట్టంగా చెట్లు నాటించెను” అనేది మనం చదువుకొన్న గత చరిత్ర!
“చల్లపల్లి ప్రాంతంలో – మనకోసం మనం ట్రస్టు ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యకర్తలు నాటి పెంచిన 30 వేల చెట్లు ఇవి” అనేది భావి చరిత్ర!
‘ఈ నాటిది శ్రమోత్సాహ సందడి’ అని ఎందుకనాలంటే:
- కార్యకర్తలంతా ఈసురోమని కాక పోటీపడి పని చేయడమూ,
- తన పేరంటే ఏమిటో చూపిస్తూ అన్నపూర్ణ మళ్లీ తాటి ఇడ్లీలూ – పిండి వంటలూ అల్పాహార విందు చేయడమూ!
ఈ పూట గ్రామ స్వచ్ఛ సుందర నినాదాల వంతు పసుపులేటి ధనలక్ష్మి గారిది!
ఇంకొన్ని పూల మొక్కలు నాటేందుకు రేపు వేకువ కూడా ఇదే NH 216 మీద మనం కలవాలనే అంతిమ నిర్ణయం అందరిదీ!
గొడుగు పట్టునపుడు
ఎవడి స్వార్థచింతనకే వాడు గొడుగు పట్టనపుడు –
ధనమొకటే శాశ్వతమని ఇరుగు పొరుగు మరిచినపుడు –
స్వచ్చోద్యమ సందేశం చాటి చెప్పు తొమ్మిదేళ్ల
ప్రస్థానం చల్లపల్లి బాగు కోరుకొనే సుమా!
- ఒక తలపండిన కార్యకర్త
24.07.2024