3184* వ రోజు.......... ....           25-Jul-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

3184 *  వ వేకువ కూడ NH 216 వ చోటనే!

            గురువారం – 25.07.2024 వ తేదీ బ్రహ్మా కాలంలోనే – 4.12 కే సగం మందీ, 2 వ జట్టుగా మరో డజను మందీ – 2-3 కిలోమీటర్ల దూరాన – పెదకళ్ళేపల్లి. గంగులవారిపాలెం రోడ్ల మధ్య – 6.12 దాక ఎలా శ్రమించాలో అలా శ్రమించారు. నేడు నాటిన సువర్ణ గన్నేరు పూల మొక్కలు 45.

            రహదారి ఉత్తరపుటంచున – గోతులూ, పిచ్చి మొక్కల నడుమ – పల్లంలోకి జారే అవకాశమున్న ఏటవాలు చోటు – వయో వృద్ధుల్తో సహా ఎలా కష్టించారనేది నిజానికి వ్రాయదగిన అంశం కాదు – స్వయంగా చూడదగిన దృశ్యం!

3 బృందాలుగా విడివడిన కార్యకర్తలు ఒక పద్ధతి ప్రకారం –

- మొదటి బ్యాచ్చి గునపాలు, పారల్తో గట్టి నేలను క్రుళ్ళగించుకుపోతుంటారు;

- రెండో జట్టు అక్కడి కలుపు ఏరేసి, పాదులు చేసి, నల్ల మన్నూ, ఎరువూ కలుపుతారు;

- ఇక వాటిలో పూల మొక్కలు నాటి, చదును చేసే పని మూడో బృందానిది;

- ఇంతటితో ఐపోదు – 8.00 AM కు ట్రస్టు కార్మికులొస్తారు – మొక్కల చుట్టూ ముళ్ళ మండలు పాతి, త్రాళ్ళు చుట్టి, పాదుల్లో నీళ్ళు పోసే డ్యూటి చేస్తారు!

            ఇటుకా – ఇటుకా పేర్చి, ఇళ్ళు కట్టినట్లు ఈ పనులన్నీ జరిగిపోతుంటాయి! ఈ ఒక్క రహదారి హరిత – సుందరీకరణకే వారాల తరబడీ పడుతుంది. ఇలాంటివి 10-12 రహదారులుంటే? ఎంత సమయం, డబ్బూ, శ్రమా, ఓర్పూ - ర్పూ అవసరమవుతాయి? అవన్నీ ఈ  స్వచ్చ – సుందరోద్యమ చల్లపల్లికి ఉన్నాయి!

            ఈ  NH 216 రహదారి ఏ 3-4 వందల కిలోమీటర్లో గాని – ఒక ఊహా  చిత్రాన్ని గీసుకొంటే:

            “చల్లపల్లేనా? మన ఊళ్ళ దగ్గరి రాదారి మాత్రం ఎందుకలా ఉండకూడదు?” అని అన్ని ఊళ్ళ వారికీ రోషం పొడుచుకొచ్చి-లక్షల కొద్దీ రంగు రంగు పూల మొక్కలు దీని రెండు ప్రక్కలా పెరిగి, విరగబూ స్తే? ఆ కమనీయ రమణీయ సన్నివేశం ఎంత గొప్పగా ఉంటుంది?

            ఈ నాటి స్వచ్చ – సుందర నినదాలకర్త కస్తూరి విజయుడు.

            ఎప్పటిలాగే ఇంతటి నిస్వార్ధ శ్రమదానాన్ని చూసి ఆశ్చర్యపడింది DRK మహాశయుడు.

            రేపటి వేకువ మనం కలిసి శ్రమదాన కదం త్రొక్కవలసింది ఈ రహదారి ప్రక్కన గల నిర్మాణంలోని కళ్యాణ మండపం వద్ద!              

            పారిశుద్ధ్య వీరవిహారం

పనివాళ్లను పెట్టగలుగు భాగ్యశాలు రింతమంది

లబ్ద ప్రతిష్టులు కొందరు – వయోధికులు మరికొందరు

వేకువనే పారిశుద్ధ్య వీరవిహారం చేయుట

చల్లపల్లి నెలాగైనా జాగృత మొనర్చుటకే గదా!

- ఒక తలపండిన కార్యకర్త

   25.07.2024