పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
ఈ మంగళవారపు పని దినం సంఖ్య-3189*
జూలై మాసపు 30 వ నాటి వేకువ 4.15 మొదలు 6.10 దాక-నేటి 32 మంది వీధి శ్రామికులు ఒక గంగులవారిపాలెం వీధి శుభ్రత కోసం ఎవరెంతగా ప్రయత్నించారో, ఊరి జనుల ప్రయోజనార్ధం నేటి 50 కి పైగా పని గంటల ఫలితమేమిటో స్థూలంగా వివరిస్తాను.
దానికి ముందు ఈ చల్లపల్లిలో దశాబ్ది పైబడి-మూణ్ణాలుగు లక్షల పని గంటలుగా కొందరు తమ సొంతానికి కాక గ్రామమంతటి మేలు కోసం-ఒంటరిగా కాక ఒక సామూహిక సామాజిక సత్కార్యాచరణగా ఎలా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి!
‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని ఒక ప్రాత సామెత! ‘కలిసి శ్రమిస్తే కలదు అద్భుత ఫలితం’ అనేది స్వచ్చ-సుందర-చల్లపల్లి కార్యకర్తల అనుభవపూర్వక సందేశం!
తమ దైనందిన శ్రమదానంలో ఎంత సంతృప్తి దొరక్కపోతే – ఎంత సత్ఫలితం చూడకపోతే – ఇందరు సాధారణ – అసాధారణ వ్యక్తులు ఇంత సందడిగా వీధుల్లో పనిచేస్తారు?
ఏదో ఒక వీధి రోడ్డుకు గుంటలు పడితేనో-వీధి మార్జిన్లు ఆక్రమణకు గురైతేనో-చెత్తా చెదారం, గడ్డీ గాదం పెరిగితేనో ఈ 100-150 మంది మాత్రమే అది తమ గ్రామానికి లోటుగా భావిస్తారు? మురుగు కాల్వలు, బస్ ప్రాంగణాలూ ఊరి బయట రహదార్లూ బాగుండనపుడు వాటిని చక్కదిద్దే దాక వీళ్ళకే ఎందుకు నిద్ర పట్టదు?
ఈ గంగులవారిపాలెం వీధినే - భవఘ్ని నగర్నే తీసుకొంటే ఇక్కడి 9 మంది గృహస్తుల్లోనూ ఇంత సానుకూల స్పందనా? 3-4 ఊళ్ళ నుండి వచ్చి కార్యకర్తలు ఈ వీధి అంద చందాల బాధ్యతనింతగా పంచుకోవడమా? పరుల కోసం చేసే శ్రమ నింత ఇష్టంగా-సమైక్యంగా-సామరస్యంగా-నిత్య సాధనగా చేయడమా?
ఈ పూట గంటా 55 నిముషాల వీధి సుందరీకరణ కాలంలో :
- ప్రతి కార్యకర్తదీ మనః పూర్వక మానవీయ కృషే!
- చెట్ల కొమ్మల్నే నరికారో-వాటిని గబగబా షెడ్డర్ యంత్ర భూతం నోటికందించారో-రోడ్డు మార్జిన్లను సరిజేశారో-ప్లాస్టిక్ దరిద్రమే వదిలించారో-అవిప్పుడు చెపితే చర్విత చర్వణ మౌతుంది!
- అరకిలోమీటరు వీధి పర్యంతమూ 30 మంది గ్రామ బాధ్యతల్ని చూస్తుంటే ఎవరికి ముచ్చట కొలుపదు?
- వీరిలో కొందరైతే “శ్రమదానం అప్పుడే ఐపోయిందే-ఇందరు సహచరుల్ని రేపు గాని కలుసుకోలేమో...” అనుకొంటారు కూడ!
నేటి శ్రమ శక్తిని కీర్తించి-సమీక్షించింది Dr. DRK ఐతే-నినాదాలు ప్రకటించింది రక్తదానవీరుడు కస్తూరి విజయుడు.
50 కి పైగా పూల మొక్కలు నాటేందుకు రేపటి వేకువ మనం కలువదగిన చోటు-NH216 లోని పెదకళ్ళేపల్లి రోడ్డుకు – గంగులవారిపాలెం రోడ్డుకు మధ్యన గల వంతెన దగ్గర!
వృక్షో రక్షతి... అంటూ
ఇంత వరకు గమనించాం ఈ స్వచ్చోద్యమ జీవులు
సహనమెంత ప్రదర్శించి-శ్రమ త్యాగ మొనరించీ
వృక్షో రక్షతి... అంటూ వీధుల్లో నాటి పెంచి
విజయవంతులయ్యారో-వినయ శీలురయ్యారో!
- ఒక తలపండిన కార్యకర్త
30.07.2024