3201* వ రోజు ....           12-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

విజయవంతమైన మరొక శ్రమదాన ప్రస్థానం - 3201*

         సదరు ప్రస్థానం 12.8.2024 (సోమవారం) వేకువ సమయానిది, శ్రమదాతలు 29 మందే, మళ్లీ అందులో ఇద్దరు అతిథి కార్యకర్తలే – ఈ శ్రమాదర్శం వేకువ 4.20 నుండి 6.10 దాక - ఒకప్పటి ఆఫీసర్స క్లబ్ రోడ్డూ – 216 వ రహదార్ల కలయిక ప్రాంతాన కనిపించింది.

         నిన్నటిలాగానే ఈ ప్రొద్దుకూడ అతిథులు నాటిన పెద్ద మొక్క స్పాధోడియా ఒకే ఒక్కటి! వచ్చే ఆదివారం కోలాహలంగా ఏ100 పూల చెట్లో నాటడానికి ఈ 4-5 రోజుల సన్నాహమన్న మాట! క్లబ్బు రోడ్డు దగ్గరగా మొక్క నాటుతున్న వేడుకనూ, కార్యకర్తలతో తమ ఆనందాన్ని మదనపల్లి – ఋషి వ్యాలీ పాఠశాల వైద్యుడు రమేష్, మైనేనిపాలెంలో వృద్ధాశ్రమం నడుపుతున్న ఇంజనీర్ దుర్గాపతి గార్లు పంచుకొనే దృశ్యాన్ని చూడండి!

         ఇంకా పరిచయమెందుకూ, సందేహమెందుకూ - అంతంత దూరం నుండి తెలవారక ముందే వచ్చి, శ్రమించిన ఈ ఇద్దరూ స్వచ్ఛ కార్యకర్తలు కుటుంబీకులే అని తెలియడంలా?

         NH 216 మీద శ్రమదానాన్నీ, మైకుపాటల్నీ, నినాదాల్నీ, “వృక్షో రక్షతి రక్షితః” అని ఒకాయన పాడడాన్ని ఆ దారిన 80-90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ప్రయాణికులు చూసినా, విన్నా దీనితత్త్వం చప్పున బోధపడదు - తర్వాతెప్పుడో వాకబు చేస్తే కర్ణాకర్ణిగా ఈ పదేళ్ల స్వచ్ఛ - సుందరోద్యమ విశిష్టత కొందరి బుర్రల కెక్కవచ్చు!

         ఈ 2 కిలోమీటర్ల పైగా రాదారికి 2 ప్రక్కలా మరొకటి – రెండేళ్ళలో చెట్లు తమ హరిత విశ్వరూపాన్ని చూపుతుంటేనూ, రంగురంగుల పూలు విరగబూసి, పపకా నవ్వుతుంటేనూ - అప్పుడు చాల మంది స్థానిక  స్థానికేతరులకు తత్త్వం బోధపడవచ్చు.

         ఎన్నేళ్ళ నుండి - ఏరోజుకారోజు - ఎంతగా వర్ణించినా బోరు కొట్టని ఆనందకర శ్రమదాన దృశ్యాలివి!

- రహదారిని ఊడ్చేవాళ్లు ఊడ్చి, అనవసరమైన పిచ్చి మొక్కల్ని తొలగించే, రోడ్డు అందం చెడకుండా గడ్డి మార్జిన్ల గడ్డిని చెక్కే వాళ్లు చెక్కి, బాటను ప్లాస్టిక్ రహితం కావించే వాళ్లు కావించే సన్నివేశాలు!

         నేటి ఉద్యమ నినాదాలను మ్రోగించినదీ, చెట్టు పాటను పాడినదీ నందేటి శ్రీనివాసు కాక మరెవ్వరు!

         రేపటి మన శ్రమదాన పునః ప్రారంభం ఇదే ORC క్లబ్ - నూకలవారిపాలెం డొంక వద్దనే ఉండుకొనగలదు!

         అంతిమంగా శ్రమదే విజయం

సదవగాహన ప్రయత్నాలకు - అనాలోచిత నిర్ణయాలకు

అపరిశుభ్రత - శుభ్రతలకూ – త్యాగములకూ స్వార్థథములకూ

అన్ని కాలములందు ఘర్షణ - అంతిమంగా శ్రమదే విజయం

స్వచ్ఛ సుందర స్వప్నములకూ జయం తప్పదు అనుట తద్యం!

- ఒక తలపండిన కార్యకర్త

     12.08.2024