3202* వ రోజు ....           13-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

ఇవి 3202* వ వేకువ కాలపు శ్రమ సమర్పణలు - !

         మంగళవారం (13.08.2024) సైతం 22 మంది కష్టాన్ని ఇముడ్చుకుని బాగుపడింది NH 216 లో బందరు నుండి 23 వ కిలోమీటరు ప్రాంతమే! కష్టం మొదలయింది 4.15 కే! అక్కడ నుండి 6.00 దాక – రహదారి అలంకరణ జరిగింది కూడ ప్రధానంగా లోతైన ఉత్తరపు దిశలోనే!

         ఈ పూట మొక్కలు నాటలేదు గాని, దానికి పూర్వరంగంగా – అంటే పాదులు త్రవ్వడానికి గాను దట్టంగా పెరిగిన గడ్డినీ, తిక్క మొక్కల్నీ తొలగించే పనే 15 మందికి చాలింది.

         మిగిలిన వాళ్లు చేపట్టింది దారి మార్జిన్ గడ్డి కోయుట, వానకు కోసుకుపోయిన వాలును నింపుట! ఇందుకోసం ఒకరిద్దరు ఆ రహదారి భాగపు పనుల నిమిత్తం – పెళ్లళ్ళలో కూర్చున్నట్లు క్రింద కూర్చొని గడ్డి చెక్కారు!

         నిన్నా – మొన్నటి పనులు జరిగిన చోటు కూడ – ఎక్కడైనా గడ్డి గుబుళ్లు, అవాంఛనీయ మొక్కలూ ఉంటే వాటిని తొలగించారు.

         ఈ గడ్డి ప్రోగులూ, అడ్డు తొలగిన మొక్కలు వాన నీటికి పడిన గుంటలు పూడ్చేందుకు పనికొచ్చాయి!

         బాటకు ఉత్తరపు భాగమంతా ఇప్పుడు బాగా మెరుగుపడి, పూల – నీడ చెట్లు నాటడానికి సిద్ధమైనట్లే!

         ఇక మిగిలింది బాట దక్షిణ భాగం. దాన్ని మొక్కలు నాటేందుకు ముస్తాబు చేయడానికి సజ్జా ప్రసాదు గారు పురమాయించిన మంగళాపురం మనషులు ఇప్పుడు వస్తున్నారు!

         ఈరోజు కాస్త ముందుగా – 6.30 కు ముందే ఇళ్లకు చేరుకోవలసింది గాని – పల్నాటి అన్నపూర్ణ గారి పులిహోరాన్న సంతర్పణ అడ్డుకొచ్చింది! తినకుండానో – ఇళ్లకు పార్శిల్ పట్టుకెళ్ళకుండానో ఆమె ఎవర్నీ వదల్లేదు మరి!

         గాయత్రి సామిల్ బోర్డు వద్ద డొక్కా అన్నపూర్ణమ్మ గారు ముమ్మారు బాగా సాగదీసి చెప్పిన స్వచ్చ సుందరోద్యమ సాంప్రదాయ నినాదాలతోనూ,

         DRK గారి సమీక్షా వచనాలతోనూ శ్రమదాన కార్యక్రమం రేపటికి వాయిదా పడింది.

         రేపు మనం కలుసుకునే చోటు NH 216 లోని బండ్రేవు కోడు వంతెన దగ్గరేనట!            

         అంజలిస్తాం – అనుసరిస్తాం!

గ్రామమునకై ఎన్ని బరువులు - బాధ్యతలు తలకెత్తుకొంటిరొ

ఎన్ని జాగరణములొనర్చిరొ – ఎందరెందరి సంప్రదించిరొ

ఎంత లెంతగ బ్రతిమిలాడిరొ – సహన శీలం ప్రదర్శించిరొ

ఆ మహోత్తమ కార్యకర్తల కంజలిస్తాం – అనుసరిస్తాం!       

- ఒక తలపండిన కార్యకర్త

     13.08.2024