3203* వ రోజు ....           14-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

నేటి శ్రమ జీవన సౌందర్యం లెక్క 3203*

         శ్రావణ బహుళ దశమీ బుధవారం – పదునాల్గవ ఆగస్టు – 2024 వేకువ 4.17 సమయాన – 216 వ జాతీయ రహదారి 23 వ కిలోమీటరు వంతెన సమీపంలో పది మంది స్వచ్చంద శ్రమ జీవుల ఉనికి! అక్కడి నుండి 6.06 నిముషాల దాక మొత్తం 25 మంది ఉద్యమ జీవుల పరిశుభ్ర – సుందరీకరణ మనికి!

         ఈ కార్యకర్తల ఉద్దేశమేమిటో – గ్రామం కోసం వాళ్ళ సుదీర్ఘ కాల బృహత్ప్రయత్నమెట్టిదో ఈ ఊరిలో అధిక సంఖ్యాకులకు తెలిసీ, ఆ దగ్గర్లో వారైనా వచ్చి సహకరించారా అంటే – అదేం లేదు! “తూచ్! మా సొంత పనులు మావే – మన ఊరి కోసం మీ ప్రయత్నాలు మీవే!” అన్నట్లుంది వ్యవహారం!

         మనం గతంలో చెప్పుకొన్నట్లు – ఊరి వీధులు బాగుపడ్డాక, కర్మల భవనాలూ – శ్మశానాలూ అందం సంతరించుకొన్నాక, చుట్టూ ఏడెనిమిది రహదారులు కూడ హరిత – పుష్ప శోభిత మయ్యాక, మినీ రహదారి వనాలు కొలువు తీరాక, పార్కులు ప్రజోపయోగ్యమైన తర్వాత, RTC బస్ ప్రాంగణమూ – బస్ స్టాపులూ శుభ్రపడిన పిదప, ఈ నడుమనే వచ్చిన జాతీయ రహదారి పుష్ప హరిత వైభవానికి స్వచ్చ కార్యకర్తలు నడుం కట్టారు!

         గత పదేళ్ల  సుందరోద్యమ శ్రమను పరిశీలిస్తే ఈ వాలంటీర్లు – ఎప్పుడే మొండి - బండ – మురికి – కరకు పనులకు వెనుకాడారు గనుక?

- రాత్రి వేళ శ్మశానాల్లో తిరగరాదనే సెంటిమెంటును కులీన మహిళలు సైతం అధిగమించలేదా?

         వాళ్ళ సంకల్పమలాంటిది! ఆ ఉడుం పట్టు సడలనిది! ఇక - ఈ రహదారి రెండు ప్రక్కలా వచ్చే ఆదివారం వందల కొద్దీ పూల మొక్కలు నాటేందుకు ఈ కిలోమీటరు దూరాన్ని కలుపూ, పిచ్చి కంపలూ తొలగించడమూ, పాదులు త్రవ్వడమూ వాళ్ళ కొక లెక్కా?

సమాజంలో గుర్తింపూ మన్ననా కల ఈ కార్యకర్తల నేటి శ్రమ దృశ్యాల్లో:

1) వంతెన గోడల్ని కూడ తుడిచి శుభ్రపరుస్తున్న కార్యకర్త ఉత్సాహమూ,

2) గంటన్నరకు పైగా బాగా శ్రమించిన ఇద్దరు కార్యకర్తలు అలసిపోయి, కాళ్ళు బార్లా చాపి, సేదతీరుతున్న దృశ్యమూ,

3) ఎగుడు దిగుడు చోట్ల కాళ్ళు బెసగక మార్జిన్ ఖాళీ స్థలం బాగుచేసిన కష్టమూ...2 గంటల తర్వాత కూడ మరువలేకున్నాను!

         రేపటి వేకువ మన కార్యక్షేత్రం ఇదే గంగులవారిపాలెం సమీపాన గల రహదారే!                                           

         అభ్యుదయమా! వందనం! 

3 వేల దినాల నుండీ మొండి మనుషుల గట్టి యత్నం

పైకి వాళ్ళది శ్రమత్యాగం – వింత మనుషుల వెర్రి వ్యసనం

కాని అందు సమాజ భవితకు కలదులే సందేశ మొక్కటి

ఆచరణలో ఋజువుపరచిన అభ్యుదయమా! వందనం!

- ఒక తలపండిన కార్యకర్త

     14.08.2024