3204* వ రోజు ....           15-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

స్వాతంత్య్ర దినాన స్వచ్ఛ కార్మికుల నిత్య నైవేద్యం - @3204*

         ఇది శుక్రవారం - 15.8.24 వ నాటి గ్రామకైంకర్యం!

         తమ ఊరి మెరుగుదల కృషిలో ఆ కింకరులు 24  మందీ, సేవా సమయం 4.18 to 6.05. కృషికి  ఎంచుకొన్న స్థలం మరొకమారు - నిన్నటి తరువాయిగా – రహదారి – 23 వ కిలోమీటరు దగ్గరి గంగులవారిపాలెం ప్రక్కన.

         వీరిలో ఇద్దరు బండ్రేవుకోడు కాల్వ వంతెన దగ్గరి గుంట పూడ్చడంలో నిమగ్నమయ్యారు. 4 గురు మహిళా మణుల ఊడ్పు సేవలు సైతం ఆ వంతెన దగ్గరగానే – దారికి దక్షిణంగా.

         మరొక డజను మంది మంది కత్తులతో దంతెలతో పారలతో వంచిన నడుములెత్తక పనిచేసుకుపోయిందీ రోడ్డుకు దక్షిణ దిగువగా. ఎక్కువ సేపు వంగలేని కొద్ది మంది మాత్రం కూర్చొని, పెరిగి విరబూచిన సువర్ణ గన్నేరు పూల చెట్ల మొదళ్ళలో!

         ఏం చేస్తాం అంత అందంమైన పూల చెట్ల మధ్య దిక్కుమాలిన గడ్డీ – పిచ్చి చెట్లూ ఉంటే వాళ్ళకు నచ్చడం లేదు మరి!

         “ఇదేమన్నా వాళ్ళ ఇల్లా...” వంటి ప్రశ్నలక్కూడదు - ఊరు ఊరంతా, మళ్లీ మాట్లాడితే ఊరి చుట్టూ 10 రహదార్లన్నీ వాళ్ళకి తమ ఇళ్ళలాగానే అనిపిస్తాయేమో!

         రోడ్డు శుభ్రపరిచింది కాక -  బాట మార్జిన్ ను చెక్కి, ప్లాస్టిక్ లు ఏరి, గుంటలుంటే గడ్డీ – మట్టితో కప్పింది చాలక – 15-20 చెట్ల పాదుల్ని సవరించారంటే – వాళ్ళ మనస్తత్త్వమేమిటో - కఠినమైన పట్టుదలేమిటో తెలియడం లేదా?

         ఇందుగ్గాదూ – 6 లక్షల గ్రామాల్లో - వేలవేల బస్తీల్లో చల్లపల్లి వంటి కేవలం 8 ప్రదేశాలే రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకల కాహ్వానం పొందినది?

         ఎప్పటికైనా తదుపరి చర్యేమంటే - రాష్ట్రపతో, ప్రధానో స్వయంగా వచ్చి చల్లపల్లి స్వచ్యోద్యమాన్ని పరిశీలించడమే! అంతులేని ఆశ్చర్య చకితులు కావడమే!  

         నేటి దైనందిన ఉద్యమ నినాద ప్రవర్తకులు బొత్తిగా 86 ఏళ్ల (నడుం పట్టేసిన) డాక్టరు మాలెంపాటి గోపాలకృష్ణయ్య! సూక్తి ముక్తాల ప్రవచనం గురవయ్య గురువు గారిది! సంచి నిండా స్వీట్లు, హాట్లు తెచ్చి, 77 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని ఆనందించిందీ అతడే!

         రేపటి వేకువ మనం కలిసేది మాత్రం ఇదే 216 వ రహదారి మీది వంతెన వద్దనే!

         కలయదార్ధం కావడం ఇది!

ఒక్కపైసాకాశచెందక - ఒక్క వేకువ విశ్రమించక

నలుబదేబది మంది చొప్పున దశాబ్దంగా శ్రమించడమా!

ఇరుగు పొరుగుల శ్రేయమునకై ఇంతగా ఆరాట పడుటా!

గ్రామ చరితకు క్రొత్త పుట ఇది - కలయదార్ధం కావడం ఇది!

- ఒక తలపండిన కార్యకర్త

     15.08.2024