3205* వ రోజు ....           16-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

చల్లపల్లిలో 3205* వ నాటి శ్రమ వింతలు!

            శ్రావణ శుక్రవారపు ఉషోదయానికి ముందుగానే - ఊరికి దక్షిణాన - జాతీయ రహదారి మింద 22 - 23 వ కిలోమీటర్ల దగ్గర - ప్రధానంగా బాట ఉత్తరాన నేను గమనించిన కొన్ని శ్రామిక దృశ్యాలన్నమాట!

            అవినచ్చినచో నేటి జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సప్ గ్రూపులో మీరూ వాటిని దర్శించవచ్చు! ఇంకా ఎక్కువగా నచ్చితే క్రొత్తవారెవరైనా రేపటి నుండి పాల్గొని అలాంటివి సృష్టించనూ వచ్చు! ఐతే - అవేవీ గత చరిత్రలోని శాతవాహన రాజుల, భటుల యుద్ధ సన్నివేశాలూ కావు. రాణుల ప్రేమ పురాణాలూ కావు. స్వార్థం జోలికి పోకుండా గ్రామ సామాన్య పౌరులు తమ ఊరి కోసం పాల్పడుతున్న సాహసాలు!

            ఇవేవో ఈ ఒక్క రోజువి కావనుకోండి - పదేళ్లుగా ప్రతి వేకువా కనిపించే దృశ్యాలు! చూసే నాలాంటి వాళ్లకి తప్ప - పాతిక వేల గ్రామస్తుల్లో ఎక్కువ మంది కవి చప్పిడి సన్నివేశాలే కావచ్చు! అంటే:

1) 75 - 85 ఏళ్ల వ్యక్తులు పారా పలుగులూ పట్టి గట్టి నేలను త్రవ్వే -

2) ఆ త్రవ్విన లోతైన పాదుల్లోని మట్టిని తీసేందుకు బోర్లా పడుకొని ఒకాయన మెలికలు తిరిగే -

3) మహిళా స్వచ్ఛ కార్యకర్తలు కూడా పారలూ, గోకుడు పారలూ పట్టే, అవసరమైతే చీపుళ్లు పట్టే, వేకువ చీకట్లో తల దీపాల వెలుగులో బరువు పనులు చేసే సాహస కృత్యాలన్న మాట!

            నాలుగు లక్షల పని గంటలు శ్రమించి, కంపుగొట్టే మురుక్కాల్వల్నీ, కళావిహీనమైన వీధుల్నీ, అవకరంగా ఉన్న శ్మశానాల్నీ 10 బాహ్య రహదారుల్నీ పచ్చదనంతో - పూల సౌందర్యంతో సుసంపన్నం చేసిన వీరోచిత సామాజిక అద్భుతాలన్న మాట!

            ఈ నిశ్శబ్ద సామాజిక పరివర్తనాన్ని గుర్తించకపోతే - హర్షించకపోతే - అనుసరించకపొతే స్పందించక మిన్నకుంటే నష్టపోయేది కార్యకర్తలా!

            నిన్నటికి నిన్న దేశ రాజధానిలో ఈ గ్రామ సర్పంచి గారికి దక్కిన గౌరవమూ, బహూకృతులూ స్వచ్ఛ కార్యకర్తల పదేళ్ల శ్రమ ఫలితాలు కావా?

            స్వచ్ఛ కార్యకర్త దేసు మాధురి జన్మదిన కానుకగా మనకోసం మనం ట్రస్టు ఖర్చులకు 1000/- విరాళమూ,

            ఎప్పటిలాగే కార్యకర్తల సేవాగుణానికి DRK గారు పొంగిపోవడమా. మాలెంపాటి వాని గొంతు నుండి ఉరుముల్లాగా నినాదాలూ, (ఇక్కడొక సూచన: అంజయ్య, కోడూరు వేంకటేశ్వరుల నినాదాలకు మైకు ఇవ్వకపోతేనే మంచిది!)

            రేపటి శ్రమ వేడుక సైతం NH-21622 వ కిలోమీటరు వద్దనే !

            సమర్పిస్తాం మా ప్రణామం!

సంయమనమే చూపినాడో - సాహసములే చేసినాడో

వీధి రంగస్థలం పైనా వేషములనే కట్టినాడో

గడపగడపకు తిరిగి జనులను గడుసుగా బ్రతిమాలినాడో

సదరు శ్రామిక కార్యకర్తకె సమర్పిస్తాం మా ప్రణామం!

- ఒక తలపండిన కార్యకర్త

  16.08.2024