పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
ఇదిగో - 3208* వ పనిదినపు శ్రమ సమాచారం!
శ్రమదానం 216 వ జాతీయ రహదారిలో గంగులవారి పాలేనికి సమీపంలో జరిగినదే. అది 20-1 మంది 4.14 నుండి 6.09 వరకు ప్రధానంగా బాటకు ఉత్తర గట్టున జరిగినదే. ఊరి జనులందరి అహ్లాదం కోరి పదేళ్లకు పైగా శ్రమ నిమగ్నులైన ఈ స్వల్ప సంఖ్యాక కార్యకర్తలు పని నైపుణ్యాన్ని చూసుకొన్నారు తప్ప - ఎంత సేపు ఏ బరువు పని చేశారో గుర్తు పెట్టుకొనరు.
ఉదాహరణకు - ఒక నడిమి వయస్సు గృహిణి దెబ్బతిన్న కాలితోనే ఊడ్చుకొని పోతున్నదే తప్ప – వెనక్కి రమ్మని పిలిచినా ఆపిందా? (ఆమెను వదిలేస్తే అలా నెమ్మదిగా లక్ష్మీపురం వెళిపోతుందని ఒకాయన చమత్కరించాడు!)
- వయసు మళ్లిన విశ్రాంత భారీ కార్యకర్త మధ్యలో మంచి నీళ్లు త్రాగడానికి తప్ప తన పని ఆపలేదే!
- సందడి సందడి కార్యకర్తలిద్దరు రెంటినీ సమర్థంగా చేసుకుపోయారు - ఇటు సందడి – అటు ప్రాత మొక్కల పాదులకు ఉపచారమూ!
- వరి పొలం గట్టు దగ్గర పని చేసుకుపోతున్న కొందరి వాలకం గమనిస్తే - వాళ్ల నిశ్శబ్ద పని తీరునూ – లక్ష్య శుద్ధినీ మెచ్చక తప్పదు!
- కొన్ని పెద్ద చెట్లే ఒరిగిపోతే వాటిని నిలబెట్టి, గట్టి ఆధారం కల్పించిన పనిలో ఇద్దరు ప్రసాదులు!
- ఒకే ఒక్క ఉద్యోగి రోడ్డుకు దక్షిణంగా – గంగులవారిపాలెం వీధి కూడలిని శుభ్రపరచడం సాధ్యపడింది!
- మరొక ఆసక్తికర దృశ్యం - సమీక్షా సమావేశం ముగిశాక కూడ ఇంటికి వెళ్లకుండ అదే జంక్షన్ లో విరగబూసిన సువర్ణగన్నేరు చెట్లను ప్రేమగా చూస్తుండిపోయిన కార్యకర్తల త్రయం!
తన నినాదాలతో నేటి తుది సభను ప్రారంభించినది S.P. అనబడే సజ్జా ప్రసాదు,
ఎక్కడెక్కడ నుండో వచ్చి, నిన్నటి దుర్భర వాతావరణంలో 120 మొక్కలు నాటి, సగం రోజంతా ఊరు కలయ తిరిగి వెళ్లిన తన తొలి యౌవ్వన మిత్రుల మనోభావాలను వివరించినదీ, నిన్నటి అద్భుత శ్రమదానాన్ని కీర్తించినదీ Dr. డి.ఆర్.కె., తన సూక్తి ముక్తాలతో సమావేశాన్ని ముక్తాయించినది అడపా గురవయ్య,
రేపటి మన కృషి కూడ 216 వ రహదారీ - గంగులవారిపాలెం వీధి వద్దనే!
సహానుభూతి పొందేందుకు
పదేళ్ల మన శ్రమదానం ప్రగతిని గమనించేందుకు
స్వచ్ఛ కార్యకర్తలతొ సహానుభూతి పొందేందుకు
ఎందరు దర్శించారో - ఎలా పరీక్షించారో
ఎంతగ స్పందించారో - ఎట్లు సన్ను తించారో!
- ఒక తలపండిన కార్యకర్త
19.08.2024