3209* వ రోజు....           20-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

 3209* వ నాటి శ్రమ సౌజన్యం! 

          ఈ మంగళ వారం (20.08.2024) కూడ 4.15 కే స్వచ్చ కార్యకర్తలు పని చోటైన 216 వ రహదారి పైకి చేరుకున్నారు. అది సుమారుగా నిన్నటి వలెనే గంగులవారిపాలెం ఉత్తర దిశగా ఉన్నది.

          అప్పటినుండి 20 మంది స్వచ్చ కార్యకర్తలదీ గత పదేళ్లుగా ఉన్న పని పట్టుదలే. 6.05 నిముషాల దాక వాళ్ళది   అదే కార్యదీక్ష.

          రహదారికి ఉత్తర భాగంలో గునపాలతో కొందరూ, పారలతో నాలుగురైదుగురు, రైల్వే పారలతో గడ్డి చెక్కిన వారూ,  ఇద్దరో ముగ్గురో గాని రహదారిని చీపుళ్ళతో శుభ్రపరచిన వారూ తప్ప సోమరితనం ఎక్కడా ఎవరిలోనూ  కనిపించలేదు!

          వీళ్ళేదయినా ప్రతిఫలం ఆశించి లేక  కీర్తి ప్రతిష్టలను కోరి లేదా ప్రచారార్భటికి పాల్పడితేనో గదా అలసత్వం కనిపించేది?

          అందువల్ల ఆ సువిశాల రహదారికి చెందిన కనీసం 100 గజాల ఉత్తర భాగం ఇప్పుడు గణనీయంగా మెరుగుపడింది. “ఎవ్వరు ఈ దారిన పోతూ కాస్త ప్రక్కకు చూచినా ఇది స్వచ్చ సుందర చల్లపల్లి సుమా – ఇదంతా చల్లపల్లి కార్యకర్తల సుదీర్ఘ కాల శ్రమ ప్రభావం సుమా” అని ఎవ్వరూ చెప్పకుండానే గ్రహిస్తారు. బహుశా అందులో ఏ కొద్ది మందైనా సామాజిక, సామూహిక శ్రమదానం వైపుకు మొగ్గుతారు.

          ఇక ఈనాటి శ్రమదానోద్యమ సాంప్రదాయక నినాదాలు లయబద్ధంగా – ఆరోహణా అవరోహణల్లో కీర్తించినది ఎవరనుకున్నారు? ఇలాంటి ప్రజా ఉద్యమాలను తనివితీరా ప్రోత్సహించే ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి  గారే సుమా!

          నేటి కార్యక్రమం ముగిసిన చోటే  రేపటి వేకువ కార్యక్రమం కూడ!  

- ఒక తలపండిన కార్యకర్త

   20.08.2024