3213* వ రోజు .......           24-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3213* వ శ్రమాద్భుతం!

            ఈ శనివారమొక్కటనేం కాదు - చల్లపల్లిలో ప్రతి వేకువా తమ ఊరి కోసం కొందరి కష్టం ఏ రోజైనా సమాలోచనీయమే - సమాదరణీయమే! మాలాంటి కొందరి కది పవిత్రమే!

            మరి - 24.8.24 వ వేకువ 4.20-6.05 నడుమ 216 వ జాతీయ రహదారిపైన కార్యకర్తల శ్రమలో ప్రత్యేకత ఏమి? అంటే - మొదట పని ప్రారంభాన ఉక్క వాతావరణం, అదీ వేకువ చీకట్లో కత్తుల - దంతెల- పారల-చీపుళ్ల పనులూ, అసలు వాళ్లు కూర్చొని పని చేసేచోట ఉచ్చిష్ట మూత్రాదులేమున్నవో తెలియదు.

            ఐతే – మరో రకంగా చూస్తే అది ఆహ్లాదకర వాతావరణమనుకోవాలి. తెలవారేకొద్దీ మందపవనుడు కాస్తా శీతల వేగ పవనుడుగా మారి, అతని మిత్రుడైన వరుణుడు మూడుమార్లు చిరు చినుకులు చిలకరించి, కార్యకర్తల పనికి భలే సహకరించాడు!

            బండ్రేవుకోడు పెద్ద వంతెన నుండి 150 గజాల దాక - తమ సొంతిళ్లలో పనుల్లాగ 20 మంది (మొత్తం 26 మందనుకోండి) క్రమ పద్ధతిలో గంటన్నర సేపు – కూర్చొని కొందరూ, వంగి కొందరూ, నిలబడి దంతెదారులై ముగ్గురు స్త్రీ మూర్తులూ శ్రమిస్తున్న దృశ్యం ఈ రోజుల్లో చల్లపల్లిలో తప్ప మరెక్కడ చూడగలం?

            పచ్చని సువర్ణ గన్నేరు చెట్ల బంగరు రంగు పూల వద్ద తెల తెలవారుతుండగా గుంపెడు మంది స్వచ్ఛ సుందరీకర్తలు శ్రమిస్తున్న అద్భుత దృశ్యం సామాజిక స్పృహ ఉన్న ఏ కవి చూసినా- మనసు పులకించి, తక్షణమే పాటో - పద్యమో కట్టడా?

            ముగ్గుర్నలుగురు మాత్రం రాదారి ఉత్తరాన – నిన్న మిగిలిన గడ్డి పని పూర్తి చేశారు - వీళ్ల పని పాటుల గురించి వ్రాయాలన్నా సగం పేజీ నిండుతుంది.  

            కత్తులకు సానపట్టి ఉండడమూ, చేతినిండా గడ్డి ఒదిగిరావడమూ, ఒకరిద్దరి ఛలోక్తులూ, ఇంకొకరి  కూని రాగమూ దూరంగా ఘంటశాల వాని గానమూ.... ఇదీ నేను కన్నార్పక చూసిన సన్నివేశం!

            వాన తేలిపోయింది- శ్రమదానం పూర్తయింది. అప్పుడు మొదలైన సమీక్షా సభ.... శివబాబు స్వచ్ఛ- సుందర- నినాదాలతో ప్రారంభమై, ఇద్దరి సూక్తి ముక్తాలతో ముగిసింది.  

            రేపటి వేకువ కొన్ని మొక్కలు నాటేందుకూ, ఇతర రహదారి పనులకూ ఇదే  NH216 - గంగులవారిపాలెం సమీపంలో కలుద్దాం !

           వెర్రి మొర్రి చేష్టలా?

‘విసృతజన హితార్థమై వీధులు శుభ్రంచేయుట,

కాలుష్యం విరుగుడుగా హరిత సంపదను పెంచుట,

డ్రైన్లను నడిపించుట, రహదారి వనాలను సాకుట’-

వెర్రి మొర్రి చేష్టలా? వింత సదాచారములా?

- ఒక తలపండిన కార్యకర్త

   24 .08.2024