పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
3215* వ రోజుకు చేరిన గ్రామ బాధ్యతలు.
అనగా అది 26-8-24 - సోమవారం! ఎంత స్వచ్చీకరించినా పూర్తి తృప్తి దక్కక మళ్ళీ అదే 216 వ రహదారి 22-23 కిలోమీటర్ రాళ్ళ నడుమనే 4.20 కాకుండానే పనికి వంగిన కారకర్తల బృందం! వాతావరణం హాయిగా అనిపించినా సందేహాస్పదంగానే వర్షాగమనం!
ఏ గంగులవారిపాలెం సమీపంలో నెలల తరబడీ – వేల పనిగంటల కొద్దీ హరిత శుభ్ర – సుందరీకరణంజరుగుతున్నదో ఆ గ్రామ విభాగం నుండి మాత్రం దక్కని భాగస్వామ్యం! చల్లపల్లిలో ఇంకెన్నాళ్లకో మరి శ్రమ సంస్కృతీ సంపూర్ణం!
ఈ నాటి 23+2 మంది కార్యకర్తల - గంటా 50 నిముషాల శ్రమ విలాసం ఎట్లున్నదో చూద్దాం!
దాదాపు అందరూ పనిచేసినది జాతీయ రహదారి దక్షిణ భాగమే! గత పదేళ్లుగా - ముఖ్యంగా గత 2 నెలలుగా కార్యకర్తలు పునః పునః స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరించిన ప్రాంతమే! కాకపోతే - రోడ్ల కూడలి నుండి 40-50 గజాల మేర దక్షిణంగా గంగులవారిపాలెం దిశగా రోడ్డూ, డ్రైనూ బాగుపడ్డవి!
ఎవరెవరు పారల్తో బాట ప్రక్కల తుక్కూ, ప్లాస్టిక్ గలీజులూ, గడ్డి చెక్కారో - ఎవరు దంతెల్తో వాటిని లాగి ప్రోగులు పెట్టారో - ఎవరు బరువు పలుగుల్తో పాదులు త్రవ్వారో - అసలా పని వేళ ఎవరి ఉత్సాహమెట్టిదో చూడాలంటే మాత్రం ఎవరైనా స్వయంగా వచ్చి చూసి పాల్గొనడమే మంచిది!
అప్పుడు గాని ఇందరు నిష్కామ కర్మిష్టులు ఏళ్ళ తరబడీ గ్రామ వీధుల వెంబడీ - బైట రహదారుల ప్రక్క చెట్లు నాటి పెంచుతూ, వేలాది పూల మొక్కల పుష్ప సౌభాగ్యానికి పరవశిస్తూన్నారో తెలుస్తుంది!
ఈ వేకువ కూడ తల దీపాల కార్యకర్తలు సువర్ణ గన్నేరు చెట్ల పాదుల గడ్డినీ, చెత్తనీ, పిచ్చి మొక్కల్నీ తొలగించారు. తెల్లారాక నేటి బాగుపడిన 100 గజాల దూరమూ వీళ్లలో కొందరు మళ్లీ మళ్ళీ చూసుకొన్నారు,
ఒక NRI అమెరికా నుండి తెచ్చిన చాక్లెట్లను అందరూ స్వీకరించారు, లంకే సుభాషిణి గారి స్వీట్ల పంపకము కూడ ముగిశాక -
పచ్చని పూల చెట్ల సాక్షిగా సమావేశమైన అందరూ పొరుగూరి కార్యకర్త ప్రేమానందుని నినాదాలకు బదులిచ్చి,
రేపటి పని ప్రారంభం గంగులవారిపాలెం బాటకు పడమర ప్రక్కగా అని DRK గారి ద్వారా తెలుసుకొని గృహోన్ముఖులయ్యారు!
కార్యాచరణకు దిగనిదె
గ్రామం గర్వింపదగిన - రాష్ట్రం పాటింపదగిన –
దేశమాచరింపదగిన స్వచ్ఛ – సుందరోద్యమమిది
చూసి - మెచ్చి- “ఆహా! ఓహోహో!” అనుకొంటూ
కార్యాచరణకు దిగనిదె గ్రామ మెట్లు బాగుపడును?
- ఒక తలపండిన కార్యకర్త
26.08.2024