3216* వ రోజు ... ....           27-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

చల్లపల్లి పౌర సమాజానికంకితంగా – 3216* వ శ్రమ వేడుక!

          మంగళవారం నాటి (27.08.2024) అట్టి శ్రమకు వేకువ 4.17 కే అంకురార్పణ జరిగింది. NH 216 మీది గంగులవారిపాలెం క్రాస్ రోడ్డుకు దగ్గరగా 6.08 నిముషాలకు (ముగ్గురు మాత్రం మరో 6-7 నిముషాలకు) ముగిసింది. చల్లపల్లి గ్రామ స్వచ్చ - సుందరోద్యమ శ్రమదాన కథ ఈ ఒక్కనాటిదా? అది వేలాది శ్రమదినాల చాంతాడువ నిడివిదీ, తరచి చూస్తే వందల కార్యకర్తల - 4 లక్షల పని గంటల లోతైనదీ!

          ఈ పూట రహదారి సుందరీకరణ బాధ్యతలు 24 మందివి; అంటే 40 పని గంటలకు చెందినవి, ముందుగా – నిన్న రాలేని ఇద్దరూ, వచ్చిన ముగ్గురూ నిన్న బాగుపడిన 2 రోడ్ల కూడలినే ఏ మట్టీ - ఇసుకా – పేడా – పుడకా మిగలకుండా పట్టి పట్టి, గోకుడు పారల్తో గోకి గోకి, చీపుళ్లతో తుడిచి తుడిచి, అద్దంలా మార్చేసినది!

          మిగిలిన కార్యకర్తల్లో ఎక్కువ మంది కృషి గంగులవారిపాలెం వీధికి పడమరగా, రాదారి ఉత్తరంగా, మినీఫామ్ హౌస్ కు దగ్గర గా జరిగినవే! వీళ్లలో ఆ ఎగుడుదిగుడు మార్జిన్ లో అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కల మీదా, పూల మొక్కల్ని క్రమ్మేస్తూ ఏపుగా పెరిగిన గడ్డి మీదా కసిగా తిరగబడిన వాళ్లూ,

          మొక్కల రక్షణగా ముళ్ళ కంపలు పడిపోతే కూర్చొని రిపేరు చేసిన వాళ్లూ, దంతెలతో అప్పటికప్పుడు కోసిన గడ్డిని లాగేవాళ్లూ, ఆ తుక్కును మొక్కలకు దూరంగా పొలం వేపు గట్టున సర్దుతున్న వాళ్లూ!

          తమ సామాజిక కర్తవ్యం నిర్వహిస్తున్నప్పటి ఎవరి సంతృప్తిలో వాళ్ళూ, జోకులు ప్రేలుస్తున్న ఇద్దరూ, మరి  వీళ్లందరికి ఆరంగారంగా మంచి నీళ్లందించే పెద్దాయనా –

          ఇక - వస్తూ, పోతున్న ఈ పెద్ద మనుషుల వేకువ పారిశుద్ధ్య పనులర్ధం కాని కొన్ని ప్రశ్నార్థక ముఖాలు కొన్నీ...

          నిన్న ద్వారకా తిరుమలేశుని సన్నిధికై వెడలిన పల్నాటి అన్నపూర్ణే నేటి లడ్డూ ప్రసాద పంపిణీకర్త, కొంచెం మార్చిన నినాద బాధ్యురాలూ!

          రేపటి వేకువ మన పని ప్రారంభ స్థలం ఈ గంగులవారిపాలెం జంక్షన్ దగ్గరగానే!

          ఆలస్యమ్ అమృతమ్ విషమ్

అలవిగాని పని గాదిది - అత్యవసర కార్యం గద!

ఊరంతటి మేలు పనులు ఉమ్మడి స్వస్తతకై గద!

ఎందుకింత నిర్లక్ష్యం - ఏమిటికీ ఆలస్యం?

“ఆలస్యమ్ అమృతమ్ విషమ్” అనునది ఆర్యోక్తే గద!

- ఒక తలపండిన కార్యకర్త

   27.08.2024