పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
చల్లపల్లి శ్రమదాన చరిత్రలో 3228* వ పేజీ!
అంటే - సోమవారం (9.9.24) వేకువ కాలానిదన్నమాట! ఆ పేజీకి వ్రాతగాళ్లూ, వ్రాతగత్తెలూ 27 మంది! సదరు పుట నిర్మాణ స్థలం మళ్ళీ గత ఒక వారం లాగే గంగులవారిపాలెం బాటలోని బండ్రేవుకోడు కాల్వ గట్టే!
బాగా మబ్బుపట్టి - చలిగాలి కొట్టి చినుకూ చినుకూ రాలుతున్న వాతావరణం! కార్యకర్తల్లో తొలి ముఠా 4గింటికే వచ్చి, నాల్గూ పదికే - చీపుళ్లందుకొని, ఏడాకుల చెట్టెక్కే వాళ్లు ఎక్కేసి, రోడ్డు మార్జిన్ బురద తడిలో వంగి కత్తుల్తో మొక్కల పాదుల కలుపు పనికి దిగేవాళ్లు దిగేశారు!
మరికొంచెం సేపటిలో - గత 3 రోజులు గైరు హాజరైన సందడి కార్యకర్తతో సహా మిగిలినవాళ్లు వచ్చి, పూర్తి స్థాయి శ్రమదానం మొదలైంది, ఆ బాటకు దక్షిణాన- సంవత్సరం క్రితం నాటిన మేలుజాతి మామిడి మొక్కలు పెరగవలసినంతగా పెరగడం లేదనీ అందుక్కారణమైన మహావృక్షాలు కొన్నిటిని పాక్షికంగా తప్పించాలనీ కార్యకర్తల ఆలోచన! అందులో భాగంగా 2 చెట్లను ఐదారడుగుల ఎత్తుకు తొలగించినదే అరేడు మందికి నేటి పని!
నిన్న చెట్టెక్కెన ఇద్దరూ సాఫీగానే పని చేసుకుపోయారు గాని - ఈ పూట మాత్రం వాళ్ళను ఒక పసరిక పాము పరామర్శించిందట!
నేను కూడ కత్తినందుకొని, ఒక కొమ్మను నరికినప్పుడు గాని - అది ఏపాటి కష్టమో తెలిసి రాలేదు! అంతకన్న సులభమనుకొని రోడ్డు ఊడవబోతే - ఆకులూ, చెత్తా చినుకుల చిత్తడికి అంటుకుపోయి, ఆ ముగ్గురు మహిళా కార్యకర్తలు ఎంత శ్రమించి రోడ్డు ఊడుస్తున్నదీ తెలిసొచ్చింది!
ఇందులో ఎవరి దీక్ష తక్కువని! ఎవరి సహనం ఎంతటిదని? ఎవరి సాహసం మాత్రం చిన్నదని? ‘హైదరాబాదు ట్రిప్ వల్ల 3 రోజులు రాని ఒక విశ్రాంత సివిల్ ఇంజనీరు గారు ‘ఎంత సేపటికి నడుం ఎత్తి విశ్రాంతి తీసుకొంటాడా’ అని చూశాను – తాననుకొన్న పని పూర్తయితేగాని - ఆ నడుం పైకి లేవలేదు!
ఎప్పుడెలా అంటుకొన్నదోగాని, ఇద్దరు రైతు కార్యకర్తల బట్టలకు బురద పులుముకొన్నది. వాళ్ల పని మురుగు కాల్వ అంచున మరి!
వీధి పారిశుద్ధ్య లక్షణాలైన ప్లాస్టిక్ తుక్కులు ఏరడమూ, ఖాళీ మద్యం సీసాల సేకరణా, నరికిన చెట్ల కొమ్మల్ని గుట్టగా పేర్చడమూ, గద్ద గోరు పూల మొక్కల ట్రిమ్మింగూ వంటి పనులన్నీ యధాప్రకారం జరిగాయి!
నిన్నటి శ్రమదానోద్యమ నినాదాల వంతు దాసరి ఆర్య - అరవ్ లదైతే - నేటి ఆ బాధ్యత పొరుగూరి కార్యకర్త మల్లంపాటి ప్రేమానందానిది!
రేపటి పనేమో మురుక్కాల్వ వంతెన సమీపాన, మనం కలుసుకోవలసిందేమో భవఘ్నినగర్ తరువాతి వీధి మలుపు వద్ద!
పరిశుభ్ర - హరిత వేడుకలకు
మన విందులు - వేడుకలే పర్యావరణ కొక శాపం
తరతరాల జీవ రాశి మనుగడకే ప్రమాదం
స్వచ్ఛ - సుందరోద్యమాని కందులకే స్వాగతం
పరిశుభ్ర - హరిత వేడుకలకు పలుకుదమిక ఆహ్వానం!
- ఒక తలపండిన కార్యకర్త
09.09.2024