3231* వ రోజు ... ....           12-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

26 మందీ 4.10 to 6.08 AM @3231*

            గురువారం (12-9-2024) నాటి 2 గంటల వేకువ వీధి సంస్కరణాత్మక శ్రమదానం లెక్క అది! ఈ పాతిక మంది కాయకష్ట జీవుల వృత్తులు వేరే గాని, ప్రవృత్తి ఒక్కటే తమ గ్రామం పేరు దేశచరిత్రలో విశిష్టంగా నిలిచి పోవాలనీ, అందు నిమిత్తం తమ సాటి గ్రామస్తుల ఆహ్లాదార్థం రోజూ గంటన్నర శ్రమను ధారపోయాలనీ!

            వృత్తులూ ప్రవృత్తులూ సరే, వాటికనుగుణంగా ప్రణాళికలూ సరే మరి ఆచరణ సంగతేమిటి? అక్కడగదా 99% మంది విఫలమయ్యేది! గాంధీలూ, అబ్రహం లింకన్లూ, చే గువేరాల సంగతి కాదు ఇక్కడ సాదాసీదా మనుషులే తమ ఆశయ సాఫల్యం కోసం వేలాది రోజులూ - లక్షలాది పని గంటలూ కృషి చేసుకుపోతున్నారే!

            ప్రతిఫలాపేక్ష లేకుండా అది తమ స్వయం నిర్ణీత విధ్యుక్త ధర్మమనీ, ఎప్పటికైనా తమ గ్రామ సామాజిక ప్రయోజనాన్ని సాధించుకోగలమనీ పట్టుదల ప్రదర్శిస్తున్నారే! ఏదో ఫంక్షన్లకు తప్ప గడపదాటని గృహిణులూ వేకువ చీకట్లో వచ్చి శ్రమిస్తున్నారే! దేనికైనా ఆచరణే గదా గీటురాయి?

            ఒక 68 ఏళ్ల గ్రామ సుప్రసిద్ధ వైద్యుడు స్వల్ప జ్వరమున్నా, ఒళ్ళు నెప్పులున్నా - ఇందర్లో ఏ కార్యకర్తకే సమయంలో ఏ వైద్య పర్యవేక్షణ అవసరపడుతుందోనని లేని ఓపిక తెచ్చుకొని వచ్చెనే!

            మరొక 77 ఏళ్ల, 86 ఏళ్ల వృద్ధులు వచ్చి చిన్నదో పెద్దదో పనిలో నిమగ్నం కాలేదా! మొదటి పెద్దాయనకు కాస్త సుగర్ దిగిపోయి, నీరస పడడమూ, ఒక చాక్లెట్ చప్పరించడమూ గమనించాను!

            గత ఏడెనిమిది నాళ్ల చలీ, వానా ముగిసి, ఈ ఉదయం ఉక్కపోత మొదలయింది. ఐతే ఏమయింది పూల చెట్లు కత్తిరించే వానికీ, పిలిచినా వినిపించుకోక వీధి మార్జిన్ శుభ్రపరుస్తున్న విశ్రాంత ఉద్యోగికీ, వేప కొమ్మను తప్పించేందుకు దాన్ని పట్టుకు వ్రేలాడుతున్న ఇద్దరు ముగ్గురికీ, ఇంకా కొంగులు బిగించి చీపుళ్ళతో వీధినూడుస్తున్న మహిళలకూ మహా ఐతే చెమటలు కారతాయి - అందువల్ల పోయేదేముంది - కొద్దిపాటి రుగ్మతలు తప్ప?

            [నిన్నటిలాగే ఈ రోజూ నాదొక ప్రశ్న : డెబ్బయేళ్ల పైబడి, రావడం రావడమే బరువు పన్లో మునిగి, మాటలు చాల తక్కువగా, పనిమీదే ఎక్కువ ధ్యాసగా, ఒక్కమాటలో చెప్పాలంటే చల్లపల్లి స్వచ్చ కార్యకర్తఅనే మాటకు ఉదాహరణగా ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారు?]

            నేటి ముగింపు సభలో నినాదాలు మ్రోగించింది భోగాది వాసు మహాశయుడే!

            రేపటి మన శ్రమ ప్రాంతం బండ్రేవుకోడు వంతెన - గంగులవారిపాలెం బాటలోనే!

            ముఖ్యమంత్రి బాధ్యత వలె

వరద ముంపు బెజవాడకు ముఖ్యమంత్రి బాధ్యత వలె

వీధివీధి ఇంటింటికి అధికారుల సేవల వలె

ఒక దశాబ్ద కాలంగా స్వచ్ఛంద శ్రమదానం

రహదారులు, వీధులెల్ల పుష్ప హరిత సంభరితం!

- ఒక తలపండిన కార్యకర్త

   12.09.2024