3232* వ రోజు ... ....           13-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

32---32* వ వేకువ శ్రమ విశేషాలు!

            అవి 13-9-24 - శుక్రవారపు సంగతులు; గ్రామ ప్రయోజనార్థం ఈ పూట కష్టించింది 23+2 మందే గాని, వాటి వివరాల్లోకి ఏమాత్రం వెళ్లినా ఈ వ్యాస విస్తరణ భీతి కలుగుతుంది. కనీసం 3 చోట్ల - 4 రకాలుగా జరిగిన వీధి పారిశుద్ధ్య/ సుందరీకరణ హరిత క్రమబద్ధీకరణను స్థూలంగా చెప్పాలే తప్ప - సూక్ష్మంగా చెప్పడం కుదరదు మరి!

            అందులో తొలి విశేషం - 2 మహా వృక్షాల కొమ్మల ఖండనం! ఆ చెట్లు చేసిన తప్పు వాటి నడుమ గల జాతి మామిడి మొక్కల ఎదుగుదల కడ్డుపడడం - అదేదో భరత్ అనే..సినిమాలోలాగా ఐదారేడెనిమిది నాళ్ళ తరువాత గ్రామ బాధ్యతకు వచ్చిన వక్కలగడ్డ రామకృష్ణుడు  1 ¼  చెట్టు కొమ్మల పనిని పట్టినట్లూ, మిగిలిన పని చెట్ల నరుకుడులో సిద్ధహస్తులు ముగ్గురు పూర్తి చేసినట్లూ తెలిసింది!

            రెండో పని - కొందరి దృష్టిలో తేలిగ్గా కనిపించే ½ కిలోమీటరు బాట ఊడుపు - ఆ బాధ్యత 5 గురిది!

            వంతెనకు పశ్చిమోత్తరంగా ఐదారుగురు గడ్డి పిచ్చి మొక్కల గుబుళ్లలో చేసిన పనేమన్నా తక్కువదా? పురుగూ - పుట్రా సంచార ప్రదేశంలో ఆ పని చేసేందుకు గట్స్కావద్దా?

            ఇక - అసలైన పనీ - ఆర్నెల్ల దాక గుర్తుంచుకోదగ్గ సంఘటనా బండ్రేవుకోడు వంతెన పశ్చిమాన జరిగింది! ఒక భారీ ఉపాధ్యాయుడు జాగ్రత్త పరుడేగాని - ఒక్కోమారు కాలుష్యం పనుల్లో ఆవేశపడే కార్యకర్త గడ్డి క్రమ్ముకొన్న తాడి బొందులో కాలేసి వెనక్కి విరుచుకుపడిపోవడం! ఇద్దరు ముగ్గురు పట్టి లేపగా కొద్ది విశ్రాంతి తర్వాత ఆ గట్టి పిండం మళ్ళీ జోడు కత్తులందుకొనడమే పెద్ద విశేషం!

            పదేళ్లుగా జరుగుతున్న చల్లపల్లి శ్రమదానమనేది ఒక వీధి పారిశుద్ధ్య కార్ఖానాఅని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఒప్పుకొంటారు! ఐతే ఆ ఫ్యాక్టరీ యాంత్రికంగా కాదు - సృజనాత్మకంగా పనిచేస్తుంటుంది!

            అనారోగ్యం వల్ల 100 రోజులు రాలేని కొండపల్లి బాబూరావు రాక మరొక విశేషం! అతడెన్నెన్ని గోడలూ చెట్లూ ఎక్కి పనులు చేసేవాడో గుర్తుతెచ్చుకోండి! 10 నెలల బాలుడిలాగా - అడుగులు తడబడి, బుడిబుడి నడకలతో వచ్చి, కార్యకర్తల్ని చూస్తూ ఎంతగా ఆనందించాడో!

            నేటి స్వచ్ఛోద్యమ నినాదాలను చెట్లెక్కి శ్రమించిన రామకృష్ణకు అప్పగించారు.

            నరాల, మెదడు లోపాలప్పుడు తీసుకోదగిన జాగ్రత్తలను DRK వివరించారు!

            రేపటి పనిపాటులు కూడ గంగులవారిపాలెం వంతెన కటూ ఇటూగానేనట!

            డిస్టింక్షన్ మార్కులు

బెజవాడకు పది రోజుల ప్రభుత్వోపచర్యలు

చల్లపల్లికి దశాబ్దంగా స్వచ్ఛ సుందర సేవలు

ఇద్దరికీ వస్తున్నవి డిస్టింక్షన్ మార్కులు

ప్రస్తుతానికి ఈ ఉభయులు ప్రశంసలకు పాత్రులు!

- ఒక తలపండిన కార్యకర్త

   13.09.2024