3233* వ రోజు ... ....           14-Sep-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3333-100 (శనివారం) నాటి వీధి శ్రామిక వింతలు!

            ఇది సెప్టెంబరు మాసంలోని పదునాల్గవ పనిదినం; దాని సంఖ్య 3233ఈ పని రోజు కూడా గంగులవారిపాలెం మురు క్కాల్వ వంతెన వద్దే ప్రారంభం; హాజరైన మొత్తం36 మందిలో శ్రామికుల్లో 32 మందే శ్రామికులు- మొక్కల సరఫరాదారుడూ, లక్ష్మీపురం నుండి ఇతరత్రా పై వాళ్లు 4 గురు .

            నా గమనికలో 4 పని బృందాలు కనిపించాయి - వంతెనకు ఉత్తర పడమరగా, నీళ్ల కాలువ అంచునా, తూర్పు ఉత్తరోన్ముఖంగావంతెన మీదా, దక్షిణ భాగానా !

            ఇందులో తొలిముఠా పంచుకొన్న కర్తవ్యం - కాలువ అంచూ, చెట్ల నడిమి సుందరీకరణం - వాళ్ల పనితీరును గురించి  ఎవరైనా చెప్పేయగలరు.

            రెండో బృందం సంకల్పించింది సుమారు 30 అడుగుల వంతెన తూరుపు గట్టు. అదసలే రంగు రంగుల పూలచెట్లతో, ప్రగాఢ హరిత వనంగా ఉన్నాసరే ఈ పాతికా × 12 అడుగుల పొలం వైపు కెళ్లే బాటలో గడ్డీ, మొక్కలూ ఉంటే నచ్చక- ఏడుగురు పట్టిపట్టి ఎంతగా శుభ్ర పరిచారో ఫొటోలో చూడండి!

            మూడోబృందం వంతెననూదాని గోడల్నీ, శుభ్రపరిచి తృప్తి పడలేదు. తూర్పు గోడ మీద కెక్కుతున్న చెట్ల కొమ్మల పని బట్టితే గాని, చారెడు మన్నైనా మిగలక వంతెన శుభ్ర పడితేగాని వాళ్లు పని విరమించనేలేదు!

            ఇక అసలు పని సందడీ, వేగమూ, నాణ్యతా, త్వరగా ఈల మ్రోగక ముందే రహదారి దాక, ఇరు ప్రక్కలా పని పూర్తికావాలనే ఆత్రుతా వంతెన కూNH 216 కూ నడుమనే!  ఇక్కడే 20 మంది కష్టమూ సార్థకమయింది. ఎవరి ముఖం చూసినా చెమట! ఈ 50-60 గజాల రోడ్డు కూడ గంటలో పూర్తి చేయకపోతే ఎలా?” అనే పంతమూ!

            ఇటీవల వరదల్లో బుడమేరూ, సింగ్ నగరూ వంటిచోట్ల 10 రోజుల పాటు జరిగిన సహాయ కార్యక్రమాలే గుర్తొచ్చాయి! ఐతే అది దశదిన పరిమితం- ఈ స్వచ్ఛ చల్లపల్లి స్వచ్చంద శ్రమదాన క్రీడ పదేళ్ళను మించిన అపరిమితం! అది బెజవాడ బాధితుల అదృష్టం - ఇది మన వూరి పాతిక వేల ప్రజల అవాంఛిత సౌభాగ్యం!

            ఇక- 6.20 వేళ ఊరి సర్పంచమ్మ చల్లపల్లికి సింగ్ నగర్ లాంటి నారాయణ రావు నగర్ లో పంచాయతి వారి సేవల్ని వివరించేముందు ఎందుకోగాని - నినాదాలతో కార్యకర్తల్ని పరిగెత్తించారు!

            మరి DRK డాక్టరు గారి సంతోషం గురించి వేరే చెప్పేదేముంది- స్వచ్ఛ కార్యకర్తల సుదీర్ఘ కాయ కష్టాన్నీ దాని ఫలితంగా  గ్రామం మారుతున్న క్రమాన్నీ, అసలు నిజమైన సంతోషం ఎందుకు ఎలా అనే విషయాన్నీ వివరించారు.

            గురవయ్యేమో వివేకానందుని కోటేషన్ చెప్పకుండా వదల్లేదు.

            రేపు కూడ గంగులవారిపాలెం - ఈ NH 216 ప్రాంతానికే పరిమితమవుదాం!

            ఆహ్లాదపు అమృతమే

సాగర మథనం వలె ఈ స్వచ్చోద్యమ శ్రమదానం

ఇప్పటికే చంద్రవంక, కౌస్తుభములు బయల్పడెను

హాలాహలం ఉబికి వచ్చు అవకాశంలేదిచ్చట

ఆహ్లాదపు అమృతమే అందనున్నదిక మీదట!

- ఒక తలపండిన కార్యకర్త

     14.09.2024