పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
ఆదివారం (15-9-24) నాటివి 40 మంది వీధి సేవలు! - @3234*
అవి వేకువ 4.30–6.00 ల నడిమికి పరిమితం కాలేదు – ప్రతిరోజూ గంట, గంటన్నర అనే తమ నియమం కూడా కార్యకర్తలేనాడో ఉల్లంఘించారు. ఈపూట కాలప్రమాణం 4.17 - 6.26 కు నమోదయింది!
ఆదివారాలంటే చాల మందికి ఆటవిడుపు, స్వచ్చ కార్యకర్తలకు మాత్రం సమయపాలనా బరితెగింపు, అందుకు నిదర్శనం ఈ ఉదయం 6.26 జరిగిన పని ముగింపు!
అసలీ వేకువ శ్రమదానాన్నీ, సగం మంది కార్యకర్తల ఉత్సాహాన్నీ, బండ్రేవుకోడు ఏడాకుల పెద్ద చెట్ల పనిముగింపునీ, ఇరుకు చోట్ల కూడ భారీ కార్యకర్తలు దూరి చేస్తున్న పారిశుద్ధ్య చర్యల్నీ, ఆడువారు బాట నూడ్చిన, తుక్కు లేరిన పని వేగాన్నీ, “ఈ పూటైనా ఈ చిన్న వీధి పనులు ముగించి, రేపు రహదారి కాలుష్యం పనిబట్టాలి” అనే కొందరి పట్టుదలనీ చూసి, ఆనందించాను తప్ప - ఈ చప్పిడి మాటల్తో అందంగా వర్ణించలేకపోతున్నాను!
“ఇదుగో ఈ పూట, గంగులవారిపాలెం X బందరు రహదారి వద్ద,
20 మంది రోడ్ల మార్జిన్ల గడ్డీ-పిచ్చి చెట్లూ తొలగించిరి –“
“తొమ్మిది మంది మహిళలు కాసె బిగించి, బరువు పనులొనర్చిరి-“
“ఇద్దరు భారీ కత్తెర్ల కార్యకర్తలు పాపభీతి వదలి తామే ప్రేమగా పెంచిన రంగుల పూల మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా కత్తిరించిరి –“
“కార్యకర్తల్లో 76-77-86 ఏళ్ల వారు కూడ చేయగల్గిన పనులు కొన్ని కావించిరి”.
“ముగ్గుర్నలుగురు పెద్ద డాక్టర్లూ, రైతు వర్తక-చిరుద్యోగ-ఫించనుదార్లు సరే, క్రొత్తగా వచ్చిన పోలీసు ఉన్నతోద్యోగి - K.ఈశ్వరరావు సైతం ఇచ్చటి మురికి పనుల్లో దిగి, పెద్ద మామిడి చెట్టు నాటెను” –
అని వ్రాసుకుపోతే సరిపోతుందా! “ఇంత భారీ – సుదీర్ఘకాల శ్రమదానోద్యమంలో ఇందరెందుకు పాల్గొంటున్నారూ?
ఈ నెలవారీ ఖర్చుల భారాన్ని ఒక డాక్టరమ్మ ఇంత సునాయాసంగా ఎలా మోస్తున్నారూ?
నల్లూరి సూర్యవర్ణనాది దాతలామె బరువును కొంతలో కొంతైనా ఎందుకు పంచుకోవలే?
ఏనాడో అమెరికా వెళ్లి, తన చల్లపల్లిని మరువక పదేళ్ల స్వచ్చ కార్యకర్తల శ్రమదానానికి 10 లక్షలు సంపాదించి ఇవ్వాలని వంద కిలోమీటర్ల మారథాన్ ను ఒక నాదెళ్ల సురేష్ ఎందుకు తలపెట్టెను?”
వంటి అంశాలను చల్లపల్లి ప్రజానీకానికి నాటుకొనేట్లు వ్రాయొద్దా?
ఆ వ్రాతల్ని చదివి గ్రామస్తులు తట్టుకోలేక వచ్చి శ్రమదాతలుగా మారొద్దా?
నేటి తుది సమావేశం –
నందేటి వాని నినాదాలతోనూ, పాటలతోనూ Dr. DRK గారి, CI గారి హితవచనాలతోనూ, చెక్ పోస్టు ఉద్యోగి చిరువితరణతోనూ –
రేపటి మన కలయిక గంగులవారిపాలెం సమీపంలో అనే నిర్ణయంతోనూ ముగిసింది!
మద్యం బుడ్ల హడావిడి
అటుగా రహదారిపైన మద్యం బుడ్ల హడావిడి
ఇటు వంతెన ప్రాంతంలో పారిశుద్ధ్య తాకిడి
ఈ 37 మంది ఎందుకింత పోటీపడి
శనివారం వేకువనే సాగిన శ్రమ సందడి!
- ఒక తలపండిన కార్యకర్త
15.09.2024