పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
స్వచ్ఛ శ్రామికుల 3237* వ నాటి ప్రయత్నాలు!
మంగళవారం - 18.9.24 వ నాటి సదరు ప్రయత్నాలు 28 మందివి. మరొకమారు బండ్రేవుకోడు కాల్వ వంతెనకటూ - ఇటూగానే కనిపించిన పారిశుద్ధ్య కోలాహలమది!
నరకబడని నాలుగైదు ఏడాకుల పెద్ద చెట్టు పని తప్ప - ఆరేడు గద్దగోరు చెట్ల ట్రిమ్మింగు తప్ప - కిలోమీటరు బారు వీధి వీధంతా సుమారు నెల రోజుల కష్టంతో ఇప్పుడెంత ఒద్దికగా, పొందికగా, శుభ్ర సుందరంగా, మళ్లీ మళ్లీ చూడాలన్నంతగా దర్శనీయమో చూసి చెప్పండి!
ఒకప్పుడు గుంటల బాటా, దాని ప్రక్కన చచ్చిన జంతు శవాలూ బ్రతికిన మనుషుల సిగ్గులేని మలమూత్ర -విసర్జనలూ, పాదచారులు ముక్కులు మూసుకొని, బిక్కు బిక్కు మంటూ అడుగు లేసిన – కళాకాంతుల్లేని ముదనష్టపు రోడ్డేనా ఇది?
డజన్ల కొద్దీ శ్రమదాతల, లక్షల కొద్దీ ఖర్చుల, సహకరించిన స్థానికుల, ప్రోత్సహించిన దాతల వల్ల కాదూ ఈ పుష్పాలంకరణం - ఈ హరిత సందర్భం? తీర్చిదిద్దినట్లున్న – ఊళ్లకూ, దేశానికీ ఆదర్శమౌతున్న – ఆ ప్రాత బాటేనా ఇది?
మరి ఈ వీధి అందచందాల వెనక కార్యకర్తల సంకల్పమెట్టిదో, మొండి పట్టుదలెంతటిదో, శ్రమ సౌందర్యమేపాటిదో ఊహించండి!
½ కిలోమీటరు పరిధిలో పాతిక మంది వేకువనే వచ్చి శ్రమిస్తుంటే, కొందరు మురుక్కాల్వ అంచును సుందరీకరిస్తుంటే, నలుగురు వీధిని ఊడ్చుతుంటే, ప్లాస్టిక్ తుక్కులేరుతుంటే, ఐదుగురు జాతీయ రహదారి అందాల్ని ద్విగుణీకృతం చేస్తుంటే, ఇంతటి నిస్వార్థ సామాజిక కర్తవ్యాలు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే - కాస్తంత భావుకత ఉన్న వాళ్ళ హృదయాలెలా గంతులేస్తాయి!
తక్కిన విశేషాలకేంగాని, ఒక పడమటి వీధి మహిళ - శివపార్వతి 3 కి.మీ. ప్రయాణించి నదురూ బెదురూ లేకుండ గంగులవారిపాలెం వీధికి వేకువనే వచ్చి, ఏ మాత్రం క్రొత్త కార్యకర్త అనిపించక చకచకా పనులు చేసిన వైనం గ్రహించండి! మళ్లీ ఇంటి బాధ్యతలు చూసుకొని, తన ఫాన్సీ కొట్టు నిర్వహణ కూడ చూసుకోవాలి ఈమె!
పని చోటుకు వస్తూ దారిలో వ్యర్ధాలను ప్రోగేసుకొచ్చిన షణ్ముఖ శ్రీనివాసుల వారే (వ్యర్ధాల్లోని పూలదండనీతడు ఒక పూలమొక్కకలంకరించాడు) ఈ పూట స్వచ్చోద్యమ నినాదకుడు!
అడపా గురవయ్య సూక్తులు షరామామూలే!
రేపటి శ్రమస్థలి కూడ గంగులవారిపాలెం హైవే వద్దనే!
అవనిగడ్డ మండలం – అశ్వరావుపాలెం వాస్తవ్యులు కటికల నాగరాజు – దాసినేని తేజస్వి దంపతులు చల్లపల్లిలో జరిగే శ్రమను గమనించి “స్వచ్ఛ చల్లపల్లి” ఉద్యమం కోసం 10,000/- ను Dr. DRK గారికి అందజేశారు.
విధాతలకు సాష్టాంగ ప్రణామం!
ప్రతి వీధీ హరితమయం వికసించిన పూనిలయం
చుట్టూ నవ రహదారుల శోభిల్లే ఆహ్లాదం
స్వచ్ఛ కార్యకర్త శ్రమే ఆనందాలకుమూలం
స్వచ్చోద్యమ విధాతలకు సాష్టాంగ ప్రణామం!
- ఒక తలపండిన కార్యకర్త
18.09.2024