పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
3242*వ నాడు సన్ ఫ్లవర్ బాట దగ్గర శ్రమ సంరంభం!
సెప్టెంబరు 23 వ నాటి వేకువ కూడ మరీ 4.10 కే రాగలిగిన 10 మందీ వచ్చి, కాస్త దూరస్తులూ, పొరుగూరి కార్యకర్తలు కొన్ని నిముషాల వ్యవధిలో చేరుకొని, మళ్లీ గంగులవారిపాలెం వీధి మయానా, మురుగు కాల్వ మలుపులోనా 6.12 దాక కష్టించారు.
బొట్టుపెట్టి, బ్రతిమాలితే వచ్చిన వ్యక్తులైతే – ఆ పారిశుద్ధ్య కృషి తీరు వేఱుగా ఉంటుంది. ఈ స్వచ్చంద శ్రమ ఎవరికి వాళ్ళ స్వయం ప్రేరిత - స్వయం ప్రబోధితం కాబట్టి, దీని కథే వేఱు! ఇక్కడ ఎవరి బలవంతమూ, మొగమాటమూ ఉండవు!
ఏ 3 ½ కో లేస్తారు, మహిళలు సైతం ధైర్యంగా వీధుల్ని దాటుకొని, పనిచోటుకు చేరుకుంటారు, అవసరాన్నిబట్టీ, అభిరుచిననుసరించీ, పనిముట్లు ధరిస్తారు, “అరె! మన ఒంట్లో నీరు చెమటగా కారిపోతున్నదే - బట్టలు మట్టికొట్టుకుని మాసిపోతున్నవే” అనికాక, “ఈ పూట మన ఊరి వీధినెంత వరకు శుభ్ర సుందరం చేయగలిగాం" అనే లెక్కలేసుకొంటారు.
అలా చెమటా, బట్టల కంటుకొనే దుమ్మూ కార్యకర్తలకు గర్వకారణం! గ్రామానికి ప్రతిష్టాత్మకం! సమాజానికాదర్శప్రాయం!
కార్యకర్తల నేటి శ్రమకు సాక్షీభూతంగా :
1) సన్ ఫ్లవర్ వీధికి అటూఇటూగా 16 మందితో బాగుపడిన 60 గజాల గంగులవారిపాలెం బజారూ, అక్కడికి పడమర ఖాళీ జాగాలో ప్రోగుబడ్డ బండెడు గడ్డీ – పిచ్చి మొక్కలూ
2) దీనికి ½ కిలోమీటరు దూరంగా భవఘ్నినగర్ కడాన ఎడతెగని మరరంపం చప్పుళ్లూ, అక్కడి 9 మంది శ్రమతో పెద్ద గుట్ట కొమ్మల్ని ముక్కలు చేసి, ట్రాక్టర్లోనికి ఎగుమతీ,
ఆ సందర్భంలో - ఆ గుట్టలో నివాసమున్న ‘తాడిగిరి’ కులపు సర్పము తప్పుకోవడమూ....అనేవి కొన్ని సంఘటనలు!
ఈ పూట శ్రమదానోద్యమ సారాంశ నినాదాలు చేయించింది భోగాది వాసు ఉపాధ్యాయుడైతే –
రేపటి మన కలయిక ఇదే సన్ ఫ్లవర్ అడ్డ వీధి వద్దనే అని ప్రకటించింది DRK వైద్యుడు!
శ్రమదానంలో పాల్గొనండి!
శ్రమదానం పస ఏదో చూడాలిని ఉన్నదా?
సామూహిక శ్రమ శక్తికి సాక్ష్యం కనుగొంటారా?
పౌరబాధ్యతలకర్ధం పనిగట్టుక చూస్తారా?
ఐతే - మా వేకువ శ్రమదానంలో పాల్గొనండి!
- ఒక తలపండిన కార్యకర్త
23.09.2024