ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1970* వ నాటి ప్రజోపయోగ చర్యలు.
ఈ శుభోదయాన కూడా విజయవాడ మార్గంలోని ఇంధన నిలయ (పెట్రోల్ బంక్) సమీపంలోనూ, చిల్లలవాగు దగ్గరి కాటా – ఆటోనగర్ ప్రాంతంలోనూ, సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధిలోనూ – మొత్తం మూడు చోట్ల జరిగిన స్వచ్చ సుందర కృషిలో కలిసి వచ్చిన కార్యదీక్షాపరులు 30 మంది. సమయం : 4.07 - 6.10 మధ్యస్త కాలం.
చిల్లలవాగు దగ్గరి – కాటా సమీపం నుండి బాలాజీ విభాగ భవన (అపార్ట్మెంట్స్) మధ్య ఉన్న విద్యుత్ తీగలకు అడ్డుగా పెరుగుతున్న ఐదారు చెట్ల కొమ్మలను గ్రామ రక్షకదళ సభ్యులు ఎత్తైన పీటపై నిలిచి – ఒక దశలో తాటికల్లు గీత కార్మికుల వలె నడుముకు. చెట్టుకు మోకు బిగుంచుకొని నరికి ఆ కొమ్మలను తాళ్ళు కట్టి కిందకు దించి అనివార్యమైన సుందరీకరణ చర్యలు చేపట్టారు (విద్యుత్ కార్మికుల విచక్షణా రహిత నరుకుడు నుండి వాటిని కాపాడారన్నమాట)
15 మందికి పైగా ఖడ్గ ధారులు, చీపుళ్ళ వారు, దంతెల వారు , పెట్రోల్ బంక్ – కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రాల మధ్య మురుగు కాల్వలోనూ, కాల్వ ఉభయ గట్ల మీద ఉన్న నానాజాతి కాలుష్య కారక వ్యర్ధాలను, ముళ్ళ చెట్లను, పిచ్చి మొక్కలను నరికి, ఊడ్చి, ఏరి, పోగులు చేసి ట్రాక్టర్ లో నింపి చేత్త కేంద్రానికి చేర్చారు. వీరిలో ఇద్దరు వికాస కేంద్రం లోతట్టుకు పోయి అక్కడ దట్టంగా పెరిగి ప్రహరీ గోడలను ఆక్రమించి రోతగా కనిపిస్తున్న ముళ్ళ చెట్లను, పిచ్చి తీగలను, గడ్డిని గంటకు పైగా ఏకదీక్షతో తొలగించడం నాకు కాదు గానీ గ్రామేతరులెవరైనా చూస్తే నిబిడాశ్చర్య మగ్నులవడం ఖాయం.
కొద్ది మంది కార్యకర్తలు విజయా కాన్వెంట్ ఎదురుగా ఉన్న షెడ్డు ముందు భాగంలో, ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలోని పిచ్చి మొక్కలను, కలుపు మొక్కలను తీసివేసి ఆ భాగన్నంతా శుభ్రం చేశారు.
నలుగురు కార్యకర్తలు రోడ్డు ప్రక్కన మనం గతంలో నాటి పెంచిన అలెస్టీనా (ఏడాకుల) చెట్లకు ప్రాకి, కాసిన నేతి బీర(ఎండు) కాయలను పైకెక్కి అల్లుకొన్న ఎండు తీగలతో బాటు కిందకు దించడం కూడా సామాన్య విషయం కాదు (ఈ ఎండు కాయల నేతి బీర విత్తనాలను కొన్నాళ్ల తరువాత శ్మశాన – చెత్త కేంద్రం దగ్గర మొలిపించి కాయించడానికి భద్రపరిచారు)
ఇక కమ్యూనిస్ట్ వీధిలో ఐదారుగురి + ఒకరిద్దరు స్తానికుల అపురూప చిత్రలేఖన కృషి నేడు కూడా కొనసాగింది. ఈ స్వచ్చ సుందర చిత్రలేఖకుల సుదీర్ఘ వీధి ప్రహరీల సుందరీకరణం ఎక్కడకు దారి తీసి ఎంతెంత వ్యయప్రయాసలతో ఎప్పుడు ముగుస్తుందో వాళ్ళకే తెలియాలి.
రెస్క్యూ దళం వారి – సుందరీకరణ ముఠా వారి శ్రమదాన విన్యాసాలను సామాజిక మాధ్యమ నిపుణుడైన శంకర శాస్త్రి గారి ఛాయా చిత్రాలలో – వ్యాఖ్యానాలలో గ్రహించవచ్చును.
కాఫీ - సరదా కబుర్ల సమయంలో స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలెవరు 9 గంటల పిదప ఇళ్ల నుండి బయటకు రావద్దని, పోరుగూర్లకు అసలే వెళ్లవద్దని విజయవాడకైతే ఎంత పని ఉన్నా పోనే పోవద్దని బందరు ముఖం కూడా చూడవద్దని ‘దాసరి రామకృష్ణ ప్రసాదు’ గారు పదేపదే గట్టిగానే హెచ్చరించారు.
‘స్వచ్చ సుందర చల్లపల్లి’ ఉద్యమ స్తంభాలలో ఒకరైన ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి 5,000 రూపాయల విరాళం ఎప్పటిలాగే ఈ నెల కూడా ‘మనకోసం మనం’ ట్రస్టుకు చెక్కు రూపంలో అందినవి.
రేపటి మన స్వచ్చంద గ్రామ ప్రయోజనకర శ్రమదానం ముందుగా విజయవాడ దారిలోని 6 వ నంబరు కాల్వ వంతెన దగ్గర ఆగి పని విభజనలను గూర్చి అప్పుడు నిర్ణయించుకొందాం.
ఈ ఐక్యత – ఇదే స్ఫూర్తి
ఏ పరమార్ధ నిమిత్తం ఈ కర్ఫ్యూ జరిగిందో
ఏ ఉమ్మడి ప్రయోజనం ఇంతకధను నడిపిందో
ఆ ఐక్యత చల్లపల్లి ఆరోగ్యానందాలను
సాధించుటలో ఇకపై సకల ప్రజలు కలవాలని.... !
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
శుక్రవారం – 03/04/2020
చల్లపల్లి.