1971*వ రోజు....           04-Apr-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1971* వ నాటి దూరదృష్టులు

          ఈ వేకువ 4.06 – 6.05 సమయముల నడుమ విజయవాడ బాటలో మూడు తెరగులుగా నెలకొన్న గ్రామ ప్రయోజనకర స్వచ్చంద శ్రమార్పణలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. సుదీర్ఘ సమయంగా కమ్యూనిస్ట్ వీధిలో సాగిన కుఢ్య శుభ్ర – సుందరీకరణోద్యమాన్ని నిన్న ముగించిన గ్రామ సుందరీకర్తలు కూడ మిగిలిన వారితో చేరి, నిర్వహించిన ఆత్మానందకర 2 గంటల (అందరూ కలిసి 50 పనిగంటల) కృషి వివరాలు :

- ప్రధాన స్వచ్చ సేవా స్రవంతిలో చేరిన సుందరీకరణ బృందం వారు విజయా కాన్వెంట్ ఉన్న పాఠశాలకు సమీపంలో రెండు ప్రక్కల ఉన్న వేగ నిరోధకాలు స్పష్టంగా చూపట్టే విధంగా తెల్ల రంగు పూసి, వాహన ప్రయాణాలను గంటకు పైగా క్రమబద్దీకరించి, అవసరమైన చోట రెండవ పూత కూడ పులిమి – తమ ప్రత్యేకతను చాటుకొన్నారు!

- 15 మందికి పైగా కత్తుల, చీపుళ్ళ, దంతెల వారు 6 వ సంఖ్య పంట కాలువ దక్షిణపు గట్టు, మురుగు కాలువల కాలుష్యం మీద దండెత్తి – గంటన్నర కు పైగా జరిపిన పోరులో గెలుపు సాధించారు. హుషారెత్తించే కేకలతో – పాటల పల్లవులతో – ఛలోక్తులతో ఇక్కడొక ప్రత్యేక సేవల సందడి!

- బాలాజి విభాగ భవన సముదాయ పరిసరాలలో గ్రామ రక్షకదళం వారి నిన్నటి చర్యలు నేడు కూడ కొనసాగినవి!

నేటి కాఫీ - టీ కషాయ సేవానంతరం జాగ్రత్తలు పాటిస్తూ జరిగిన సమీక్షా సమావేశంలో :

1) మార్చి నెలకు గాను మనకోసం మనం ట్రస్టు ఆయ - వ్యయ పట్టికను రామకృష్ణ ప్రసాదు గారు చదివి వినిపించారు. అప్పుల్లో కొనసాగే ట్రస్టు ఆర్ధికం ఈ నెలలో మాత్రం 3 లక్షలకు పైగా నిలవలోకి రావడం పెద్ద విశేషం – అంతా దాతల చలవ! (పద్మావతి గారి, DRK గారి మూడేసి లక్షల భూరి విరాళాలు, దాసరి వెంకటరమణ గారి లక్ష రూపాయల విరాళం మహత్యం!)

2) కరోనా దారుణ పరిస్థితుల నేపధ్యంలో ఈ 1971 నాళ్ళ చల్లపల్లి సుదీర్ఘ ప్రస్థానాన్ని తాత్కాలికంగా – 10 రోజుల పాటు నిలిపి వేయాలా, విడివిడిగా ఒకరిద్దరు తమ వీధులలో కొనసాగించాలా, లేక మరిన్ని జాగ్రత్తలతో ఇలాగే సాగించాలా – అనే ఆలోచనలలో మూడవ దాన్నే ఎక్కువ మంది సమర్ధించగా – మిగిలిన సమయమంతా ఇళ్లకే పరిమితమై – ఊరి పొలిమేరలు కూడ దాటరాదనే స్వచ్చంద  నియమం సంకల్పంతో నేటి సమావేశం ముగిసింది.

రేపటి శ్రమ జీవన వికాసం కూడ 6 వ సంఖ్య గల కాలువ వంతెన దగ్గరే ఆగి, నిర్వహించుకొందాం!

          అర దశాబ్ది ఉద్యమ మిది

స్వచ్చోద్యమం అరదశాబ్ది చూస్తుండగ గడచిపోయె

బాహ్య విసర్జనలు పోయె – పచ్చదనం పెరిగిపోయె

జనంలోన స్వచ్చ స్పృహ సగం మించి రగల దాయె

స్వచ్చోద్యమ చల్లపల్లి సమూలముగ మారదాయె!

 

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 04/04/2020

చల్లపల్లి. 

4.06 కు 6 వ నెంబరు కాలువ వద్ద
స్పీడ్ బ్రేకర్ కు రంగులు వేయకముందు
స్పీడ్ బ్రేకర్ కు రంగులు వేస్తున్న దృశ్యం
స్పీడ్ బ్రేకర్ కు రంగులు వేసిన తరువాత