3279* వ రోజు ... ....           01-Nov-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

నవంబరు మాసారంభపు శ్రమానంతర ఆనందం! @3279*

          నిన్నటివలె కాక - 37 మందికే పరిమితమైన వేడుక అది. నిన్నటి దివ్వెల పండుగ ఇందులో ఎవరెలా జరుపుకొన్నారో గాని, ఈ శుక్రవారం మాత్రం వేకువ 4.20 - 6.10 సమయంలో - అదే బందరు వీధిలో – ‘సర్వకాల ద్రవ్య కేంద్రం’ (ATM) వద్ద ఆగి, జరిపుకొన్న వీధి శ్రమ పండుగ విశిష్టమైనది!

          పేరుకు బందరు బాటలో 150 గజాల బాగుచేత గాని కొందరు ఉత్సాహవంతులు కొసరు శ్రమదానాలుగా -

1) పోలీసు కార్యాలయ వీధినీ,

2) కెనరా బ్యాంకు పడమటి చిన్న వీధినీ,

3) నలుగురు సుందరీకర్తల ముఠా అక్కడికి 1 కి. మీ. దూరాన – సజ్జా వారి వీధి వద్దా రకరకాల శ్రమకు దిగారు.

          3 గుడుల నుండి ప్రార్ధనలూ, దీక్షావచనాలు వినపడుతుండగా ATM తదితర దుకాణ సముదాయాల దుమ్మూ – గడ్డీ చెత్త వదలగొట్టింది 15 మంది.

          అటు 3 రోడ్ల ముఖ్య సెంటరు దాకపై కెగురుతున్న ధూళిని తట్టుకుంటూ రకరకాల దుకాణ సముదాయాల వద్ద ఊడ్చిన వారు 10 మంది.

          మనం సినిమాల్లో కథానాయక - నాయకీ యుద్ధాల్నీ, వయ్యారాల్నీ చూసిమెచ్చుకుంటాం; నవలల్లో - నాటకాల్లో - చరిత్ర గ్రంథాల్లో అలాంటి వర్ణనలకు మురిసిపోతాం; నిజ జీవితంలో - కళ్లెదుట – పదేళ్ల నుండీ పరుల కోసం పాటుబడే అద్భుత శ్రమదానాన్ని సగం మందిమి పట్టించుకోం!

          ఊహల రంగుల ప్రపంచానికీ – నిత్యమూ కళ్లెదుట కనిపించే కఠోర వాస్తవానికీ తేడా కనిపెట్టలేమా?

          నేటి తుది సమీక్షా సమావేశం కూడ –

          పల్నాటి భాస్కరుల స్వచ్చ - సుందర నినాదాలతోనూ, నిన్న మంచి పండగ పూట రిటైరైన గురవయ్య గారి సూక్తులతోనూ కాస్త సరస సల్లాపాలతోనూ ముగిసింది!

          రేపటి శ్రమదానం ATM సెంటర్ వద్ద మొదలౌతుంది!

సమన్వయించి అందించిన వైద్యద్వయం!

సహజంగానే కొంచెం చల్లపల్లి చైతన్యం

దానిని ఎగసన దోసిన వామపక్ష ఉద్యమం

ఆ అగ్నిని రాజేసిన అప్పటి జనవిఙ్ఞానం

వాటన్నిటిని సమన్వయించి అందించిన వైద్యద్వయం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   01.11.2024