ఒక్కసారికి మాత్రం పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎందుకు వాడాలి?
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1972* వ నాటి పట్టుదలలు
ఈ ఆదివారం వేకువ 4.13 – 6.10 సమయాల నడుమ విజయవాడ బాటలోని 6వ సంఖ్య పంట కాల్వ దగ్గర ఆగి త్రిముఖంగా సాగించిన స్వచ్చంద శ్రమదానం యధా ప్రకారం ప్రయోజనాత్మకంగా ముగిసింది. నేటి కార్యకర్తల సంఖ్య 30.
గ్రామ రెస్క్యూ దళం వారి వృక్ష సుందరీకరణం బాలాజీ భవన విభాగ సముదాయం దగ్గర నిరాటంకంగా జరిగింది. మీరెవరైనా ఈ కార్యకర్తల పని అరగంట గమనిస్తే “గ్రామ రక్షకులు” అనేది వీళ్లకు సార్ధకనామమని ఒప్పుకొంటారు!
నారాయణరావు నగర్ దిశగానూ, పడమర వైపునా పంట కాలువ రెండు గట్ల మీద 20 మంది కత్తుల – చీపుళ్ళ – దంతెలతో చేసిన వారి గ్రామ ప్రయోజక కృషి తక్కువదేమీ కాదు. ఎంత నిబద్ధత లేకపోతే బండెడు పిచ్చి – ముళ్ళ కంపలను, ప్లాస్టిక్ చెత్తను, ఖాళీ మద్యం సీసాలను నరికి – చెక్కి – ఊడ్ఛి - లాగి - పోగులు చేయగలరు?
నారాయణరావు నగర్ వైపు కాలువ గట్టు కి సిమెంట్ గోడకు మధ్యన ఉన్న గుంటను చెత్తతో పూడ్చి మట్టితో నింపి రోడ్డు వెడల్పుగా అయ్యేటట్లు చేశారు. కార్యకర్తలు గతంలో చేసిన అభ్యర్ధన మేరకు పంచాయితీ వారు డ్రైన్ లో తీసిన మట్టిని ఈ భాగం వద్ద రోడ్డు ప్రక్కన పోశారు. ఆ మట్టితోనే ఈ రోజు ఈ గుంటను పూడ్చడం జరిగింది.
కాలువ వంతెన నుండి విజయా కాన్వెంట్ దాక వెడల్పాటి రహదారిని క్షుణ్ణంగా – మరొక మారు చూడాలనిపించేట్లుగా - శుభ్రపరచిన సుందరీకరణ గుంపుకు అభివందనలు. కొద్ది విరామం తర్వాత మళ్ళీ ఈ వేకువనే వచ్చి స్వచ్చోద్యమ స్రవంతిలో చేరిన లయన్స్ క్లబ్బు వారికీ, సజ్జా వారి వీధి పద్మావతి గారికి స్వాగతం.
కరోనా గందరగోళం నడుమ తెగించి, తమ ఊరి స్వచ్చ – శుభ్ర సుందరీకరణ కోసం ఇలా 1972* నాళ్ళ కర్తవ్య నిర్వహణం చేస్తున్న కార్యకర్తలు ధన్యులు! అమెరికా – తదితర అన్య దేశాల నుండి, దేశీయ వివిధ రాష్ట్రాల నుండి, విజయవాడ కాదనుకొని - చల్లపల్లే తన గమ్యమనుకొని వచ్చి ఉంటున్న వ్యక్తి నుండి ... అందుతున్న స్ఫూర్తి – ప్రోత్సాహం ఇది మరి!
రేపటి మన స్వచ్చంద శ్రమ విరాళం ప్రధాన కూడలి దగ్గర ఆగి సమర్పించుకొందాం!
నిజంగానె పరిప్లవిస్తూ
ప్రజాహ్లాదం – ప్రజారోగ్యం పలవరిస్తూ నేటి కొక పం
దొమ్మిదొందల రోజులుగ తన తపన ఆగక – కృషిని మానక
సేవకాదిది బాధ్యతంటూ – సంచలించి పరిప్లవిస్తూ
చల్లపల్లి ని నిజంగానే స్వచ్చ సంస్కృతి ఆవరించదా!
- డా. డి. ఆర్. కె. ప్రసాదు,
నల్లూరి రామారావు,
(స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు)
ఆదివారం – 05/04/2020
చల్లపల్లి.