3283* వ రోజు ... ....           05-Nov-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా అవసరమా?

3283* వ - నేటి(మంగళవారం - 5-11-24) శ్రమదానం గురించి....

          అసలెలా వ్రాయాలో తెలియని స్థితి! ఎందుకంటే-ఇన్నేళ్లూ ప్రతి ఉదయమూ గిలుకుతున్నట్లు వ్రాసే సంగతి కాదిది!

          “ఈ వేకువ చలీ-మంచులో

1) మునసబు వీధి వద్దా

2) నాగాయలంక బాటలో–బండ్రేవుకోడు వంతెన దగ్గరా 4.20 కాకముందే 16 మంది చేరి-ఇకా తరవాత-ఇద్దరు, 3 గ్గురు, 4 గురు చొప్పున వచ్చి, చివరకు 43 మంది ఫలాన పనులు చేసిరి...” అని వ్రాసుకుపోయే శ్రమదానమా అది?

          నేనే గనుక సమర్థవంతంగా నేటి 50-60 పనిగంటలపాటు కార్యకర్తల కృషిని వర్ణించగలిగితే-

          ఐదారుగురు సుందరీకర్తల వీధి గోడల చిత్ర లేఖన సుందరీకరణ ఎందుకో గ్రామస్తులకు నాటుకొనేట్లు చెప్పగలిగితే-

          ఊరిచివర కాసానగరం బాటలో 3 ముఠాలుగా 30 మంది 2 మినీ డంపింగుల్ని దుర్గంధాలు భరిస్తూ ఎందుకు ఎత్తారో చెప్పగలిగితే-

          వారిలో ఒక ప్రస్తుత ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయినీ, ఇంకో అతిభారీ కార్యకర్తా ఆ మురుగు కాల్వ చివరి అంచున నిలబడి శుభ్రపరచడం అందరికీ కళ్లకు కట్టినట్లు వివరించానంటే-

          ఏడెనిమిది మంది మరీ కంపుగొట్టే వంతెన దక్షిణపు చెత్త కేంద్రాన్నెన్నుకొని ట్రాక్టర్ లోకెక్కి పట్టి పట్టి శుభ్రపరచిన ఉద్దేశ్యం గ్రామస్తుల కర్ధమయేట్లు లిఖించగలిగితే-

-ఈ తెల్ల కాగితాన్ని కలంతో ఖరాబు చేయడం సార్థకమౌతుంది!

          5.50-6.10 నడుమ 20 నిముషాలు ఒక్కో కార్యకర్త మురుగు పనుల్లో ఎలా చెలరేగిపోయిందీ, పనిపాటుల నడుమ కొందరి కేకల సందడీ-చలిలోనూ చెమట ముఖాల్లో ఉత్సాహమూ.... అసలిలాంటివి చూసేనేమో

          మహాకవి శ్రీశ్రీ

          “శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని” ఘంటాపథంగా వ్రాసేశాడు!

          అసలివాళ నా వ్రాతలెందుకు? 4 గురు జర్నలిస్టుల, ఇద్దరు స్వచ్చోద్యమ ఛాయాగ్రాహకుల 100 కు పైగా ఫొటోలు చూస్తే తెలియడం లేదూ-ఈ దశాబ్దకాలపు శ్రమదానం ఎందుకు దేశవ్యాప్త చర్చనీయాంశమయిందో?

          ఒక వామపక్ష భావ జాలగాయకుడు పాటందుకొంటే-ఇంకొక వయసు మళ్లుతున్న గృహిణీ కార్యకర్త యొక్క 10,000/- కష్టార్జిత విరాళాన్ని పద్మావతీ-DRKప్రసాదులందుకొంటే-

          రేపటి శ్రమ కూడ అవనిగడ్డ రోడ్డులోని స్వచ్చ-సుందర-టాయిలెట్లు వద్దే జరుగునని తెలిసింది.

          సద్యః ఫలితాలనేవి

సద్యః ఫలితాలనేవి సమకూడును పౌరాణిక  

గాథలలో-చలన చిత్ర కల్పనలో; వాస్తవిక

ప్రపంచాన దశాబ్దాలొ-శతాబ్దాలొ పట్టవచ్చు

స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతైన అంతేగద!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   05.11.2024