పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3285* వ శ్రమదానం కూడ “తగ్గేదేలే!”
తగ్గనిది బుధవారం (7-11-24) వేకువ 4.12-6.10 నడుమ RTC ప్రాంగణ పారిశుద్ధ్యం! చీమలదండులాగా ఔట్ గేటూ, ఇన్ గేటూ, చక్కని - చల్లని భారీ వేప చెట్టు క్రింది ‘ఒకట్ల’ ప్రాంతమూ, మలమూత్రశాలా, సైకిలు స్టాండూ.... ఎక్కడ చూసినా గంటన్నరకు పైగా సమయంలో చీపుళ్ల – దంతెల - పారల - డిప్పల కార్యకర్తల వీరవిహారమే!
ఈ ముదురు కార్యకర్తల్లో పని తొందరుంది – తొట్రు పాటులేదు; ఎలాగైనా ఈపూట బస్టాండును అందంగా తీర్చిదిద్దాలనే కసి ఉంది - అలాగని ఒకరి పనికొకరడ్డుపడే క్రమశిక్షణా రాహిత్యం లేదు; బస్తీ ప్రాంగణ రోడ్డు గుంటలు పూడుద్దామనిపించింది - కాని ఇప్పటికిప్పుడు ఆ ఖర్చు భరించే శక్తి లేదు – సమయమూ చాలదు;
మరికొందరిలో వాళ్లే పెంచి పోషించిన గార్డెన్ లోపల పని మిగిలిపోతున్నదే అనే వెలితి ఉంది – ఐతే రేపటి వేకువ కూడ గంగులవారిపాలెం వీధి వీధి ముస్తాబు పని వాళ్లను రమ్మని చప్పట్లు కొట్టి మరీ పిలుస్తున్నది! అందువల్ల –
ఆ 200 గజాల అంతర్గత రోడ్డును 16 మంది ఊడ్చి శుభ్రం చేయగా -
పాయఖానా వెలుపలి పచ్చదనాన్ని ఆరేడుగురు క్రమబద్ధీకరించగా –
ప్రాత పబ్లిక్ లెట్రిన్ల వెలుపల గోకుడు పారల్తో గడ్డి చెక్కి, గోడల్ని పగలగొట్టబోతున్న జువ్వీ, రావి చెట్ల మొలకల్ని నలుగురు తొలగించి, సదరు గోడల మన్నికకు హామీ ఇస్తుండగా –
వీధి గోడల సుందరీకరణను త్వరగా ముగించి వచ్చిన ఆరేడుగురు ఇంకా 6 నిముషాల సమయముందని చీపుళ్లందుకొనగా....
ఇక - అప్పటికే పని విరమణ ఈల 2 మార్లు మ్రోగగా.. మొత్తం 51 మందికిగాను - జ్వరం, జలుబూ, వళ్లు నొప్పుల కార్యకర్తా, జరూరు పనులున్న ఇద్దరూ నిష్క్రమించగా...
మిగిలిన 48 మందీ రవాణా భవనానికి దూరంగా – రేపటి శ్రమదానం గంగులవారిపాలెం వీధి వంతెన వద్దనని ప్రకటించబడగా - -
ఒక హోటల్ యజమాని – యామా నాగేంద్రబాబు 2000/- గుప్తదానాన్నీ, మాజీ ప్రిన్సిపల్ సాంబశివరావు గారి 500/- చందాను స్వచ్చ కార్యకర్తల తరపున DRK గారు స్వీకరించి, రేపటి - ఎల్లుండి కార్యక్రమాల్ని వివరించగా...
నందేటి వారి పద్యగానంతో కొందరు గొంతులు కలపగా....
ఎట్టకేలకు - 6.45 కు నేటి శ్రమ సందడి ముగిసింది!
ఒక ఉత్సుకత! ఒక మహోద్విగ్నత!
కార్యకర్తల హృదయమందు దశాబ్ది వేడుక స్ఫూర్తి రగిలెను
ఎవరి వదనము చూసినా - ఒక ఉత్సుకత! ఒక మహోద్విగ్నత!
ఎందుకుండవు - ఇదేమన్నా చిన్నా-చితకా శ్రమ విశేషమ?
ఊరు మొత్తం సమూలంగా ఉద్ధరించే బహు ప్రణాళిక!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
07.11.2024