3290* వ రోజు ....           12-Nov-2024

పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3290* వ శ్రమ వివరణలు చిత్తగించండి!

          12.11.24 మంగళవారానికి చెందిన ఈ వివరణలేవీ సమగ్రం కాదు – అసత్యాలో, అర్థ సత్యాలో, అతిశయోక్తులో కావు! ఈ గ్రామం, రాష్ట్రం, దేశం గుర్తించిన కటిక నిజాలు!

          18 వార్డులున్న – 5 వేల గృహాలున్న – పాతిక వేల జనులున్న ఈ చల్లపల్లిలో - ఏదోక మూల, అధమ పక్షం 20 మందైనా పదకొండో ఏడు కూడ – తమ గంటన్నర కాలాన్నీ, శరీర – మేధో శ్రమనీ ఊరికి ధారాదత్తం చేస్తున్న వాస్తవాలు!

          ఈ పూటైతే - ఊరికి దక్షిణాన - దూరంగా – 216 వ రహదారి నుండి 18 వ వార్డు చివరి నివాసపు రోడ్డుకు 47 ½  మంది పరిచర్యలు. (½ ఎవరంటే - 3-4  ఏళ్ల పాప!)

          పని జరిగింది 120  గజాల వీధి రెండు వైపులా! కార్యకర్తల ఉత్సాహంతోనూ, ఆహ్లాదకర వాతావరణంతోనూ చాల మందికి నొప్పి తెలియలేదు గాని - జరిగినది మాత్రం కష్ట సాధ్యపు పారిశుద్ధ్య పనే!

బాటకు పూర్వ - పశ్చిమ దిశల్లో విసుగూ విరామం లేని

* గడ్డి నరుకుతున్న 20 సానబట్టిన కత్తులూ,

* దుమ్మూ - గులకలతో సహా అంతెత్తున ఎగిసి పడేట్లు ఎండూ – పచ్చ గడ్డిని దునుమాడుతున్న 2 మిషన్ల శ్రమ సంగీతమూ,

* ఆ తుక్కుల్ని దంతెలతో గుట్టలు చేసిన 6 గురి పనిబడుపూ,

* ఆ గుట్టల్ని డిప్పలకెత్తి, అవలీలగా దూరంగా మోసుకుపోతున్న ఐదారుగురు మహిళల శ్రమ విన్యాస సౌందర్యమూ,

* 65 నుండి 85 ఏళ్ల కనీసం డజను మంది పెద్దల వీధి కాలుష్యమ్మీద పోరాటమూ.....

          ఇంకా ఇలాంటివెన్నెన్ని చూసి - చూసి శ్రీ శ్రీ

“పొగ గొట్టపు భూంకారధ్వని – అరణ్యమున హరీంద్ర గర్జన...

కదిలేదీ కదిలించేదీ - మారేదీ మార్పించేదీ –

పెను నిద్దుర వదిలించేదీ - మునుముందుకు నడిపించేదీ....

కావాలోయ్ నవ కవనానికి” అని వ్రాసుంటాడు?

          6:30 కు ముగిసిన తుది సమావేశంలో – ఉత్సాహానికీ, ఉద్వేగానికీ కొరత లేదు! నేటి శ్రమ నినాదాలు కూడా గంగులవారిపాలెం యువకుడు త్వరత్వరగానే ముగించాడు! చల్లపల్లి పారిశుద్ధ్య శ్రమదానమనేది ఒక వైవిధ్య భరితమైన శ్రమ యంత్రశాల! పెద్దగా రిపేర్లు లేకుండానే ఆ యంత్రం మరో 10 ఏళ్లు నడుచు గాక!

          దేని తాలూకు విరాళమో గాని శంకర శాస్తి గారు ఈరోజు కూడా ఉద్యమ ఖర్చులకు గాను 500/- సమర్పించారు.

          మన రేపటి శ్రమకైంకర్యం కూడ గంగులవారిపాలెం సమీపమందే!

          గిరిగీసుకు కూర్చొంటా

“ఇక చాల్లె – పదేళ్ల పాటు ఈ ఊరిని సేవిస్తిని

గ్రామంలో కొంతయినా కళా - కాంతి కలిగిస్తిని

కేవలమిక సొంత పనికె గిరిగీసుకు కూర్చొంటా”

అనే స్వచ్ఛ కార్యకర్త అసలు నాకు కనిపించడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

 

   12.11.2024