పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3291* వ వేకువ శ్రమదానం సంగతేమంటే –
* అది నవంబరు 13 వ తేదీ – బుధవారపు బ్రహ్మకాలం - 4.17 కే 14 గురితో శ్రీకారము చుట్టుకొనెను;
* 2-3 నిముషాల వ్యవధిలోనే గంగులవారిపాలెపు 17 గురనుకొంటా – వచ్చి వీధి కాలుష్యాలపై తిరగబడిరి;
* మరో పది నిముషాలదాక 2-3 గ్రామాల కార్యకర్తలు సైతం రామదండువలె వచ్చి, చేతొడుగులేసుకొని, తల దీపాలమర్చుకొని గంగులవారిపాలెపు పశ్చిమోత్తర దిశగా - 300 గజాల రోడ్డు బారునా కత్తీకటార్లతో - అనగా చీపుర్లు, దంతెలు, డిప్పలు, వగైరాలతో నిన్న శేషించిన వ్యర్ధాలపైకి దూకుచుండిరి;
* మొత్తం 50 మంది స్త్రీ - బాల - వృద్ధ గ్రామ వీధి సేవకులతో ఆ సాముహిక శ్రమదాన చర్యలున్నూ, మైకు పాటలున్నూ 216 వ రహదారి ప్రయాణికులకు వింతగా తోచెను;
* ‘సందట్లో సడేమియా’ అన్నట్లు ఈ అద్భుత నిస్వార్థ వీధి బాధ్యతా కఠిన శ్రమకు ముగ్ధులైన ఒక వృద్ధ శాస్త్రి, సీనియర్ వైద్యద్వయం సదరు పనులను ఛాయాచిత్రములు తీయుచుండిరి;
* గంగులవారిపాలెం మహిళలైనా - పురుషులైనా దైనందిన కష్టజీవులే కనుక - తాడి మట్టలు నరుకుట, ముళ్ళపొదను తొలగించుట వంటి కష్టసాధ్యములు వారికొక లెక్కలోనివి కావట!
* గత 3 రోజుల శ్రమతో ఈ 300 గజాల వంపు వీధి ఆ ఊరి వారికే క్రొత్తగా - ఎన్నడూ లేనంత శుభ్ర - సుందరముగా తోచుచుండెనట!
* పని ముగింపు దశలో - అనగా 6.00 ప్రాంతమున 4 గురు కార్యకర్తలా వీధికి దక్షిణాన నిలిచి, కొంత విశాలముగాను, ధూళి దూసర రహితముగాను ఉన్న సదరు బాటను - ముఖ్యముగా వరి పొలాల నడుమ వంపు వల్ల వచ్చిన అందాన్ని తనివి తీరచూచుకొని - అందులో ఒక భావుకుడు ప్రాత సినిమా (దసరా బుల్లోడు) లో ఆత్రేయ పాటను కాస్త మార్చి –
“దాని జిమ్మదియ్యా! అందమంతా కర్వులోనె ఉన్నది” అని గుర్తు చేశాడు!
తుది సమావేశంలో నెలవారీ చందా కోడూరి వేంకటేశ్వరరావు 550/- సమర్పణ, స్థానిక యువ కార్యకర్త నినాదాలతో మొదలై, ఆ 18 వ వార్డు వారికి సర్పంచమ్మ గారి వాగ్దాన పరంపర సాగి, రోజుటికన్నా DRK వైద్యునికి మరింత హర్షప్రదమయ్యెను!
రేపటి మన కృషి కూడ గంగులవారిపాలెం పడమరనే అని తెలిసెను!
గంగులవారి పాలెం స్థానికులు
అరరె! బ్రహ్మముహూర్తమందే స్వచ్ఛ సుందర కార్యకర్తలు
దూరదూరంగానె - గంగులవారిపాలెం సమీపంగా!
వారికన్న శ్రమించడంలో ముందు నిలిచిన వాళ్ళు గంగుల
వారి పాలెం స్థానికులు - అభి వందనీయులు నేటి కృషిలో!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
13.11.2024