3296* వ రోజు ....           18-Nov-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

శివరామపురం కూడలి దగ్గరగా 30 మంది ఉత్సాహం! @3296*

          ఉత్సాహం 18.11.24-సోమవారానిది. ఎంత హుషారు లేకపోతే-4:30 కు బదులు 4.18 కే అంతంత దూరాలు గడిచి, NH 216 మీదికి డజను మంది వెళ్లి, రహదారి శుభ్రతకు కాచుక్కూర్చున్నారు?

          85 ఏళ్ల, 77 ఏళ్ళ వారే తగుదునమ్మాఅని వీధులెక్కుతుంటే - తక్కిన కార్యకర్తల సంగతి చెప్పాలా? అసలీ తిక్క మనుషుల ఇళ్ళెక్కడ? 3-4 కిలోమీటర్ల దూరాన - అది వాళ్ల వీధన్నా కాదు పోనీ చేసేదేమీ మర్యాదకరమైన పనీ కాదు - ఉచ్ఛల చోట మురికి-దుమ్ము-పని కోసం ఠంచనుగా పరుగెత్తి రావడమేమిటి? వీళ్లది వ్యసనమనుకొంటే అది మంచిదా, చెడ్డదా?

          వీళ్లలో 74 ఏళ్ల ఎడం వాటం రైతునే తీసుకోండి - ఎంత వెర్రోడు కాకపోతే - 10 రోజులుగా జలుబు వొళ్ళు నెప్పులూ - జ్వరమూ వేధిస్తుంటే సాంతం నీరసం తగ్గకముందే రావడం రావడమే పార పనిలో దిగుతాడా?

          ఇంకో రైతు/ హోటల్ కాషియర్ నిన్న రాలేనందుకు అందోళనపడి ఆదరా బాదరా వచ్చి, మట్టి డిప్పలు మోయాలా?

          సొంత పనుల్ని ఇంత ఠంచనుగా ఇంత సంతోషంగా వీళ్ళు చేస్తున్నారా అని నాకొక ధర్మ సందేహం! ఒకర్నొకరు పలకరించుకొని, అభివాదించుకొని, చేతొడుగులేసుకొని, పనిముట్టు చేతిలోకొచ్చేసరికింత ఉత్సాహం ఎలా వస్తుందో - గంటన్నర శ్రమించాక అలసట బదులు ఆనందమెలా కలుగుతున్నదో ఆలోచించండి!

          గుట్టుగా ఇల్లు నడుపుకొనే ఒక మాధురి (ఈమే ఈ పూట వేగంగా నినాదాలు దొర్లించిన వ్యక్తి) మగవాళ్ళతో పోటీ పడి 40 కి పైగా మట్టి డిప్పలు మోయగలిగిన కిటుకేమిటో చెప్పండి!

          సరే - ఏమైతేనేం ఈపూట కాసానగర్ జంక్షన్ తూరుపున మరొక 150 గజాల రహదారి వ్యర్ధాలకూ, అవకతవకలకూ మూడింది!

తుది సమావేశ సమీక్షలో :

1) వరప్రసాద రెడ్డి గారి, గురవారెడ్డి గారి విరాళ వాగ్దానాల విషయమూ,

2) యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు గారి లోక్ నాయక్ ఫౌండేషన్పురస్కార సమాచారమూ తదితర విషయాలు తెలిసాయి!

          రేపటి వేకువ మన శ్రమదాన ప్రదేశం పెదకళ్లేపల్లి రోడ్డు జంక్షన్ వద్దనే అనే వార్త కూడ తెలిసింది!

          ఎవరి చెమట చలువ వలన

ఎవరి చెమట చలువ వలన NH 216 నేడు (18-11-24)

100 గజాలకు పైగా బాగుపడెనొ మెరుగయ్యెనొ

గడ్డి చెక్కి కసవులూడ్చి కష్టించిన స్వచ్ఛ - మాన్య

కార్యకర్తలందరికీ ఘన నివాళులర్పిస్తాం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   18.11.2024