1973*వ రోజు....           06-Apr-2020

 ఒక్కసారికి మాత్రం పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎందుకు వాడాలి

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1973* వ నాటి గ్రామ బాధ్యతలు

          నేటి వేకువ 4.01 – 6.10 సమయాల నడుమ స్వచ్చ కార్యకర్తల శుభ్ర సుందరీకరణల పనులు నిర్ణీత ప్రాంతాలలో క్రమ పద్ధతిలో నెరవేరినవి. 1) కోట బురుజు దగ్గరి మూడు రోడ్ల కూడలి, 2) బందరు దారిలో 6 వ సంఖ్య పంట కాలువ వంతెనలు కేంద్రంగా నెలకొన్న ఈ కార్యకర్తల శ్రమదాన వివరాలు :

పాల్గొన్న కార్యకర్తలు : 28 మంది

- 4.00 కు వేంకటేశ్వర కూల్ డ్రింక్స్ దుకాణం దగ్గర ఆగి, ఎవరి పనిముట్లను వారు చేబూని, ముందుగా అవనిగడ్డ దారిలో పెట్రోల్ బంక్ వరకు దుకాణాల ముందరి కాలుష్యాలను ఏరి - ఊడ్చి- ట్రాక్టర్ లోకి ఎక్కించడం.

- కార్యకర్తలు మూడు బృందాలుగా వేరుపడి, అటు కోట మలుపు దాక కొందరు , బందరు దారి దిశగా కొందరు, గంగులవారిపాలెం దారి దగ్గరి పంట కాలువ వంతెన దగ్గరికి కొందరు వెళ్లారు.

- గ్రామ ప్రధాన కూడలికి మూడు వైపుల దారులు – అటు కోటమలుపు దాక , ఇటు సంత వీధి దాక, తపాలా కార్యాలయ వీధి వరకు శుభ్రంగా కనిపిస్తున్నది. కరోనా దెబ్బకి వాహనాల, మనుషుల రాకపోకలు, రవాణాలు, RTC బస్సులు నిలిచిపోయి కొంతవరకు నిర్జనమైపోయి, వీధుల కాలుష్యం కొంత తగ్గిపోయింది!

- సుందరీకరణ ముఠా రామానగర – చల్లపల్లి సరిహద్దు వంతెన గోడలకు అంటించిన రకరకాల ప్రకటనాత్మక కాగితాలను తొలగించి గీకి, కడిగి శుభ్రం చేసింది. గతంలో నూ కొన్ని మార్లు వీరు ఈ గోడలను రంగులతో సుందరీకరించారు. ప్రచార కాగితాలలో కొన్నిటిని మేకలు లాగి, తినగా మిగిలిన వ్రేలాడుతూ రోతగా కన్పిస్తే సౌందర్యప్రియులైన ఈ స్వచ్చ కార్యకర్తలకు నిద్రెలాపడుతుంది మరి?

ఐదున్నరేళ్లుగా గమనిస్తున్నాం – ఎక్కడ, ఏలోటు రానీకుండా – ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుపోతూనే ఉన్నారు!

రోడ్లు ఊడ్చి , ఊరి ఖాళీ దిబ్బలు, మురుగు – పంటకాల్వలు, దారులు, కార్యాలయాలు, బడులు – గుడులు, బస్ ప్రాంగణం వంటివి క్రమ పద్ధతి లో శుభ్ర పరుస్తూ – సుందరీకరిస్తూ – వేల మొక్కలు నాటి - సాకుతూ ఈ కార్యకర్తలు శ్రమిస్తున్నారు. ఇందుకు సమాంతరంగా – చెట్లను నరికేవారు, మంచి శుభ్రమైన చోటులు చూసుకొని కాగితాలంటించే వారు, కాల్వలో  ప్లాస్టిక్ సంచులు విసరి నింపేవారు – అందరు కాదు – కొందరు – వారి పనుల్లో వారు లీనమౌతూనే ఉన్నారు. ఎవరి నిష్ట వాళ్ళదే!

రాష్ట్ర ప్రభుత్వం వారిస్తున్న సగం ఫించను నుండే డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి మనకోసం మనం” ట్రస్టుకు 2000/- విరాళానికీ – రామా యాక్స్ టైలర్స్ వేంకటేశ్వరరావు గారు కార్యకర్తల భద్రత కోసం పంచిన 50 గుడ్డ మాస్కులకూ, పద్మావతి ఆసుపత్రి సిబ్బంది కోసం ఇచ్చిన 50 గుడ్డ మాస్కులకూ ధన్యవాదాలు.

          రేపటి మన స్వచ్చంద శ్రమదాన విధులు బందరు బాట లోని కీర్తి ఆసుపత్రి దగ్గర ఆగి మొదలుపెడదాం!

          లోకాద్భుత వైతాళిక...

స్వచ్చోద్యమ చల్లపల్లి కధా విజయ మెట్టిదనిన....

సామాజిక ఋణశేషం తొలగించే పూనికతో....

నిస్వార్ధత – నిబద్ధతల – నిబిడీకృత వ్యక్తిత్వం!

ఏకోన్ముఖ గ్రామ హితై కాద్భుత వైతాళికం!

- నల్లూరి రామారావు,

- డా. డి. ఆర్. కె. ప్రసాదు,

 (స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు)

సోమవారం – 06/04/2020

చల్లపల్లి.

4.01 కు సెంటర్లో
బందరు రోడ్డులో రామానగరం ముఖ ద్వారంలో 6 వ నంబరు కాలువపై ఉన్న కల్వర్టు. ఇది పోస్టర్లతో అందవికారంగా ఉండండంతో సుందరీకరణ బృందం దానిని అందంగా తయారుచేయడానికి పూనుకొంది.
పోస్టర్లను గీకి శుభ్రంగా కడిగి ప్రైమర్ వేసిన తరువాత