పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3300 - 3 వ నాటి శ్రమ సౌందర్యాలు!
అనగా - 19-11-24 - మంగళవారపు ఘనకార్యాలన్న మాట! స్థానిక పెద్దలుంటే గుర్తుచేసుకొండి - 1977 వ ఏడు ఇదే రోజు - జరిగిన దివిసీమ విద్వంసక విలయాన్ని!
ఆ ప్రళయం గత చరిత్ర! ఈ 11 వ ఏట శ్రమదానానిది వర్తమాన చరిత్ర . ఇది 30-40-50 మంది ప్రతి వేకువ పూట చల్లపల్లిలో మొండి కేసుకొని చేసుకుపోతున్న పునర్నిర్మాణం - పునః పునః వీధి శుభ్ర - సౌందర్యం – ఊరి బయట రహదార్ల కాలుష్యాల మీద రణన్నినాదం!
ఆ క్రమంలో నేటి మొండి మనుషులు 32 మంది; వారి పనివేళ 4:10 – 6:10 నడుమ; యుద్ధభూమి NH216 మీది పె.క.పల్లి రోడ్డు దగ్గర బస్ షెల్టరు కటూ ఇటూ రైతులు ధాన్యం ఆరబోసిన 150 గజాలు; పని స్వభావం ప్రధానంగా రహదారి దక్షిణాన ఎగుడు దిగుళ్లను సరిచేయడం; అంతేగాదు - ప్లాస్టిక్ వ్యర్ధాల ఏరుడూ, అందాని కడ్డొస్తున్న గడ్డీ, పిచ్చి మొక్కల నరుకుడూ కూడ!
“కోతీ! కోతీ! ఎందుకు పళ్లికిలిస్తున్నావు?” అంటే – “చక్కనమ్మల్ని వెక్కిరిస్తున్నాన్లే!” అన్నదట!
“స్వచ్ఛ కార్యకర్తా - స్వచ్ఛ కార్యకర్తా! వేకువ చీకట్లో ఊరికి దూరంగా చలీ, మంచులో నీకీ మురికి పనుల ఖర్మెందుకు?” అంటే – “నా ఊరు బాగుంటే చాలా? చుట్టూ రహదార్లన్నీ హరిత – పుష్ప - వినోదంగా ఉండొద్దా? ఇది ఖర్మ కాదు - మా స్వచ్ఛ కర్మ!” అని బదులిచ్చాడట!
అలా - ఎవరి ఆనందం వాళ్లది! అడ్డమైన రోడ్లన్నీ ఊడ్వడం, 33 వేల మొక్కలు పెంచడం, దిక్కుమాలిన మురుగు కాల్వల్లో పని చేయడంలో ఈ స్వచ్ఛ సుందర కార్యకర్తల దైనందిన సంతృప్తి;
బాగు చేసిన రోడ్ల మార్జిన్లు ఆక్రమించడం, వ్యర్ధాలతో వీధుల్ని నింపడం మరికొందరి పరమానందం!
పనివేళ సరే – ప్రాతూరి వారి, DRK గారి పని సమయపు ఫోటోల్నీ, వీడియోల్ని తీరిక సమయంలో చూసుకొని, పునః పునరానందించడం కూడ కొందరు కార్యకర్తల హాబీ!
6:25 వేళ నేటి 50 పని గంటల శ్రమ సమీక్షానందం DRK గారిది; నినాదాలు పలికి, ప్రవచనాలు చెప్పిన సంతృప్తి అడపా వానిది;
రేపటి వేకువ ఉద్యోగాల (=ప్రయత్నాల) కోసం కళ్ళేపల్లి రోడ్డు వద్ద ఆగాలనుకొన్నది అందరూ!
సుందర చల్లపల్లిగ మారిపోవా!
వ్యక్తులున్నది ఊరికొరకా? గ్రామమున్నది వ్యక్తికొరకా?
వ్యక్తి ఉమ్మడి మేలు కోరుచు – ఊరు వ్యక్తికి అండనిస్తే
పరస్పరమూ సహకరిస్తే - పాటుబడుతూ గెలుస్తుంటే -
పల్లెలన్నీ స్వచ్ఛ - సుందర చల్లపల్లిగ మారిపోవా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
19.11.2024