3300* వ రోజు ....           22-Nov-2024

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3300* వ శ్రమదానోత్సవాన్ని వర్ణించాలంటే..... 

          అందుకు సరైన పదాలు తట్టడం లేదు; 59 మంది - చల్లపల్లికి దూరంగా విసిరేసినట్లున్న గంగులవారిపాలెం ప్రక్కన - 200 గజాల వీధికి రెండు ప్రక్కలా - 140 పూల మొక్కలు నాటిన గ్రామ బాధ్యతను తలచుకొంటే - సంతోషం హద్దులు దాటి పోతున్నది!

         ఈ శుక్రవారపు (22-11-24) ఉషోదయం ధన్యమూ, చిరస్మరణీయమూ! రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ ఈ హరితోత్సవం ఆదర్శమూ, అవశ్య ఆచరణీయమూ! నేటి శ్రమదానంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తా ఈ చారిత్రక సన్నివేశానికి సాక్షీభూతులైన ప్రతి గ్రామస్తుడూ అదృష్టవంతుడే!

          ఎక్కడా లేనట్లు ఈ చల్లపల్లి గ్రామం - పది పదకొండేళ్ల – 4 లక్షల పని గంటల శ్రమదాన ఘనతను సాధించిందనో, అందుకు గుర్తుగా 100 ఇళ్లు కూడ లేని చిన్న పల్లె రోడ్డున మామిడి – 7, కదంబం – 1, పనస – 2, సపోటా – 2, స్పెతోడియా – 1, సువర్ణ గన్నేరు – 13, గద్దగోరు – 140 పూలమొక్కల్ని (= 166) నాటిందనో, అందుకు గుర్తుగా బిస్కట్ల – కేకుల - కాఫీల పంపిణీ జరిగిందనో కాదు – ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో కాక - ఊరంతటి హరిత - పుష్ప - సుందరీకరణానందం కోసం ఇందరు కార్యకర్తలింత వేకువ పూట – చలీ మంచుల్ని ధిక్కరించి స్త్రీ - బాల - వృద్ధులు శ్రమించినందుకీరోజు చరిత్రలో నిలువబోతున్నది!

          పని సమయంలో  వీధంతా 2 మార్లు తిరుగుతూ ప్రతి ఒక్కరి ముఖాన్నీ పరిశీలించాను. “ఒక మంచి పని కోసం ఉమ్మడిగా శ్రమిస్తున్నాం” అనే సంతృప్తి, ప్రతి వారిలోనూ కనుపించింది!

          ఇది - అన్ని గ్రామాల ప్రజల్లో రావలసిన సన్నద్ధత! దేశంలో ఏ ఊరైనా - ఎప్పటికైనా - ఇదే పద్ధతిలో తీర్చిదిద్దబడవలసిందే!

          మరి ఇంతమంది రకరకాల నేపధ్యాల వారు గుమికూడినప్పుడు గందర గోళమున్నదా – క్రమపద్ధతిలో పన్లు జరిగిపోయాయా? “నేను ధనికుణ్ణి, నా హోదా పెద్దది.. “వంటి ఛండాలపు ఆలోచనలున్నాయా – “మనం చల్లపల్లి గ్రామ స్వచ్ఛ సేవ “కులం” అనే అద్భుత భావమే రాజ్యమేలిందా?

          కార్యకర్తల బలగమంతా NH 216 ప్రక్కన అర్ధవలయంగా నిలిచి జరుపుకొన్న సమీక్షా సమవేశం మరొక అందమైన దృశ్యం! అది “స్వచ్ఛ – సుందర చల్లపల్లికీ, స్వచ్ఛ – హరిత గంగులవానిపాలేనికీ జై కొట్టిన యువకుడు ప్రారంభిస్తే, “ఇంకొన్నాళ్ళ తర్వాత ఈ ప్రదేశం ఎందరినెంతగా ఆకట్టుకోబోతున్నదో – అందుకు స్వచ్ఛ కార్యకర్తల శ్రమ ఎలా మూల కారణమౌతున్నదో....” పాస్టరు గారు వివరిస్తే-

          రేపు ఉదయం 9:00 - సాయంత్రం దాక లంకపల్లిలో “మంత్రులూ, MLA లూ పాల్గొనే సాయిబాబా 99 వ జన్మదిన వేడుకలకూ – హరితోత్సవానికీ ఆహ్వానంతో ముగిసింది.

          రేపటి వేకువ శివరాంపురం NH జంక్షన్ వద్ద కలుద్దాం!

          హిందూ శ్మశానవాటిక పనుల నిమిత్తం వరదా వెంకట రామసుబ్రహ్మణ్యేశ్వరరావు (రాంబాబు) గారి కొడుకు కోడలు వరదా వెంకట రామలింగేశ్వరరావు - రాణి దంపతుల 50,000/- భూరి విరాళానికి చల్లపల్లి ప్రజల ధన్యవాదములు.

          అంటి ముట్టని శ్రమలు కావే

ఇవేమన్నా ఫొటో కోసం ఫోజులిచ్చే పనులు కావే

బట్ట నలగని, చెమట పట్టని - అంటి ముట్టని శ్రమలు కావే

ఒళ్లు హూనం అయే చర్యలు - కళ్లు బైరులు క్రమ్ము చేష్టలు!

ఊరి మేలుకు చిత్తశుద్ధితొ ఉద్యమించే వాళ్ల సేవలు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   22.11.2024