1974*వ రోజు....           07-Apr-2020

 ఒక్కసారికి మాత్రం పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎందుకు వాడాలి

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1974* వ నాటి స్వచ్చ శుభ్ర కృషి సమీక్ష :

          స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రారంభమై నిర్విఘ్నంగా ముగిసిన ఈ నాటి కార్యకర్తల శ్రమదాన వివరాలు : సమయం 4.03 - 6.10; గ్రామ ప్రయోజనాత్మక చర్యలలో పాల్గొన్న అలుపెరగని స్వచ్చోద్యమ కారులు - 28 మంది; శుభ్ర - సుందరీకరణకు గురి ఐన ప్రదేశాలు - బందరు మార్గంలోని 6 వ సంఖ్య పంట కాలువ, S.R.Y.S.P కళాశాల ముఖ ద్వారం, ఇదే బాట లోని సజీవ మత్స్య విక్రయ దుకాణం దాక.

ఇతర ప్రధాన సంగతులు :

- సుందరీకరణ ముఠా వారు నిన్న తాము కడిగి ప్రైమర్ పూసిన కల్వర్టు గోడలకు మొదటి విడత రంగు పూశారు. జూనియర్ కళాశాల ముఖ ద్వార దిమ్మెలు వెలవెల బోతుండగా - వాటిని గోకి, కడిగి, ప్రైమర్ పూశారు.

- రెస్క్యూ దళం పంట కాల్వ వంతెనకు దక్షిణాన కాల్వలోని గట్టు మీది అన్ని రకాల – ముళ్ళ, పిచ్చి మొక్కల ప్లాస్టిక్ సంచుల, కొసరుగా ఖాళీ మద్యం సీసాల కాలుష్యాలను నరికి, ఏరి, ఊడ్చి, ట్రాక్టర్ లో నింపారు.

- కొందరు కళాశాల ఎదుట గతంలో తామే పెట్టి, పెంచిన రహదారి వనంలోని కలుపు, ఎండుటాకులు తొలగించారు.

- ఎక్కువ మంది కార్యకర్తలు చీపుళ్ళకు పనిపెట్టి జాతీయ రహదారిని, రెండు దిశల ఖాళీ చోటును, గోడల మీద వ్రేలాడుతున్న ప్రకటనల కాగితాలను, ఊడ్చి, తుక్కులుంటే ఏరి, లాగి, పోగులు చేసి ట్రాక్టర్ లో నింపుకొని చెత్త కేంద్రానికి తరలించారు.

బ్యాంకు ATM కోసమో , ఉదయపు నడక కోసమో, ఇతర నిత్యావసరాల కోసమో వచ్చి పోతున్న వారంతా ఈ స్వచ్చ – సుందర చల్లపల్లి కార్యకర్తల నిస్వార్ధ కృషికి కేవలం సాక్షులే - భాగస్వాములు కాలేదు!

స్వచ్చోద్యమ కార్యకర్తలను కనీసం వారానికొకసారైనా బిస్కట్లు పోట్లాలతో అభినందించే ఉడత్తు రామారావు గారు ఈ నాడు కూడ అదే పని చేశారు! వాటికి తోడు పప్పు చెక్క పొట్లాలు సైతం!

          రేపటి స్వచ్చ కార్యకర్తల శ్రమదానం విజయవాడ బాట ప్రక్కన గల తరిగోపుల ప్రాంగణంగా నిర్ణయింపబడింది!

              కోరలు పెరికే యజ్ఞం...

స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత క్రమం బెట్టి దనగ....

సామాజిక ఋణం తీర్చు సాహసమే పునాదిగా....

భూ - నభోంతరాళ నడుమ పొగరెక్కిన కాలుష్యపు

కోరలన్ని పీకి వేయు గురుతరమగు ఒక యజ్ఞం!

- నల్లూరి రామారావు,

- డా. డి. ఆర్. కె. ప్రసాదు,

(స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు, మనకోసం మనం ట్రస్టు బాధ్యులు)

మంగళవారం – 07/04/2020

చల్లపల్లి. 

4.03 కు SBI వద్ద
మొక్కలకు ప్రూనింగ్ చేస్తున్న కార్యకర్తలు
SRYSP గోడకు గతంలో వేసిన రంగుల మీద పోస్టర్లు అంటించడం వలన రంగులు పోయాయి. మరల ఈ గోడను సుందరీకరించడానికి ప్రయత్నం చేస్తున్న కార్యకర్తలు.