3320* వ రోజు ....           12-Dec-2024

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!

34 గురి శ్రమజీవన సౌందర్యం - @3320*

          సదరు శ్రమను దక్కించుకొన్న చోటులు

1) బందరు బాటలోని 6 వ నంబరు పంట కాల్వ ప్రాంతమూ,

2) SRYSP కళాశాల ముంగిటి ఉద్యానమూ,

3) గస్తీ గది దక్షిణ భాగమూ!

          పంట కాల్వ పడమటి మినీ ఉద్యానమూ, మూసేసిన వడ్లమర ఎదుటి నడవా డజను మంది కాయకష్టానికి నోచుకొని, శుభ్ర సుందరీకరణలు పొందగా,

          కళాశాల ప్రహరీ వెలుపలి గార్డెన్ లో చాలీచాలని వెలుతురులో 15మంది - నలుగురు మహిళా కార్యకర్తలతో సహా తమ తలా గంటన్నర శ్రమను ధారపోశారు!

          సుందరీకర్తలనబడే పౌరుష నామాంకితులు 3 గ్గురు మాత్రం గంగులవారిపాలెం బాటలో పలుగూ పారలతో శ్రమించి, దూరంగా ఉన్న దిమ్మెను తెచ్చి ప్రతిష్టించారు. అసలే అందంగా ఉన్న ఆ జాగాను ఏదొక శిల్పాన్ని నిలిపి మరింత సౌందర్యమయం చేసే ప్రణాళికట!

          కార్యకర్తల శుభ్ర సుందరీకరణ రుచించని ఆస్పత్రి ప్రాంగణం మాత్రం వదలివేయబడినది!

          మనబోటి వాళ్లకేమో నేటి 3 వందల గజాల వీధి భాగం బాగానే ఉన్నది గదా!అనిపిస్తది. స్వచ్చ కార్యకర్తలకేమో ఆ శుభ్రత, పచ్చదనమూ చాలవు - వాటిలో కలుపులున్నా, ప్లాస్టిక్ లు కన్పించినా ఓర్చుకోలేరు!

          ఈ గురువారం ఉదయం 6:25 కు సమీక్షా సభ దేసు మాధురీ ప్రవచిత నినాదాలతో మొదలై

          డి.ఆర్.కే. వైద్యుని మెచ్చుకోలు తనూ, రేపటి స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి గారి పర్యటనా ప్రస్తావనతోనూ, తత్ ఉపరి గుంటూరు పార్లమెంటు సభ్యుడూ, కేంద్రమంత్రీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖరుని మనుషుల నేటి చల్లపల్లి సందర్శనా సమాచారంతోనూ ముగిసెను.

          కావున స్వచ్చ కార్యకర్తలందరూ వారి ఏకరూపదుస్తులతో అధిక సంఖ్యలో తమ వీధి బాధ్యతలకు ఆహ్వానింపబడుచున్నారు!

          తుది సమావేశంలో నెలవారీ చందా దాత కోడూరి వేంకటేశ్వరరావు 520/- సమర్పించినందుకు కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు!

          రేపటి వేకువ కూడా మనం ఆగవలసిందీ, బాధ్యతలు పంచుకోవలసిందీ - SRYSP, కళాశాల ఎదుటనే?

          ఏమాయలు చేసితిరో

అవార్డులూ, రివార్డులూ అసలగు కొలమానములా?

గుర్తింపులు కీర్తింపుల గొడవలు మనకవసరమా?

ఒక గమ్యం దిశగా మీ ఒక్కొక అడుగును వేస్తూ

ఏమాయలు చేసితిరో స్వచ్ఛోద్యను కర్తలార!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   12.12.2024