3321* వ రోజు ....           13-Dec-2024

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!

3321* న వేకువ శ్రమ సందేశం!

          శుక్రవారం (13.12.24) వేకువ 4:15 నుండే అది మొదలై 2 గంటలకు పైగా జరిగి 6:20 కి ముగిసింది!

          ఓహోయ్ - మేము కాంగా శ్రమదానంతో ఊరిని ఉద్ధరించేస్తున్నాం! రండి చూడండిఅని ఆర్భాటం చేయకుండా, 33 మంది భిన్న నేపధ్యాల కులాల మతాల లింగాల స్వచ్చ కార్యకర్తలు 11 ఏళ్ళుగా ప్రకటిస్తున్న సామాజిక బాధ్యతా నిశ్శబ్ద సందేశమది!

          ఈరోజు కాకున్నా - మరో 10 ఏళ్లకైనా ప్రతి గ్రామ పౌరుడూ పాటించక తప్పని బాధ్యత అది!

          బందరు వీధిలో రాజద్రవ్యనిధి (SBI) ప్రాంతాన ఒకానొక ఆస్పత్రి వద్ద మినహాయించి, 200 గజాల దాక మందుల షాపుల, తినుబండార శకటాల, పండ్ల దుకాణాల కార్యాలయాల, వాహన రిపేర్ల షెడ్ల మాలిన్యాల్ని తుడిచేసిన చర్య!

          ఈ కార్యకర్తల్లో ఎవరు కత్తుల్తో గడ్డీ పిచ్చి మొక్కలు తొలగించారో, కూరల వ్యర్ధాల కంపు ప్రక్కన శ్రమించారో, ఉద్యానాల్లో చొరబడి, పూల మొక్కల పాదులు తీర్చిదిద్దారో, ఎవరెన్ని చెత్త డిప్పలు మోసి, ట్రాక్టర్ కు అందించారో, మోకాలి నొప్పితో కూడ గంటన్నరకుపైగా ఎవరెవరు ఏ పనులు చేశారో వివరించలేనుగాని

          ఒక సమష్టి శ్రమదానంతో అందమైన విశాలమైన - శుభ్రమైన వీధి మాత్రం ఇప్పుడు మనకళ్లెదుట ఉన్నది. సదరు వీధి భాగాన్ని చూసుకొంటూ సంతృప్తులైన ధన్యులు కనిపిస్తున్నారు!

          పురాతన కళాశాల గేటు ముందర సమావేశమైన కార్యకర్తలు ముందుగా ఆసుపత్రి సిబ్బంది వేల్పూరి ప్రసాదు నినాదాల్ని పునరుచ్ఛరించి, DRK గారు వివరించిన గుంటూరు MP గారి ప్రతినిధుల పర్యటనను తెలుసుకొని,

          రేపటి వేకువ సన్ ఫ్లవర్ (మునసబు) వీధి వద్ద కలువవలెనని నిర్ణయించుకొని, 6:45 కు ఇంటి ముఖం పట్టారు.

          సమాజానికి వక్తికీ ఒక జారుముడి వేసేసి

కథలు కథలుగ వ్రాయవలసిన కార్యకర్తల కష్టమిచ్చట

భావితరములు నేర్వజాలిన బాధ్యతా నిర్వహణ మిచ్చట

సమాజానికి వక్తికీ ఒక జారుముడి వేసేసి వదలక

ఊరియెడల నిబద్ధతలను ఋజువు పరచే మనుషులిచ్చట!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   13.12.2024