3325* వ రోజు ....           17-Dec-2024

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

116 మందితో గ్రామ సేవల జాతర! - @3324*

          17-12-24 (మంగళవారం) స్వచ్ఛ సుందరోద్యమ చల్లపల్లిలో మరొక చారిత్రాత్మక ఘట్టం! ఆ సన్నివేశానికి వేదిక విజయవాడ రోడ్డులో 6 వ నంబరు కాలువ ప్రాంతం. 40 మంది స్వచ్ఛ కార్యకర్తల తెల్ల టోపీలూ, 76 గురు వామపక్ష కార్యకర్తల – నాయకుల ఎర్ర టోపీలూ కలగలిసి, ½ కిలోమీటరు రహదారినీ, ప్రక్క రోడ్లనూ శుభ్ర - సుందరీకరించిన 2 గంటల కాలం!

          పదేళ్ల చల్లపల్లి శ్రమదానోద్యమంలో ఇలా కార్యకర్తలు శతాధికంగా పాల్గొన్న సందర్భాలు ఏడెనిమిది ఉన్నాయేమో! ఇందులో రెండైతే ఇలా కష్టజీవులో వారి ప్రతినిధులో పాల్గొన్నవే!

          3 రోజుల CPI(M) సభల ఎజెండాలో స్వచ్చంద శ్రమదానంలో పాల్గొనే అంశం కూడ ఉన్నదట! ఇందరు కార్మిక పక్షపాతులే పాల్గొనకపోతే –

          కరెంటు తీగల దాక పెరిగిన చెట్ల కొమ్మలు కొట్టడం గాని, ఎండు కొమ్మల్ని తప్పించి, నరికి, దూరంగా మోసుకెళ్ళి ట్రాక్టర్ లో నింపడంగానీ, పచ్చి తుక్కును షెడర్ లో కుక్కడం గానీ, బాటను ఊడ్వడం గానీ సాధ్యపడకపోను!

          గాంధీ స్మృతివనమూ, విజయా కాన్వెంటు వైపూ రహదారి ఇంతగా శుభ్రపడకపోను!

          అసలు నేటి తాత్కాలిక స్వచ్ఛ కార్యకర్తల ఉత్సాహమూ, ఊపూ వేఱు! వారిలో ఇతర గ్రామ సర్పంచులున్నారు, రాష్ట్రస్థాయి పార్టీ నేతలున్నారు, శ్రమదానంలో పాల్గొనడమే అందివచ్చిన అవకాశంగా భావించారందరూ! మహిళా డేలిగేట్ల ఆనందమైతే మరీనూ! క్రొత్త శ్రమదాతలకిదొక మరపురాని అనుభవమైతే – ప్రాత కార్యకర్తలకు పునరుత్తేజదాయకమన్న మాట!

          అరగంట పాటు – 7:00 దాక – గాంధీ విగ్రహం సాక్షిగా జరిగిన సభలోనే చూడండి – నందేటి శ్రీను నినాదాలకెలా స్పందించారో, అతని పాటకూ – పద్యాలాపనతో ఎలా గొంతులు కలిపి, చప్పట్ల తాళాలు వేసి ఆనందిస్తున్నారో!

          డాక్టరు DRK గారి సముచిత సమీక్షతోనూ, CPM నాయకులు ఉమామహేశ్వరరావు గారి, Y.N.రావు గారి అభినందనలతోనూ, గత ఉద్యమాల – సేవా సందర్భాల స్మృతులతోనూ స్వచ్చ కార్యకర్తలకు కమ్యూనిస్టు వీరులు జేజేల నినాదాలు పలకడంతోనూ తుది సమావేశం ముగిసింది.

          రేపటి స్వచ్చంద శ్రమదాన వేదిక బందరు వీధిలోని భగత్ సింగ్ ఆస్పత్రి వద్దనే!

          పనులు చేయుదమ్మెవరిదొ

పైపై కబురులు చెప్పక పనులు చేయుదమ్మెవరిదొ    

వేకువ బ్రహ్మముహూర్తపు వీధి సేవ చేవెవరిదొ  
గమ్యమ్మును వెంటాడే కర్మవీర వరులెవ్వరొ...

అట్టి స్వచ్ఛ కార్యకర్త కర్పిస్తాం ప్రణామములు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   17.12.2024