3328 వ రోజు ....           20-Dec-2024

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

పదకొండేళ్ల వీధి శ్రమదానోత్సవం! @ 3328*

            శుక్రవారం (20-12-24) ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్న స్వచ్ఛ కార్యకర్తలు + వీధి, గ్రామ ప్రజలు 40+40=80 మంది! పండుగ వేళలు వేకువ 4:206:45!

            పండుగంటే ఏదో పూజ చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, కొండొకచో మేకల్నీ కోళ్ళనీ బలులివ్వడం, మదిరా మత్తులో పడడమనుకొనేరు! ఇక్కడి కార్తకర్తల స్వచ్ఛ సుందరోద్యమ ఉత్సవాలు వేఱుగా ఉంటాయి! అవి బొత్తిగా శ్రమదాన సాత్త్విక ఉద్యమ పండుగలు! ఎలాగంటే:

            వాళ్లు ముందుగా సన్ ఫ్లవర్ వీధి వద్దా, అస్మద్గృహం వెలుపలా గంటకు పైగా శ్రమించారు, ఉద్యానంలోని కలుపును ఏరేశారు, చెట్లనూ, పూల మొక్కల్నీ సుందరీకరించారు, చెదపుట్టల్ని కుళ్లగించారు, వ్యర్ధాల్ని ట్రాక్టర్లోకి చేర్చారు, ఇద్దరం మాత్రం మా ఇంటి అవరణలో చొరబడి, 3 పెద్ద చెట్ల కొమ్మల్ని నరికి, ట్రాక్టర్లో నింపాం!

            ఇవే మరి - పదీ - పదకొండేళ్లుగా స్వచ్ఛ కార్యకర్తలు మహదానందం పొందుతూ చేస్తున్న పనులు! డ్రైన్లలో మురుగు నిలిస్తే వాళ్ళకి నచ్చదు రోడ్ల మీద దుమ్మూ, ఇసుకా, ప్లాస్టిక్ వ్యర్ధాలుంటే సహించలేరు - వీధుల్లో గుంటలు పడితే పూడ్చిందాక నిద్రపోరు - 33 వేల చెట్టు పెంచి, ఊరినీ రహదార్లనీ పూలతో నింపిగాని విశ్రమించరు - తమని 'వెఱ్ఱి వెంగళప్పలు'గా తొలినాళ్ళలో కొందరు జమకట్టినా పట్టించుకోరు అందుకే వీళ్లకి తేడాగాళ్లుఅని పేరు! ఎవరేం చేస్తారులెండి - అది వాళ్ళ కర్మ! ఇది చల్లపల్లి అదృష్టం!!

            5:30 దాక శ్రమించి, అప్పటికి వచ్చిన అతిధి కార్యకర్తలతో వాటర్ ఫౌంటెయిన్ వద్దకు చేరుకున్నారు పదకొండేళ్ల క్రితం ఈ వీధి ఛండాలపు చరిత్ర ఎట్టిదో - ఎవరి శ్రమ ఫలితంగా ఇప్పుడిలా మారిందో గుర్తుచేసుకొన్నారు. కార్యకర్తల శ్రమజీవన సౌందర్యాన్నీ, ప్రజల సామాజిక బాధ్యతనీ నందేటి శ్రీను పాటలుగా విన్పించాడు. స్వచ్ఛ కార్యకర్త పైడిపాముల సర్పంచి నినాదాల ద్వారా శ్రమదాన లక్ష్యాలను చాటి చెప్పితే

            చల్లపల్లి శ్రమదాన స్వభావాన్నీ, గాంధీగిరితో అది నడుస్తున్న తీరునూ, గంగులవారిపాలెం వీధి ఇటీవలి చరిత్రనూ, భవిష్యత్తునూ DRK గారు వివరించారు. ఈ సందడిలో ప్రాతూరి శాస్త్రి గారి 5,000/- విరాళం చెక్కు మనకోసం మనంట్రస్టు బాధ్యునికి అందనే అందినది.  

            రేపటి పని చోటు బహుశా భగత్ సింగ్ గారి ఆస్పత్రి వద్దనే కావచ్చు. మార్పులుండునేమో (మన వాట్సప్ గ్రూపులో చూడగలరు) స్వచ్ఛ సుందరోద్యమ షూటింగ్ లు రేపేనట!

            ఇప్పుడైనా కలిసిరారా?

ఎందుకీ శ్రమదాన సవనమొ ఇప్పుడైనా గ్రహిస్తారా!

ముఖ్యమంత్రే స్వచ్ఛ సుందర కార్యకర్తల మెచ్చుకొంటే

దశాబ్ద సమయపు స్వచ్ఛ యజ్ఞం ధన్యమని శ్లాఘించుచుంటే

గ్రామ శ్రామిక వైభవములో ఇప్పుడైనా కలిసిరారా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   20.12.2024