సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
శనివారం వేకువ కాలపు ముమ్మర కార్యక్రమం - @ 3329*
21-12-24 వేకువ చిల్లల వాగు వంతెన ప్రాంతంలో తొలుత అష్టాదశ కార్యకర్తలూ, పిమ్మట 38 మందీ - వెరసి 56 మంది బెజవాడ రోడ్డు కాలుష్యాల పని పట్టాలనుకొన్నారు. 5-30 వేళకు 6 గురు హైదరాబాదు దృశ్య చిత్రీకరణ నిపుణులు వచ్చి 8-40 దాక వివిధ కోణాల్లో ఈ వాలంటీర్ల పనులను కెమేరా బద్ధంచేశారు.
పది-పదకొండేళ్ల నుండి ఒక మారుమూల చల్ల(ని)పల్లెలో జరిగిపోతున్న అరుదైన - నేటి సమాజానికావశ్యక మైన శ్రమదాన దృశ్యాలను సచిత్రంగా బాహ్యా ప్రపంచానికి తెలియబరచే ఆ యువకుల ప్రయత్నం సఫలీకృతమయింది. రేపు కూడ వారి చిత్రీకరణ జరుగుతుందట!
బాపట్ల పాఠశాల విద్యార్థులూ, ఉపాధ్యాయులూ రేపు స్వచ్చ చల్లపల్లి విశేషాల సందర్శనకు వస్తున్నట్లు తెలిసింది. ఇరుగు-పొరుగు జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఇక్కడి శ్రమదానోద్యమం “ఇది వరకే ప్రచారమై ప్రసిద్ధమై, ప్రభావవంతమయింది.
ప్రభుత్వ పరంగా ఈ గ్రామాన్నొక మోడల్ గా 13 వేల గ్రామాలకూ చూపడమే మిగిలింది!
ఈ గ్రామ స్వచ్చ కార్యకర్తలెప్పుడైనా నిత్య సంతుష్టులే! స్వార్ధం, దురాశా ఉంటే గదా వాళ్లకు నిరాశా నిస్పృహ కలిగేది!
నేటి 3 గంటలకు పైగా కార్యక్రమం ఒకరిద్దరు కార్యకర్తల సహనానికి చిన్న పరీక్షలు పెట్టినా కార్యకర్తలే నెగ్గారు.
అవసరాన్ని బట్టి - ఒక్క మారు కాదు - ఆరేడు మార్లు స్వచ్ఛ, సుందరోద్యమ నినాదాలను ప్రకటించిన వారు పద్మావతి డాక్టరు గారు. ఉత్సాహంతో - క్రమశిక్షణతో మెలిగిన వారు 50 కి పైగా స్వచ్ఛ కార్తలు.
రేపటి వేకువ మన కార్యక్రమం గస్తీ గది దగ్గర అని నిర్ణయించబడింది!
దొడ్డ మనసులు చల్లపల్లి కి దొరకుటే
కుటుంబాలకు శక్తియుక్తులు కొన్ని కేటాయించుకొంటూ
ఊరి నటుపై కుటుంబంగా ఊహలందున నిలుపుకొంటూ
శ్రమను - శక్తిని, రొక్కమును తమ గ్రామమున కర్పించగల
దొడ్డ మనసులు చల్లపల్లి కి దొరకుటే ఒక మహాదృష్టము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
21.12.2024