3331* వ రోజు ....           23-Dec-2024

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!!

27 మంది కష్టం - 3 చోట్లలో - @3331*

          సోమవారం(23-12-24) వేకువ 4.13 కే కార్యకర్తల కృషి ప్రారంభమైనా, బరువు పని గ్రూపు వాళ్లు ముగించేప్పటికి 6.25 దాటింది!

          అప్పుడప్పుడు కలిగే సందేహమేమంటే –“తమ సొంత పనిని కూడ వీళ్లు ఇంతగా, కష్టించి - సమయాన్ని పట్టించుకోకుండా చేస్తారా” అనీ!

          “వయసు మళ్లిన వాళ్లమే - ఉద్యోగాలు చేసుకోవలసిన వాళ్లం గదా – ఇంటి పనులు చక్కబెట్టుకోవలసిన గృహిణులమే – 8 దింటికో, 9 దింటికో వ్యవసాయం పనులుంటాయే... మరి వేకువ 2 గంటలు ఊరి బాధ్యతలు మోసి అలసిపోతే ఎలా?” అనే స్పృహే లేకుండ ఇంత బరువు పనులెలా చేస్తారా - అని!

          ఐతే - నాలాంటి సందేహ జీవులకు వచ్చినట్లు - పనిలో లీనమైన స్వచ్ఛ కార్యకర్తలకు ఇలాంటి అనుమానాలు రావనుకొంటా! అదీ గాక - వ్యక్తులుగా కన్న సమూహంగా ఊరుమ్మడి పనులకంకితులైనపుడు పెరిగే ఉత్సాహం వేఱనుకొంటా!

          ఈ పూట గంటన్నరపాటు శాయినగర్ తొలి వీధి మురుగుకాల్వ త్రవ్వకం గాని, డ్రైనుకడ్డుపడిన 3 క్వింటాళ్ల బరువు గల కాంక్రీటును మోకులు కట్టి, పలుగులు వాడి, ఇద్దరి మోకాళ్ళదాక బురద కొట్టుకొని, లాగుతున్న మోకు పట్టు తప్పి జారిపడినా సరే - అడ్డు తొలగించిన పనినే చూడండి! లేదా –

          పద్మాభిరామం ప్రక్క స్థలంలో 7 గురు గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ కోస్తున్న – దంతెలతో ప్రోగుచేస్తున్న దీక్షనే గమనించండి –

          ఇక్కడికి కాస్త దూరంగా మరొక 7 గురు మాజీ DSP గారి ఇంటి వెనకా, సన్ ఫ్లవర్ కాలనీ వీధిలో చెమట పట్టేలా శ్రమిస్తున్న తీరునే పరిశీలించండి!

          “అయ్యో! మన వొళ్ల కందిపోతదే - కత్తులు విసరీ విసరీ చేతులు బొబ్బలెక్కుతవేమో ఎలా...! “ అనే దిగులు ఎవరిలోనైనా కనిపించిందేమో కనిపెట్టండి.

          6.30 తరువాత, కాఫీల పిదప, అందరూ సాధనాల సతీష్ ననుసరించి స్వచ్చ – సుందరోద్యమ నినాదాలు పలికి – ఇటీవల గుడివాడలో, బెజవాడలోని హరిత వేడుకల్ని ప్రశంసించుకొని,

          రేపటితో గంగులవారిపాలెం వీధి పనులు ముగించాలనుకొని, ఇళ్ళు చేరారు!

          మంకు పట్టు వదల లేదు!

ఉత్సాహంలోపించదు - ఉల్లాసం తరగలేదు

ఎన్ని వేల రోజులైన ఈ పయనం ఆగలేదు

పారిశుద్ధ్య నిర్వహణకు, పచ్చదనం పెంపుదలకు

కంకణధారులు తమతమ మంకు పట్టు వదలలేదు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   23.12.2024