సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!!
ఎన్నో విశేషాలతో ప్రత్యేక దిన శ్రమ వేడుక - @3333*
బుధవారం నాడు (25-12-24) వాన తుంపరనూ, చలిపులినీ లెక్కచేయక - 37 గురు నికర కార్యకర్తలూ, పదిమంది ఇతరులూ బైపాస్ వీధిలోని ఉప్పల వారి రోడ్డు వద్ద 4:18 కే బాధ్యతలకు సిద్ధపడటం తొలి విశేషము!
పనిదినం వరుస సంఖ్యను చూశారు గదా - నాలుగు మూడుల అరుదైన నంబరన్నమాట! అందుకే గదా - పల్నాటి భాస్కర సమేత అన్నపూర్ణ గారి 1000/- రూపాయలను (తమ కుమారుడు ప్రేమ్ తరుణ్ జన్మదినం సందర్భంగా) ట్రస్టు ఖర్చులకు విరాళమిచ్చినది? ఇక శంకర శాస్త్రి గారు ఊరుకుంటారా - ఆయన వితరణ నేటి పని దినం సంఖ్యా సూచకంగా - 3,333/-
ఇక - ఈ మానవలోకంలో అత్యథికు లవలంబించే మత విశ్వాసం క్రైస్తవానికి - సరిగ్గా 2024 సంవత్సరాల నాడు ఇదే రోజు పుట్టిన ఏసుక్రీస్తుని పండుగ మరో విశేషం!
ఆ పర్వదిన సందర్భంగా మన స్వచ్ఛ కార్యకర్త, గ్రామ ప్రథమ మహిళ కృష్ణకుమారి దంపతులు కేకు కోసి అనల్పాహార విందును కార్యకర్తల కందించడమూ విశేషమే!
ఎక్కడో - అమెరికా - ఉత్తర కరోలినా డాక్టరమ్మ - కోట పద్మావతీ దంపతుల తనయ సుస్మిత తన ఇద్దరు కవలు - ఆర్యన్, స్మయాన్ లతో బాటు వేకువ బురద వీధి సేవలకు దిగడమూ, ఉద్యమ ఖర్చులకు ఆర్యన్ దాచుకున్న 8 వేల ధనం సమకూర్చడమూ, ప్రతి కార్యకర్తకు సాదరంగా పండ్ల పెట్టెనందించడమూ పెద్ద విశేషం!
అసలీ భూప్రపంచంలో- 40 మంది చలి చీకటి వేళ గ్రామ సమాజానికి తలా గంటన్నర శ్రమార్పణం చేయడం ఈ చల్లపల్లిలో తప్ప ఎక్కడా జరగని విశేషమే కదా!
ఈ తెల్లవారు జామున ఈ 30-40 మంది స్వచ్ఛ సైనికులే కష్టించకపోతే :
- బైపాస్ వీధిలో ఉప్పల, యడ్ల వారి వీధుల నడుమ రోడ్ల అంచుల పల్లాలు పూడేవా?
- ఎవరో పంచాయతీ పైపు లీకును సరిచేయడానికి త్రవ్విన మట్టి దిబ్బ రాకపోకలకాటంకపరుస్తుంటే - గునపాల్తో పొడిచి, పారల్తో మట్టిని డిప్పలకెత్తి మోసి, వీధి మార్జిన్ల గుంటలు పూడేవా? ప్రయాణికుల అసౌకర్యం తొలగేదా?
- వెరసి ఈ బాట ఇప్పుడున్నంత శుభ్ర - సుందరంగా మారేదా?
ఇందుకే “శ్రమయేవ జయతే” అనే సామెత! దాన్ని చెప్పి వదిలేయక - వేల రోజులుగా ఆచరిస్తున్న చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలదే ఘనత!
రేపటి శ్రమదానం కోసం బైపాస్ వీధిలో ప్రాత ప్రభుత్వాసుపత్రి వద్దనే కలవాలనేదే నేటి నిర్ణయం!
చిట్టచివరికి గొప్ప వ్యసనము!
గ్రామమునకొక స్వచ్ఛ సుందర కార్యకర్తగ మారుటనగా :
ఎంతసులభమొ అంత కష్టము - ఎంత లాభమొ అంత నష్టము
తలచుకొంటే చిన్న పని అది - బోధపడితే మంచిపని అది
పోనుపోనూ చాల మధురము - చిట్టచివరికి గొప్ప వ్యసనము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
25.12.2024