3340* వ రోజు ....           01-Jan-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

ఆంగ్ల సంవత్సరాది బుధవారపు శ్రమ వినోదం @3340*

         1-1-2025 వేకువ 4.15 కే నూతన సంవత్సర శ్రమదానం శుభారంభం. ప్రారంభ స్థలం భగత్ సింగ్ దంత వైద్యశాల నుండే. శ్రమ ఆగింది 6.15 కు చంటి హోటల్ దగ్గర అంటేసుమారు అర కిలో మీటరు బందరు వీధిన్నమాట!

         ఈ ½ కిలోమీటరు బాట ప్రక్కనే బ్రతికున్న చేపల కొట్టూ, రిలయన్స్ స్మార్ట్ బజారూ, 2 క్రొత్త మద్యం దుకాణాలూ, భోజన - అల్పాహార అంగళ్లూ, రామాలయమూ, మసీదూ, మాంస విక్రయ షాపులూ, మేదర్ల వస్తు తయారీలూ, మందుల షాపులూ వగైరాలు.

         ఏక మాత్ర వినియోగ ప్లాస్టిక్ సామాన్లూ, మందు గ్లాసు బుడ్లూ సగం గోతానికే దొరికినవి. ఇసుకా, దుమ్మూ మాత్రం బాగానే దొరికినవి. ప్లాస్టిక్ సంచులూ, పనికిరాని కూరలూ, కాగితాలూ తగుమాత్రంగా లభ్యం. అనగా కార్యకర్తల చీపుళ్లకేతప్ప, కత్తులకు పని దొరకలేదు!

         44 మందీ 2 గంటల పాటు చేసిన పని ఇదేనా మరి? కాదు 6 గురు వీధిలోని ఇసుకా దుమ్మూ ట్రాక్టర్ నిండా ఎత్తి, గంగులవారిపాలెం దగ్గరి రోడ్డు ప్రక్క పల్లాలను పూడ్చి వచ్చారు.

         సన్ ఫ్లవర్ కాలనీలోని రాతి ముక్కల వ్యర్ధాలను నూకరాజు గారి కోరికతో మరొక ట్రక్కులోకెత్తుకొని, వీధి మార్జిన్ గుంటలు పూడ్చింది కూడా ఈ అర డజను మందే!

         నలుగురైదుగురు సజ్జావారి వీధిలో గనిడిక ప్రహరీని సర్వాలంకృతం చేయడం పూర్తయినట్లే ఉన్నది.

         గ్రామస్తులు వీలుచూసుకొని ఆ వైజయంతపు గోడలనూ క్రొత్త సంవత్సరంలో కొంగ్రొత్త స్వచ్చ శుభ్ర సౌందర్యపూరితమైన బందరు వీధిని చూడవలెనని విన్నపం!

         దంత వైద్యశాల ముంగిట 6.35 కు జరిగిన సమీక్షా సభ కార్యకర్తలకు చాల రోజులు గుర్తుంటుంది. అప్పుడు నూతన సంవత్సర చిహ్నంగా కేకుల పంపకం జరిగింది; రాయపాటి రాధాకృష్ణ గారి మనుమరాలు నాట్యం కూడ కరతాళములనందుకొన్నది.

         ఈపూట కార్యకర్తల కోరిక మేరకు స్వయంగా నినాదాలు చెప్పినదీ, సమీక్షించినదీ DRK గారు! పౌర బాధ్యతను గుర్తు చేసే మంచి పాటనాలపించినది నందేటి వారు!

         రేపటి వేకువ సుజికి మోటార్ల వద్ద కలవాలని నిర్ణయింపబడినది.

         ఎట్టకేలకు గ్రామ బాధ్యత

మన దశాబ్ది సేవలతో - మన సమున్నత ఆశయముతో

పట్టువదలని శ్రమలతో - మన నట్టు సడలని సహనములతో

స్వచ్ఛ - సుందర ఊసుపట్టని ప్రజానీకం హృదయములలో

ఎట్టకేలకు గ్రామ బాధ్యత పుట్టుచుండుట చూచుచుంటిమి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  01.01.2025