3344* వ రోజు....           05-Jan-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

ఆదివారం (5.1.25) నాటి వీధి శ్రమదాన చర్యలు @ 3344 

         వీధి బందరు మార్గంలోనిది ; ప్రాంతం చాలా వరకు నిన్నటిదే – ATM ల, దేవాలయాల, పెట్రోలు బంకుల, 3 రోడ్ల ముఖ్య గ్రామ కేంద్రమే! ఈ 300 గజాల రోడ్డు బారునా కొబ్బరి బోండాలు – కూరలు- పిండి మిల్లులు- టిఫిన్ బళ్లు- ఎరువుల కొట్లు .. మొత్తం 30-40 ఉండగా కార్యకర్తల కెంత పనైనా దొరుకుతూనే ఉంటుంది.

         కార్యకర్తలైతే 37 గురు కాక- అతిథి కార్యకర్తలు 8 మంది. షాపుల వాళ్ళెవరూ ఇందులో లేరు. ఇటు సంత వీధి మొదలు బెజవాడ రోడ్డు దాక – 4.18 నుండి 6.20 మేర చీపుళ్ళ, దంతెల, పారల పనులే.

         గణేష్ ప్రెస్ దగ్గర మురుగు తూములో దూర్చిన తల ఎవరిదా అని చూద్దును గదా – అది రామానగరానికి చెందిన కార్యకర్త రాజు గారిది! అక్కడే ప్లాస్టిక్ వ్యర్థాలడ్డు  పడితే లాగేస్తున్నాడు!

         పెట్రోలు బంకు ఎదుటి సందులో ఆరేడుగురు ఊడ్చి, ఏరినవి ఐదారు డిప్పల దుమ్మూ – ఇసుకా- ప్లాస్టిక్, గాజు బుడ్లూ, కప్పులూ!

        సచివాలయం దగ్గర డ్రైన్  లోంచి పోగేసిన తుక్కూ, తోడిన సిల్టు తక్కువేం కాదు!

         NTR పార్కును గత వారం రోజులుగా పారలు, పలుగులు, కత్తుల్తో శుభ్రపరచి, పనిముట్లు అప్పగిస్తూ 5 గురు వాకర్స్ Dr. DRK గారితో అంటుంటే విన్నాను- “ పార్కును ఈ మాత్రం అందంగా తయారు చేసిన తర్వాత గాని, ఇంత పెద్ద ఊరును బాగు చేయడంలో స్వచ్చ కార్యకర్తలెంత కష్టపడుతున్నారో మాకు తెలిసొచ్చింది. కనీసం మేం నడిచే పార్కునైనా ఇక మీద మేమే బాగు చేసుకుంటాం” అని!

         ఎవరి వీధిని, డ్రైన్లను వాళ్లు ఇలా శుభ్రపరచుకోవాలనే  మార్పే గదా స్వచ్చ సుందర కార్యకర్తల ఆశయం! ఏ శుభ్ర – సుందరీకరణైనా బాధ్యతాయుతమైన శ్రమతోనే గదా సాధ్యం?

         రెండేసి గంటల దుమ్మూ – ధూళీ – మురికి పనుల తర్వాత నినాదాల సమయంలో ఎవరి ముఖాన్ని చూసినా సంతృప్తి నిండి ఉండగా – అది చూసి DRK వైద్యుడు మరింత సంతోషిస్తుండగా – ఊరి నడి బొడ్డున గల మందుల దుకాణం ఉద్యోగి నారగం శ్రీనివాసు అక్కడి భజన శబ్దాలతో పోటీ పడుతూ ముమ్మారు నినదించగా- ఉచ్ఛస్వరంతో నందేటి  శ్రీనివాసుడు ఆలపిస్తున్న ఆలోచనాత్మక గేయానికి కార్యకర్తలు కరతాళాలతో ప్రతి స్పందిస్తుండగా  నేటి శ్రమ సందడి ముగిసింది!

గతంలో చాలా మార్లు ఇచ్చినట్లే వాసిరెడ్డి కోటేశ్వర రావు గారి జ్ఞాపకార్థం వరి సతీమణి రాజేశ్వరి గారు 20,000/- ల  విరాళం చెక్కును పంపినందుకు స్వచ్చ కార్యకర్తల ధన్యవాదాలు.(కోటేశ్వరరావు మాస్టారు 2019 జనవరి 5 వ తేదీన కాలం చేశారు).

 

         డా. గోపాల కృష్ణయ్య గారి క్రమం తప్పని 2000/- ల నెలవారీ చందాకు మనః పూర్వక ధన్యవాదాలు.   

         రేపటి 3 రోడ్ల కూడలి శుభ్ర – సుందరీకరణ కోసం ATM ల వద్దనే కలుద్దాం! 

             ప్రజల మధ్యన పనికి దిగితే

ఉన్న దొక్కటే పుట్టినూరు – కన్న ఋణమును తీర్చమన్నది

ఎందరెందరి  త్యాగ ఫలమో – సమాజము ఈ మాత్రమున్నది

దూర దూరం నిలిచి చూస్తే భారమెంతని భయం వేస్తది!    

ప్రజల మధ్యన పనికి దిగితే బాట మంచిగ  కానుపిస్తది.

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  05.01.2025