సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!
36 గురి ప్రమేయంతో 3347* వ నాటి వీధి పారిశుద్ధ్యం!
బుధవారం - 8/1/25 వ నాటి శ్రమానందం కూడ నాగాయలంక రోడ్డులోనే! నిన్నటి ఊడ్పులు ముగిసిన పొట్టి శ్రీరాములు వీధి వద్ద నుండి గదా నేటి వేకువ మొదలు కావలసింది! నిన్నటి వలెనే – 4:20 ప్రాంతంలో 15 మంది కలుసుకొన్నది కూల్ డ్రింకు షాపుల వద్దనే!
అక్కడ ప్రారంభమయింది మరొక విడత చీపుళ్ల పని. 6:25 దాక శ్రీను మోటార్ల వద్దనూ, RTC బస్ ప్రాంగణం ఇన్ గేటు వద్దనూ చీపుళ్ల గరగరలు విన్పిస్తూనే ఉన్నాయి. ఈ అర కిలోమీటరు బాటలో నిన్న శుభ్రపరచిన చోటు సగం ఉన్నది. ఐనా ఎక్కడే గడ్డిపరక కన్పించినా, దుకాణ వ్యర్ధాలు పొడగట్టినా, అక్కడ వంగి బాగుచేయనిదే కార్యకర్తలకు సంతృప్తి ఉండదు!
పెట్రోలు బంకు ప్రాంతం నిన్న తీర్చిదిద్దినదే గాని, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరి మినీ ఉద్యానం లోపలి సంగతో? అక్కడ బాగా పెరుగుతున్న 2 చెట్ల కొమ్మల మాటేమిటి? క్రింద పెరుగుతున్న గడ్డీ, పిచ్చి మొక్కల్ని చూసీ చూడనట్లు వదిలేస్తారా! చివరికి ఆ కాస్త సెంటున్నర జాగాలోనే అన్నీ కలిపి సగం ట్రాక్టరు వ్యర్ధాలు తయారు కాలేదా?
మరీ వేకువ సంగతలా ఉంచి, 5.45 - 6.25 నడుమ – వెలుతురు పరుచుకొంటున్న వేళ చూడాలి స్వచ్చంద శ్రమదానం పరవళ్ళు! బస్ స్టాండు దగ్గర ఆ సమయంలోనే వాళ్ళ సొంతానిక్కాక – ఊరి కోసం ఆ డజను మంది శ్రమత్యాగధనుల కష్టమెలాంటిదో - ఆ సమయం విలువెంతో గ్రహించాలి!
ఒక సామూహిక సత్కర్మాచరణంటే ఏమిటో - దాని శక్తి ఎంతటిదో - ఆ అరగంట పనులు చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది! ఎందుకీ పది - పదకొండేళ్ల శ్రమ నీరాజనం అవిచ్చిన్నంగా - అవిఘ్నంగా విజయవంతమౌతున్నదో – తెలతెలవారే ఆ సమయాన ఏ కార్యకర్త ముఖాన్ని పరిశీలించినా బోధపడుతుంది! ఈ దుమ్ము ఊడ్పుల - మట్టి గోకుడుల పనుల మాధుర్యమేమిటో గ్రహించవచ్చు!
6:35 కు 30 మంది కి పైగా గ్రామ శ్రామికులు ముచ్చటగా ఒకచోటనే నిలిచి, అడపా గురవయ్య నినాదాల్నీ, సూక్తుల్నీ వింటూ, DRK వైద్యుని అభినందనలందుకొంటూ, చప్పట్లు చేస్తూ ఉన్న సన్నివేశం ఎంత విశిష్టమైనదో ఆలోచించండి!
నాగాయలంక రోడ్డును కాక, రేపటి వేకువ బెజవాడ బాటలో - అగ్రహారం ప్రవేశం వద్ద కలుసుకోవాలని నిర్ణయమైనది!
రావివారిపాలెం వాస్తవ్యులు పరుచూరి పిచ్చియ్య – యార్లగడ్డ శోభారాణి దంపతులు స్వచ్చ చల్లపల్లి ఉద్యమ ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలను ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేశారు.
స్వచ్ఛ సుందర కర్మవీరము!
అద్భుతాలకు ఆలవాలము - అన్నిదానములందు శ్రేష్ఠము
ఆత్మ సంతృప్తికి నిధానము - అవకతవకల పరిష్కారము
శ్రమించువాళ్లకి గ్రామమునకూ ఉభయతారకమైన మంత్రము
అవిఘ్నంగా - దశాబ్దంగా స్వచ్ఛ సుందర కర్మవీరము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
08.01.2025