3348* వ రోజు ....           09-Jan-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

నేటి వీధి శుభ్రతలు 3348* వ నాటిది - (09.01.2025)

         బుధవారం వేకువ 4.19 కే మొదలై 6.25 దాక జరిగిన ఆ ప్రయత్నాలు 33 గ్గురివి. నాగాయలంక రోడ్డు కాలుష్యాల పని పట్టాక ఈ వేకువ కార్యకర్తలు ఎంచుకొన్నది విజయవాడ బాటలో సెంటరు మొదలు కుడి మలుపు దాక! ఐతే - ఈ 250 గజాల వీధిలోనే అందరు కార్యకర్తలు రెండేసి గుంటలు చేయడానికేమున్నదనుకోవద్దు! ఉన్న కథంతా అక్కడే ఉన్నది మరి!

         చిన్నా - పెద్దా పాతిక ముప్పై గుంటలున్నవి, ఒకప్పటి ఆంధ్రా బ్యాంకు వద్ద సుమారైన డంపూ, దాన్ని చుట్టుకొని ఉచ్చ మడుగులూ ఉన్నాయి, ఊడ్చే కొద్దీ తరగని ట్రక్కు సగానికి సరిపడా దుమ్మూ – ఇసుకా ఉన్నాయి, దుమ్ము కొట్టుకుపోయిన ఫ్లెక్సీలూ కలవు, మూతబడిన కోట గోడ షాపుల వద్ద పెరుగుతున్న పిచ్చి మొక్కలూ, గడ్డీ పుష్కలంగా ఉన్నవి!

         మరి - ఇన్ని వీధి అవకరాల్ని రోజంతా అక్కడి షాపుల వాళ్లు ఎందుకు సహిస్తున్నారు? ఈ ఊరికి చెందని స్వచ్చ కార్యకర్తలు సైతం వాటిని ఇంత కష్టపడి ఎందుకు సరిదిద్దుతున్నారు?

         3 వీధుల మయానా, మూలమలుపు దగ్గరా 2 గంటలు తదేకంగా ఊడ్చిన సుందరీకర్తలు ఇళ్ళ దగ్గర పనుల్లేకనా వచ్చింది? అందులో ఒకామైతే మరీనూ – అంతెత్తు పోలీసు గూడు మీదకెక్కి తుడిచి, శుభ్రపరచాలా? అని అడిగితే ఏం చెపుతాం - కొందరి జీన్స్ అంతేనేమో మరీ!

         మోటారు వాహనదారులు సరే – సైకిళ్ళ వారూ, పాదచారులైనా ఒక్క నిముషం అక్కడి ఆగి, “అరె! ఈ 30 మందికీ ఇంత చలిలో ఇన్ని మురికి పనులు చేయవలసిన – ఊడ్చిన దూమ్మూ - ఇసుకలతో అన్ని వీధి గుంటలు పూడ్చవలసిన అగత్యమేమిటి?” అని ఆరాతీయరా? ఊరంతటి బాధ్యతలన్నీ వీళ్ళకే పట్టాలా?” అని ఆలోచించరా?

         “డ్రైన్ పైన క్రొత్తగా వచ్చిన రేకుల షెడ్డేమిటి” అని వార్డు, పంచాయతీ బాధ్యులు గానీ, ప్రజలు గానీ ప్రశ్నించరా? కొద్ది దూరంలో అందమైన మూత్రశాలలుండగా మూతబడిన బ్యాంకు భవనం వద్ద అ కంపు మడుగులేల?

         ఇలాంటి ప్రశ్నలకు సరైన జవాబులు దొరికిన్నాడు గదా – ఈ ఊరు నిజమైన “స్వచ్ఛ శుభ్ర - సుందర చల్లపల్లి” అనేపేరు సార్థకమయేది?

         ఈనాటి వీధి శుభ్రతా బాధ్యుల్లో ఒక కస్తూరి విజయుడు ముమ్మారు ఉద్యమ నినాదాలు చేయగా -

         మొక్కలు నాటడంతో సహా రానున్న 3 రోజుల పని ప్రణాళికను DRK గారు వివరించగా -

         నేటి వలెనే అగ్రహారం వీధి మొదటనే రేపటి మన కలయికగా నిర్ణయించి, నేటి కార్యక్రమ సమాప్తి!

        ఎట్లు తీర్తురొ కార్యకర్తల ఋణం

పూల మొక్కలు పండ్ల జాతులు పుష్కలంగా నాటినందుకు

వరుసగా తమ వీధులన్నిట స్వచ్ఛ శుభ్రత పెంచినందుకు

చల్లపల్లికి దేశ పటమున స్థానమును కల్పించినందుకు

ఎట్లు తీర్తురొ కార్యకర్తల ఋణం గ్రామపు విజ్ఞలందరు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  09.01.2025