3352* వ రోజు ....           13-Jan-2025

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

130 మంది జనంతో భోగి వైభోగం - @3352*

         అది 13/1/25 - సోమవారం నాడు - సన్ ఫ్లవర్ కాలనీ వీధిలోనిది. అందులో సగం మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తలే. భాగ్యనగరి నుండీ, బెజవాడ తదితర ప్రాంతాల నుండీ, ఊళ్ళో సగం వార్డుల నుండీ వచ్చినవారూ, తధితరులూ,

         “దేశవ్యాప్తంగా చెప్పుకొంటున్న స్వచ్ఛ - సుందర చల్లపల్లి ఉద్యమ విజయ రహస్యమేమిటి? దశాభ్దానికి పైగా – 4 లక్షల పనిగంటలుగా – నిస్వార్ధంగా – గ్రామ ప్రయోజనాత్మకంగా జరుగుతున్న అక్కడి శ్రమదాన సంగతేమిటి?” అనేవి ప్రత్యక్షంగా చూసి  పోవాలనే పట్టుదలతో తెలవారక ముందే వచ్చిన ఇద్దరు ప్రొఫెసర్ల మాటల్లో:

         “ఇలాంటి సామాజికోద్యమం చల్లపల్లికి పరిమితం కారాదు, ఈ స్వచ్ఛ సైనికులొక్కక్కరు పదేసి గ్రామాల్లో దీన్ని వ్యాపింపజేయాలి, ప్రభుత్వం తరవున పరిశీలకులం వచ్చి, దీన్ని అధ్యయనం చేసి, అన్ని గ్రామాల్లో దీన్నెలా అమలు చేయాలో ఆలోచిస్తాం!”

         నేటి శ్రమదాన పండుగైతే 4.19 కే మొదలయింది. నిన్నటి వీధి పారిశుద్ధ్యం తరువాయిగా – వీధి సగం నుండి తూర్పుగా 100 గజాల బారునా కత్తుల, దంతెల, పారల, డిప్పల పనులన్నీ యధాప్రకారం నెరవేరాయి.

         నలుగురు ధైర్యశాలురు ఒక పాముల పుట్ట చుట్టూ పెరిగిన చిట్టడవిని - ఎండు వరిగడ్డినీ శుభ్రం చేశారు. సుందరీకర్తలిద్దరు ముగ్గురు క్రొత్తగా వేసిన సిమెంటు బాట అంచుల లోపాల్ని సరిజేశారు.

         అప్పుడు - 5.40 తరువాత మొదలయింది - కడియాల వారి ఇళ్ల దగ్గర భోగి సందడి! ఇటు శ్రమసందడి, అటు పండగ సందడి! అవన్నీ ముగిసే సరికి 8:00 అయింది! ఒక వంక పండగ సంప్రదాయాలూ, అంతకు ముందు అదే చోట ప్రజోపయోగకర క్రొత్త ఉద్యమ ప్రయోగాలూ!
         అంతకుముందు కొన్ని పండుగలు 1 వ వార్డు వద్దా
, కొన్ని ATM సెంటరు లోనూ జరుగగా, ఈ సన్ ఫ్లవర్ కాలనీ దగ్గర ఇది వరుసగా 3 వ భోగి ఉత్సవం!

         మానవ విలువలూ, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ కాలంలోనేడిక్కడ జరిగిన ఉభయ వేడుకలూ భవిష్యదాశా కిరణాలు.

         సంక్రాంతి పాటలకు బాలికల, స్త్రీల నృత్యాలూ, చిన్నారులకూ కొండొకచో ఇద్దరు ద్వితీయ బాల్యస్తులకూ భోగి పళ్ల వేడుకలూ, నందేటి వాని ప్రబోధ గీతాలూ, దిక్కులు పిక్కటిల్లుతూ బృందావనుడి స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలూ.... ఇవన్నీ మళ్లీ సంక్రాంతి దాక గుర్తుంటాయి!

         పండుగ వంటల రుచులు చూపించి, ఇంత విజయవంతమైన ఉత్సవ కారకులైన కడియాల భారతి కుటుంబీకులు ప్రశంసనీయులు!

         రేపటి మన శ్రమదాన సంక్రాంతిని బెజవాడ రోడ్డులోని HDFC బ్యాంకు వద్ద ఆగి నిర్వహిద్దాం!

         స్వచ్ఛ సుందరోద్యమమా!

వచ్చువారినే కలుపుక, రాని వారిపై అలగక

సహన గుణం ప్రదర్శించి, అహంకారమును జయించి

పదేళ్లుగా ఊరి కొరకు పాటుబడిన - సాధించిన

స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామములు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  13.01.2025