3359* వ రోజు ....           20-Jan-2025

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

కోమలానగర్ లోనే 3359* వ శ్రమ వేడుకలు!

          తేది 20/1/25, ఆదివారం కాదు - సోమవారం! ఐనా ‘తగ్గేదేలే’ అన్నట్లు 40 మంది కోమలానగర్ ముఖ్య వీధి చివర్లో రోడ్ల, కొన్ని ఖాళీ స్తలాల దుమ్ము దులిపేశారు. ఐతే ఇందులో దాలిపర్రు మూలాలు గలిగి, సినీ దిగ్గజ దర్శ కేంద్రుడు K.రాఘవేంద్రుని వదిన గారు వాణి, హైదరాబాదు నుండీ, ఆమె చెల్లెలు వీణ చెన్నై నుండీ వచ్చి పాల్గొన్నారనుకొండి.

          ఈ సోదరీమణులిద్దరికీ స్వచ్చ కార్యకర్తల 2 గంటల శ్రమరీతుల్ని చూస్తూ ఆశ్చర్యానందాలు పొందడంతోనే సరిపోయింది. ఏ క్రొత్తవారైనా వారికొకింత సామాజిక స్పృహ ఉంటే చాలు - ఈ వాలంటీర్ల శ్రమ విన్యాసాలిలా విస్తు గొలుపుతూనే ఉంటాయి మరి!

          ఇందరు కారకర్తల దెబ్బకు 2 అడ్డ రోడ్ల, ఒక ముఖ్య బాట కాలుష్యాలు జడిసి పారిపోకుంటాయా? ప్రధాన వీధి కటూఇటూ ఖాళీ స్తలాలు పాక్షికంగా – శుభ్రపడకుంటాయా? పైగా వచ్చి పనిలో దిగిందెవరు? ఒక యువక బృందమూ పాస్టరు కొండపల్లి డేవిడూ, గత సమయపు వార్డు సభ్యురాలూ, రెవిన్యూ సిబ్బందీ, వగైరా!

          అక్కడ తరతమ హోదాలుండక - ఎవరే పనైనా పూర్తి చేసవతల పారేస్తారాయే! డజను మంది మహిళా కార్యకర్తలు వేకువ చలిని సవాలు చేస్తూ చీపుళ్లందుకొంటే వీధి వీధంతా శుభ్ర సుందరంగా మారకేం చేస్తుంది?

          “ఏమైనా సరే 3 వ రోజైనా ఈ కోమలానగర్ వీధి చివరికంటా వంకబెట్టలేనట్లు – ఇది స్వచ్చ సుందర చల్లపల్లి వీధనుపిచుకొనేట్లు చేయాలి” అనే 5 గురి పని ఒడుపు చూశారా!

          ఒక్క మెతుకు పట్టి చూస్తే అన్నం సంగతి తెలిసిపోయినట్లు - ఈ ఒక్క వేకువ శ్రమదానం దగ్గరగా పరిశీలిస్తే అర్థమైపోతుంది – ఎందుకీ గ్రామం లక్షలాది ఊళ్ళలో ప్రత్యేకంగా మారిందో!

          పని స్తలానికి వెళ్తే చాలు - 60,70, 80 ఏళ్ల వాళ్ళకి కూడా పని పూనకం వచ్చేస్తుంటుంది!

          6.35 తరువాత - ఒకరు బిస్కట్లు పంచితే ఇంకొకరు ఉసిరికలు పంచితే - అప్పటి స్వచ్చ కబుర్లాలకిస్తే – ఇదేదో బలవంత బ్రాహ్మణార్ధం కాదు – శ్రమ వేడుక అని తెలిసిపోతుందా లేదా?

          శనివారం సాయంత్రం విశాఖలో సన్మానితుడైన శాస్త్రీజీకి మరొకమారు శాలువా కప్పి అభినందిస్తుంటే - ఆయనేమో సన్మానాలు నాకెందుకు – కష్టించే కార్యకర్తలకు కదా?” అన్నారు!

          నందేటి శ్రీను కంఠ మాధుర్యానికీపూట కావలసినంత పని! మరి - ఆనందంతో మనసు నిండిన వాణీ - వీణలు ఈ కార్యక్రమాన్ని మెచ్చకుంటారా?

          రేపటి శ్రమ వేడుక కోమలానగర్ ప్రధాన వీధి చివరిలో!

          మనం చూసిన – చూడకున్నా

మహాద్భుతములు జరుగు తుంటవి మనం చూసిన - చూడకున్నా

జరిగి పోయిన పిదప మాత్రం చరితగా అది మెచ్చుకొన్నా

వారి భాగస్వామ్యముండదు! స్వచ్ఛ సుందరపల్లిలోనూ

అట్టిదేగద మేటి ఉద్యమమదైనా గమనించలేరా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  20.01.2025