సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
3360* వ శ్రమదానం కోమలా నగర్ మరో వీధిలో!
మంగళవారం వేకువ (21-1-25) 2 గంటల - 24 మంది ప్రయత్నం సూర్యప్రకాశరావు మాస్టారి - కోడూరు వారి అడ్డ వీధిలో జరిగింది. స్థానిక మహిళలిద్దరూ. చివర్లో కలిసిన మరో ఇద్దరూ కార్యకర్తల సంఖ్యను 28 కి పెంచారు.
అదేంటో - ఉత్తరాయణ కాలంలోనూ చలీ - మంచూ విర్రవీగుతూనే ఉన్నాయి. ఏదో ముగ్గుర్నలుగురు మహిళలు తప్ప, వేకువనే రంగవల్లులు తీర్చిదిద్దే మహిళలు ఆ వీధిలో కన్పించలేదు.
ఐతే - స్వచ్ఛ కార్యకర్తల చలీ, వణుకూ దృఢ నిశ్చయంతో 4.00 కు బయల్దేరినప్పుడే సగం తగ్గి, పని స్థలంలో కాలుష్యాలను చూడగానే మిగతా సగం మాయమయింది. నేటి పని సార్ధకమయింది కోడూరు వెంకటేశ్వరరావుగారి ఇంటి పరిసరాల్లో. అతని ఇంటి వెనుక స్థలం చిన్నదే గాని - 20 మంది కార్యకర్తలకు చేతి నిండా పని కల్పించింది. అక్కడే మూడొంతుల ట్రాక్టర్ నిండింది.
అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి చెట్లూ, ముళ్ళకంపా, ప్రాకిన తీగలూ, ఎవరు వేశారో తెలియని కొబ్బరి బొండాల వ్యర్ధాలూ, సీసాలూ, ఎంగిలాకులూ - ఒకటేమిటి - అన్ని రకాల చెత్తలూ గంటకు పైగా వాలంటీర్లను ముప్ప తిప్పలు పెట్టాయిగాని, అంతిమ విజయం శ్రమదాతలదే!
5.40 దాక కార్యకర్తలతో బాటు పనిచేసిన ప్రక్కింటి గృహస్తురాలు ఆ వీధిలో ముగ్గులు గీసి, వాటి క్రింద కాప్షన్
“చల్లపల్లి, స్వచ్చ - సుందర రథం సాగుతూనే ఉండాలి” అనీ వ్రాసింది.
ఆమే కాబోలు - కాఫీ వేళకు ముందే కీర దోస ముక్కల్నీ, క్యారెట్ చక్రాల్నీ తెచ్చి, కార్యకర్తలకందించింది! స్థానిక గృహస్తుడొకాయన పూల మొక్కను గ్రామ స్వచ్చ రథసారథికి బహూకరించారు. నేను పంచిన ములగకాయలు కొందరికే అందాయి!
6.35 కు ఆ వీధిలో ఇంకా నిద్రించే వాళ్ళను కోడూరు వెంకటేశ్వరుని నినాదాలు ఉలికిపాటుకు గురిచేశాయి!
మన రేపటి శ్రమస్థలం పెదకళ్లేపల్లి రోడ్డులోని బండ్రేవుకోడు వంతెన వద్ద అట!
దశాబ్ది తపః ఫలము
ఏ ఊళ్లో కాలుష్యపు వికట హాసమో అప్పుడు
అదే ఊళ్ళో శుభ్ర - హరిత పకపక విన్పించునిపుడు
ఇది సమష్టి శ్రమ ఫలితము - ఒక దశాబ్ది తపః ఫలము
స్వచ్ఛ సైనికుల కష్టం చాటుతున్న సందేశము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
21.01.2025