సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
బస్ స్టాండు ప్రక్కకు మారిన వేకువ శ్రమ! - @3361*
బుధవారం (22-1-25) వేకువ 4.18 కే నేటి 24 గురు కార్యకర్తల్లో సగం మంది పెదకళ్లేపల్లి బాటలోని బండ్రేవుకోడు వంతెన దగ్గర హాజరు. కాని, వాళ్ళ శ్రమ ఎక్కువగా ఖర్చయింది మాత్రం బస్ స్టాండుకు తూర్పు దుకాణ సముదాయాల 100 గజాల మేరలోనే!
ఒకటో రెండో టీ - టిఫెన్ల అంగళ్లు మాత్రం 5.30 కే తెరుచుకొన్నాయి గాని, గృహస్తులు మాత్రం వాకిళ్ళో, కిటికీలో తెరచైనా 6.30 దాక తమ సమీపంలోని శ్రమను తొంగి చూడనైనా లేదు! ఒక్క పాక హోటల్ యజమాని మాత్రం కార్యకర్తలతో బాటు, అరగంటపాటు పనిచేశాడు!
ఈ ప్రాంతంలో కార్యకర్తల పనులు జరిగి సంవత్సరం పైనే కావడం చేత - మురుగు కాల్వ గాని, 2 ఇళ్ల ఎదుటి చిన్న ఖాళీలు గానీ, బండ్రేవుకోడు వంతెన పార్శ్యాలు గానీ - ఎంత ముదనష్టంగా ఉండాలో - అంత వికారంగా ఉన్నాయి!
బస్ ప్రాంగణ దక్షిణపు మూల ట్రాక్టర్ల షెడ్డునుకొంటా - అదైనా కాస్త తీరుగా ఉన్నదా అంటే - లేదుగాక లేదు!
ఉన్నదే 2 డజన్ల మంది, బాగు చేయాలనుకొన్నదేమో వంతెన దక్షిణాన కొంతదాక, పూర్తిగా కాకున్నా బొటాబొటీగానైనా పని పూర్తిచేశారంటే - అది కార్యకర్తల – పట్టుదల మరి!
అక్కడికీ ఒక పాటల శ్రీను గతంలో అడవి తంగేడు ముల్లు దిగి, నిన్న సర్జరీ జరిగిన కుడి చేయి బొటన వ్రేలుతోనే పనిని సాగించాడు! మరి - 6.00 కు ముగియవలసిన శ్రమదానం అరగంట లేటయిందంటే - అవ్వదా?
ఒకరిద్దరు కార్యకర్తలకేమో మురుగు కాల్వ గట్టు భూమిలో కప్పడిన ప్లాస్టిక్ దరిద్రాల్ని త్రవ్వి, ఏరి, వాటి అంతు చూడాలని ఉన్నా – 3 వ విజిలు మ్రోగడంతో ఇక కుదర్లేదు.
పంచాయతి ఉద్యోగి బండి శరత్ రెగ్యులర్ స్వచ్చ కార్యకర్తకర్తగా మారినట్లే ఇక!
నేటి తుది సమావేశంలో సమీక్షకుడు ఈ వేకువ శ్రమను అంచనా వేసి, అడపా గురవయ్య గట్టిగా నినాదాలు విన్పించి, పనిలోపనిగా మంచి సూక్తులు ప్రకటించి
రేపటి వేకువ శ్రమదానం కళ్లేపల్లి బాట వంతెన నుండి అని తెలుసుకున్నాం!
శివరాంపురం సాక్షిగ!
నిన్న దాక కోమలానగర్ – నేటి నుండి పెదకళ్లే
పల్లి రోడ్డు బాగుచేత ఉల్లాసం నింపుక
చేసేద్దాం ఊడిగములు చిత్తశుద్ధితోడుగ
శివుని రాత్రి పర్వదినం, శివరాంపురం సాక్షిగ!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
22.01.2025