సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
మరొక విశిష్ట శ్రమదానం P.K. పల్లి రోడ్డులోనే - @3363*
అది 24-1-25 – శుక్రవారం వేకువ 4.20 - 6.22 నడిమి 2 గంటల నిడివికలది; 30 మంది శ్రమ వీరుల పనితనాలు చూపినది; 150 గజాల వీధి పారిశుద్ధ్య సుందరీకృత కార్యక్రమమది: చేసిన వారికీ, చూసిన వారికీ తప్ప - అక్కడి గృహస్తులకు సైతం పట్టనిది; ఐతే - అది ఎందుకంత విశిష్టమైనది? అంటే :
చాల మంది పదేపదే చెప్పేట్లుగా అదొక పిచ్చి మనుషుల గుంపు! వేకువ 3 – 3 ½ కే లేచి, ఊరికి దూరంగానైనా సరే – మంచైనా, వానైనా లెక్కచేయక – నిర్దిష్ట ప్రదేశంలో కలుసుకొని, అస్తవ్యస్తపు వీధి భాగాన్ని నిష్టగా పరిశుభ్రపరచందే హాయిగా నిద్రపట్టని పటాలమది! అసలేరకమైన స్వార్థమూ లేకుండా - ఈ పాడు కాలంలో ఇంతటి మురికి – కరకు – బరువు పనులెలా చేస్తారో ఇప్పటికీ కొందరు నమ్మలేని చర్యలు మరి!
ఈ ప్రత్యేకమైన కార్యకర్తలు ఆగింది విజయా జూనియర్ కళాశాల దగ్గర, దండెత్తింది కల్యాణ మండపం, ఫీడ్ మిల్లుల మధ్య కాలుష్యాల మీద, 2 మురుగు కాలువలు వాళ్ళ దృష్టిని తప్పించుకోలేదు, ఈమధ్యనే ప్రభుత్వం సరిదిద్దిన రోడ్డు తూర్పున పల్లాలుంటే, వాటిని సరిచేయక వదల్లేదు, ప్లాస్టిక్ తుక్కుల్నీ, గాజు బుడ్లనీ ఉపేక్షించలేదు.
ఒక కస్తూరి శ్రీను బరువైన మలాటుతో కాంక్రీటుల్ని తునాతునకలు చేస్తుంటే, మరొక సజ్జా ప్రసాదూ, విజయుడూ మురుగు మెరక దిబ్బల్ని త్రవ్వి, డిప్పలకెత్తి వీధి మార్జిన్ల గుంటలు సరిజేస్తుంటే, జాస్తి, అడపా వారి కత్తులు పిచ్చి చెట్ల పనిబడుతుంటే – అరేడుగురు మహిళలు మురుగు వాసనలు లెక్కచేయక150 గజాల వీధిని ఊడుస్తుంటే.... ఇక వీళ్ళని తిక్క మనుషులనుకోవాలో సామాజిక బాధ్యతా మూర్తులనుకోవాలో మీరే చెప్పండి!
3 మార్లు పని విరమణ బూర మ్రోగినా అయిష్టంగా పని ముగించే వాళ్లు పరుల కోసం పని వ్యసన పరులనాల్నా?
6.35 సమయంలో విజయా జూనియర్ కాలేజి ఎదుట 30 మందీ నిలబడి, గురిందపల్లి ఇందిర నాయకత్వంలో 3 మార్లు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు పలికి, నేటి కఠిన శ్రమను Dr.DRK గారు మనసారా మెచ్చి,
25 వ తేదీ విహారయాత్ర వివరాల్ని ప్రకటించి రేపటి ఉదయం సైతం ఈ కళ్ళేపల్లి వీధిలోనే కలవాలని నిర్ణయించుకొని, గృహోన్ముఖులయ్యారు!
పొంగిపోవ మీదినం (18-1-25)
అవహేళనలెదురైతే అసలు క్రుంగలేదు మనం
అభినందన పరంపరకు పొంగిపోవ మీదినం (18-1-25)
ఆద్యంతం సహనగుణం అవలంబించాం గనుకే
స్వచ్ఛోద్యమ రథం కదలి సాగుతోంది ముందుకు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.01.2025